గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారత్కు 107వ స్థానం

 గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారత్కు 107వ స్థానం

న్యూఢిల్లీ: గ్లోబల్ హంగర్ ఇండెక్స్ జాబితాలో భారత్ ర్యాంక్  దిగజారింది. ఐరిష్ ఎయిడ్ ఏజెన్సీ కన్సర్ వరల్డ్ వైడ్ , జర్మనీకి చెందిన  వైల్డ్ హంగర్ హిల్ఫ్ సంస్థలు సంయుక్తంగా ప్రకటించిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ దేశాల జాబితాలో పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ కంటే భారత్ వెనుకంజలో ఉంది. 116 దేశాలకు గానూ 2021లో ప్రకటించిన జాబితాలో 101వ స్థానంలో నిలిచిన భారత్... ఈ ఏడాది 121 దేశాల జాబితాలో 107వ స్థానంలో నిలిచింది. ఇండియా ర్యాంక్ గతేడాది కంటే 6 స్థానాలు దిగజారింది. చైనా, టర్కీ, కువైట్ తో సహా 17 దేశాలు 5 కంటే తక్కువ జీహెఐ స్కోర్ తో టాప్ ర్యాంక్ లో నిలిచాయి. జీహెచ్ఐలో భారత్ ర్యాంక్ దిగజారడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

ఇది చాలా సీరియస్ సమస్య అని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి పి.చిదంబరం అన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేళ్లలో భారత ఆర్ధిక వ్యవస్థ రోజు రోజుకు దిగజారిపోతోందని చెప్పారు. దానికి ఇలాంటి నివేదికలే సాక్ష్యమని తెలిపారు. మొత్తం 22.4 కోట్ల భారతీయులు ఆకలితో అలమటిస్తున్నారని పేర్కొన్నారు. పోషకాహారలోపం, ఆకలితో  పిల్లల్లో పెరుగుదల ఆగిపోతోందని, వీటి గురించి పీఎం మోడీ ఎప్పుడు మాట్లాడుతారో చెప్పాలని చిదంబరం ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.