అమెరికా నుంచి LPG దిగుమతికి ఒప్పందం.. చరిత్రలో తొలిసారిగా..

అమెరికా నుంచి LPG దిగుమతికి ఒప్పందం.. చరిత్రలో తొలిసారిగా..

LPG Imports from US: అమెరికాతో టారిఫ్ వార్ తగ్గించేందుకు మోడీ సర్కార్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. గత నెలలో క్రూడ్ దిగుమతులను రష్యా నుంచి తగ్గించి అమెరికా నుంచి పెంచిన సంగతి తెలిసిందే. దీని తర్వాత పెద్దన్న ట్రంప్ ఒత్తిడితో మరిన్ని దిగుమతులకు భారత్ వెళుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ చర్యలతో ఇటీవల ట్రంప్ ఇండియాతో డీల్ దాదాపుగా చివరి దశకు చేరుకుందని ఒక సంతృప్తికరమైన కామెంట్ చేయటం ఒక సీక్వెన్స్ ప్రకారం జరుగుతోంది. 

తాజాగా కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ అమెరికాతో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అదే మన ఇంట్లో వాడుకునే వంట గ్యాస్ దిగుమతులకు చారిత్రాత్మక ఒప్పందం ఒకటి జరిగినట్లు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. భారత్ పెరుగుతున్న ఒత్తిడితో తన ఇంధన అవసరాల సమీకరణను వ్యూహాత్మకంగా డైవర్సిఫై చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో దేశంలోని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు అమెరికాతో ఏడాది పాటు 2.2 మిలియన్ టన్నుల గ్యాస్ దిగుమతికి ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించారు. 

2026లో భారత గ్యాస్ అవసరాల్లో 10 శాతం అమెరికా నుంచి దిగుమతి కాబోతున్నట్లు హర్దీప్ చెప్పారు. ఇది ప్రజలకు కూడా ఎల్పీజీ ధరల భారం పెరగకుండా దోహదపడుతుందని చెప్పారు. ఇందులో భాగంగా 2026లో ప్రభుత్వ చమురు కంపెనీలు అమెరికా గల్ఫ్ తీర ప్రాంతం నుంచి చమురు దిగుమతులు చేపట్టబోతున్నాయి. ఇది తొలి అధికారిక ఒప్పందంగా తెలుస్తోంది. 

ALSO READ : వచ్చే ఏడాది యాపిల్‌‌‌‌కి కొత్త సీఈఓ? 

ఈ ఒప్పందానికి కొన్ని నెలల ముందే ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలకు చెందిన ఉన్నత అధికారులు అమెరికాలోని ఉత్పత్తి సంస్థలతో మాట్లాడి.. వారి ప్లాంట్లను సందర్శించినట్లు పూరీ వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ధరలు పెరుగుతున్నప్పటికీ భారత కంపెనీలు మాత్రం ప్రజలకు తక్కువ ధరలకే గ్యాస్ సరఫరా చేస్తున్నాయని ఈ సందర్భంగా పూరీ వెల్లడించారు. గత ఏడాది ధరలు 60 శాతం పెరిగినప్పటికీ దేశంలో ఆ స్థాయిలో ధరలను కేంద్రం పెంచలేదని చెప్పారు. ఇది ప్రభుత్వంపై రూ.40వేల కోట్ల అదనపు భారాన్ని కలిగించిందని వెల్లడించారు.