IND vs ENG 2025: తడబడిన టీమిండియా.. రెండో సెషన్‌లో ఇంగ్లాండ్‌కు మూడు వికెట్లు

IND vs ENG 2025: తడబడిన టీమిండియా.. రెండో సెషన్‌లో ఇంగ్లాండ్‌కు మూడు వికెట్లు

ఇంగ్లాండ్ తో మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా తొలి రోజు రెండో సెషన్ లో తడబడింది. తొలి సెషన్ లో ఒక్క వికెట్ కూడా కోల్పోని మన జట్టు రెండో సెషన్ లో మూడు కీలక వికెట్లు కోల్పోయింది. తొలి రోజు టీ విరామ సమయానికి 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. క్రీజ్ లో సాయి సుదర్శన్ (26), పంత్ (3) ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్, స్టోక్స్, డాసన్ తలో వికెట్ తీసుకున్నారు. ఈ సెషన్ లో 71 పరుగులు చేసిన టీమిండియా జైశ్వాల్, రాహుల్, గిల్ వికెట్లను కోల్పోయింది. 

వికెట్ నష్టపోకుండా 78 పరుగులతో రెండో సెషన్ ప్రారంభించిన ఇండియా ప్రారంభంలోనే రాహుల్ లాంటి కీలక వికెట్ కోల్పోయింది. 46 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రాహుల్.. క్రాలీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో తొలి వికెట్ కు 96 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది.   కొంతసేపటికి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న జైశ్వాల్ (58) డాసన్ బౌలింగ్ కు చిక్కాడు. డిఫెన్స్ ఆడే క్రమంలో స్లిప్ లో బ్రూక్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. టీ విరామానికి ముందు గిల్ కూడా ఔట్ కావడంతో టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి కాస్త వెనుకంజలో ఉంది.

స్టోక్స్ బౌలింగ్ లో బంతిని సరిగా అంచనా వేయలేక గిల్ బంతిని వదిలేశాడు. బంతి ప్యాడ్లకు తగలడంతో ఇంగ్లాండ్ అప్పీల్ చేసింది. అంపైర్ ఔటిచ్చినా.. గిల్ రివ్యూ తీసుకున్నాడు. రివ్యూలో బంతి వికెట్లను తగులుతున్నట్టు చూపించడంతో టీమిండియా కెప్టెన్ 12 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ కు చేరాడు.