భారత్ ఏం ధర్మసత్రం కాదు.. శరణార్థులపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు

భారత్ ఏం ధర్మసత్రం కాదు.. శరణార్థులపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ప్రపంచంలో ఉన్న శరణార్థులకు ఆశ్రయం కల్పించడానికి ఇండియా ఏం ధర్మసత్రం (Free Shelter) కాదని సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శ్రీలంక శరణార్థి పిటిషన్‌ను కొట్టేసిన సందర్భంలో అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. తక్షణం శరణార్థులు భారత్‌ను వీడాలని -సుప్రీంకోర్టు ఆదేశించింది. శరణార్థులకు భారత్‌లో ఆశ్రయం ఇవ్వలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టి్స్ కె వినోద్ చంద్రన్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. 2015లో ఎల్టీటీఈతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన శ్రీలంక దేశస్తుడి పిటిషన్పై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.

2018లో ట్రయల్ కోర్టు (తొలుత ఈ కేసు విచారించిన కోర్టు) అతనికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. 2022లో మద్రాస్ హైకోర్టు అతని శిక్షను ఏడేళ్లకు తగ్గించింది. అయితే.. శిక్షా కాలం పూర్తి కాగానే భారత్ వదిలి శ్రీలంకకు వెళ్లిపోవాలని.. శ్రీలంక వెళ్లేంతవరకూ శరణార్థుల శిబిరంలో ఉండాలని ఆదేశించింది. అయితే.. తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఈ శ్రీలంక దేశస్తుడు తన దేశంలో తనకు ప్రాణ హాని ఉందని, కుటుంబంతో ఇండియాలోనే ఉండిపోతానని అభ్యర్థించాడు. తన భార్య, పిల్లలు కూడా ఇండియాలోనే స్థిరపడ్డారని కోర్టుకు తెలిపాడు.

ALSO READ | మొసలి కన్నీళ్లు వద్దు.. మంత్రి విజయ్ షాపై సుప్రీంకోర్టు ఆగ్రహం

అతని పిటిషన్పై స్పందించిన.. జస్టిస్ దీపాంకర్ దత్తా.. ఇండియా ఏమైనా ప్రపంచంలో ఉన్న శరణార్థులందరికీ ఆశ్రయం ఇచ్చే ప్రదేశమా..? ఇప్పటికే ఇండియా 140 కోట్ల జనాభాతో సతమతమవుతోంది. ఇతర దేశస్తుల శరణార్థులకు ఆశ్రయం ఇవ్వడానికి ఇండియా ఏం ధర్మశాల కాదని జస్టిస్ దీపాంకర్ దత్తా వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 21, ఆర్టికల్ 19 ప్రకారం ప్రాథమిక హక్కుల్లో భాగంగా పిటిషనర్కు స్వేచ్ఛగా జీవించే హక్కు ఉందని.. ఈ అభ్యర్థన అందుకే కోర్టు దృష్టికి తీసుకొచ్చామని పిటిషనర్ కౌన్సిల్ వాదించింది. అయితే.. జస్టిస్ దత్తా ఈ వాదనపై స్పందిస్తూ.. ఆర్టికల్ 19 కేవలం భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తుందని, ఇండియాలో స్థిరపడటానికి పిటిషనర్ కు ఏ హక్కు ఉందని ప్రశ్నించారు. శ్రీలంకలో తనకు ప్రాణ హాని ఉంటే.. మరే దేశమైనా వెళ్లాలని సూచించిన సుప్రీం కోర్టు పిటిషన్‌ను కొట్టేసింది.