
రాజ్‌గిర్ (బిహార్): ఆసియా కప్ హాకీ టోర్నీలో ఇండియా బోణీ చేసింది. శుక్రవారం జరిగిన పూల్–ఎ తొలి మ్యాచ్‌లో 4–3తో చైనాపై గెలిచింది. ఇండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (20, 33, 47వ ని.) హ్యాట్రిక్ సాధించగా, జుగ్‌రాజ్ సింగ్ (18వ ని.) అండగా నిలిచాడు. షిహవో డు (12వ ని.), బెన్‌హల్ చెన్ (35వ ని.), జీషెంగ్ గావో (41వ ని.) చైనాకు గోల్స్ అందించారు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఇండియా అనుకున్న ఫలితాన్ని రాబట్టినా.. ఆటలో చాలా లోపాలు కనిపించాయి.
ఆటను దూకుడుగా మొదలుపెట్టిన ఇండియా.. అవకాశాలను మాత్రం అందిపుచ్చుకోలేకపోయింది. మ్యాచ్ మొత్తంలో వచ్చిన 11 పెనాల్టీ కార్నర్లలో కేవలం నాలుగు మాత్రమే సద్వినియోగం చేసుకున్నారు. స్టార్టింగ్‌లో సంజయ్ సింగ్ ఇచ్చిన పాస్‌ను మన్‌దీప్ సింగ్ గోల్‌గా మల్చడంలో ఫెయిలయ్యాడు.
చైనా గోల్ కీపర్ వీహావో యాంగ్ అద్భుతంగా నిలువరించాడు. 12వ నిమిషంలో షిహావోడు కొట్టిన పెనాల్టీతో చైనా 1–0 లీడ్‌లో నిలిచింది. ఫస్టాఫ్ ముగిసేసరికి మరో రెండు పెనాల్టీలు వచ్చినా అభిషేక్, హర్మన్‌ప్రీత్ వృథా చేశారు. రెండు వైడ్‌గా వెళ్లాయి. ఆట 18వ నిమిషంలో జుగ్‌రాజ్ కొట్టిన పెనాల్టీతో ఇరు జట్ల స్కోరు సమమైంది. మరో రెండు నిమిషాల తర్వాత హర్మన్ బాల్‌ను నెట్‌లోకి చేర్చి లీడ్‌ను 2–1కు పెంచాడు.
వెంటనే తేరుకుని చైనా కొట్టిన పెనాల్టీ కార్నర్ వైడ్‌గా వెళ్లింది. హాఫ్ టైమ్‌కు ముందు హర్మన్ వరుసగా ఫ్లిక్స్ చేస్తూ పెనాల్టీ కార్నర్‌లను సాధించాడు. కానీ వీహోవో ఎడమ్ వైపు డైవ్ చేస్తూ అద్భుతంగా సేవ్ చేశాడు. రెండో హాఫ్‌లో ఎదురుదాడికి దిగిన చైనా ఇండియా
డిఫెన్స్‌ను ఛేదించే ప్రయత్నంలో కొన్ని తప్పిదాలు చేసింది. 39వ నిమిషంలో మన్‌దీప్ ఫౌల్ కారణంగా పెనాల్టీ స్ట్రోక్ లభించింది. దీన్ని హర్మన్ గోల్‌గా మల్చలేకపోయాడు.
కానీ చైనా రెండు గోల్స్ కొట్టి స్కోరును 3–3తో సమం చేసింది. రెండు జట్లు ఎదురుదాడులకు దిగడంతో అవకాశాలు చేతులు మారాయి. చివరకు 47వ నిమిషంలో మూడో పెనాల్టీని హర్మన్ గోల్‌గా మలిచి జట్టును 4–3తో ఆధిక్యంలో నిలిపాడు. చైనా చివరి నిమిషం వరకూ ప్రయత్నించినా స్కోరు సమం చేయలేక ఓడిపోయింది. మ్యాచ్‌కు ముందు జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని మేజర్ ధ్యాన్‌చంద్‌కు నివాళులు అర్పించారు.
మరో మ్యాచ్‌లో జపాన్ 7–0తో కజకిస్తాన్‌ను చిత్తు చేసింది. పూల్–బి తొలి మ్యాచ్‌లో మలేసియా 4–1తో బంగ్లాదేశ్‌పై నెగ్గింది. చైనీస్ తైపీతో జరిగిన మ్యాచ్‌లో కొరియా 7–-0తో ఘన విజయం సాధించింది. కాగా, ఆదివారం జరిగే తమ రెండో మ్యాచ్‌లో ఇండియా.. జపాన్‌తోతలపడనుంది.