
- ఏటీఎంలు మూసేస్తారని అబద్ధపు వార్తలు
- ఫ్యాక్ట్ చెక్‌తో ఎప్పటికప్పుడు పీఐబీ క్లారిటీ
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆన్లైన్లో పలు తప్పుడు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రజలను భయాందోళనలకు గురిచేసేలా ఉన్న ఈ ఫేక్ న్యూస్ పై అధికారులు ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తున్నారు. సరిహద్దుల్లో హైటెన్షన్ నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత ఏర్పడే అవకాశం ఉందంటూ ప్రచారం జరిగింది. పెట్రోల్ పంపుల వద్ద భారీ క్యూలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా పాకిస్తాన్ సరిహద్దును ఆనుకుని ఉన్న రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, పంజాబ్‌లలో ప్రజలు భయంతో ఎక్కువ ఫ్యూయెల్ కొంటున్నారు. అయితే అది తప్పుడు వార్త అని, నమ్మొద్దని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) శుక్రవారం స్పష్టం చేసింది. మన దేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ (ఎల్‌పీజీ) నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని వెల్లడించింది. ప్రజలు అనవసరంగా భయపడి ఎక్కువ స్టాక్ కొనుగోలు చేయాల్సిన పని లేదని స్పష్టం చేశాయి. ఈ మేరకు శుక్రవారం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) విడివిడిగా ప్రకటనలు జారీ చేశాయి.
పాక్ మీడియాలో ఫేక్ ప్రచారం..
జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీలో సైనిక బ్రిగేడ్‌పై ఆత్మాహుతి దాడి, పంజాబ్‌లోని జలంధర్‌లో డ్రోన్ దాడి జరిగినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అబద్ధమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) వెల్లడించింది. అదంతా ఫేక్ న్యూస్"గా పేర్కొంది. తమ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ పరిశీలనలో.. జమ్మూ కాశ్మీర్‌లో ఎలాంటి సైనిక క్యాంటన్మెంట్‌పై ఆత్మాహుతి దాడి జరగలేదని తెలిపింది. ఓ వ్యవసాయ క్షేత్రంలోని చెలరేగిన మంటల వీడియోను జలంధర్‌లో డ్రోన్ దాడి జరిగినట్లుగా ఫేక్ ప్రచారం చేశారని వివరించింది. పాకిస్తాన్ మనదేశంపై క్షిపణి దాడి చేసినట్లు సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో కూడా ఫేక్ అని నిర్ధారించింది. ఆ వీడియో 2020లో లెబనాన్‌లోని బీరూట్‌లో జరిగిన పేలుడు దాడికి సంబంధించినదని తేల్చింది. పాకిస్తాన్ మీడియా, సోషల్ మీడియా హ్యాండిల్స్ భారతీయ ప్రజల్లో భయాన్ని రేకెత్తించే ఉద్దేశంతోనే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని పీఐబీ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. అసలు "20 రాజ్ బెటాలియన్" అనే యూనిట్ భారత సైన్యంలోనే లేదని..కానీ ఆ యూనిట్ ను ధ్వంసం చేసినట్లు ఫేక్ వీడియో క్రియేట్ చేశారని తెలిపింది. సైనిక సంసిద్ధతకు సంబంధించి ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ నారాయణ్ పేరిట సోషల్ మీడియోలో ఉన్న సీక్రెట్ లెటర్ కూడా పూర్తిగా అబద్ధమని వివరించింది. భారత సైన్యం అమృత్‌సర్, దాని పౌరులపై దాడి చేయడానికి అంబాలా వైమానిక స్థావరాన్ని ఉపయోగించుకుందని ప్రచారం అవుతున్నది కూడా ఫేక్ న్యూస్ అని పీఐబీ పేర్కొంది. గుజరాత్‌లోని హజీరా ఓడరేవుపై కూడా ఎలాంటి దాడి జరగలేదని.. ప్రజలు ఏది పడితే అది నమ్మవద్దని కోరింది.
ఏటీఎంలు క్లోజ్ చేస్తారంటూ..
పాక్ తో యుద్ధ పరిస్థితి నేపథ్యంలో ఏటీఎంలకు సైబర్ ముప్పు పొంచి ఉందని, దీనిని నివారించడానికి బ్యాంకులు ఏటీఎంలను రెండు, మూడు రోజులు క్లోజ్ చేస్తున్నాయని మరో ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఈ వార్తపై బ్యాంకింగ్ అధికారులతో పాటు ప్రభుత్వం శుక్రవారం స్పష్టతనిచ్చింది. ఏటీఎంలు క్లోజ్ చేసే ఆలోచన ఏదీ లేదని, అవి యథావిధిగా పనిచేస్తాయని అధికారులు తెలిపారు. ఈ ఫేక్ న్యూస్ కు సంబంధించి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ చేసి నిజానిజాలను ప్రజలకు వెల్లడిస్తోంది.