IND vs AUS: కోహ్లీ, రోహిత్ వచ్చేస్తున్నారు.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు టీమిండియా స్క్వాడ్‌పై క్లారిటీ

IND vs AUS: కోహ్లీ, రోహిత్ వచ్చేస్తున్నారు.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు టీమిండియా  స్క్వాడ్‌పై క్లారిటీ

ఆస్ట్రేలియాతో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు భారత జట్టును త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. అక్టోబర్ 6 లేదా 7న ఆస్ట్రేలియా పర్యటనకు ప్రకటించబోయే భారత వన్డే జట్టుపై ఆసక్తి నెలకొంది. ఎందుకంటే దాదాపు 9 నెలల తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ ఆడబోతుండడమే ఇందుకు కారణం. 2027 వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని స్క్వాడ్ ను ప్రకటించే అవకాశం ఉంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ ప్యానెల్ ఎంపిక చేయబోయే 15 మంది భారత స్క్వాడ్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. 

ఓపెనర్లుగా రోహిత్, గిల్:

వన్డే క్రికెట్ లో టీమిండియా తరపున నిలకడగా ఆడుతున్న గిల్, రోహిత్ ఓపెనర్లుగా బరిలోకి దిగడం ఖాయం. వీరిద్దరూ కెప్టెన్, వైస్ కెప్టెన్ కావడం విశేషం. రోహిత్ వన్డే రికార్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2025 ప్రారంభంలో భారత జట్టుకు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా అందించాడు. మరోవైపు గిల్ గత రెండేళ్లలో వన్డే క్రికెట్ లో అత్యంత నిలకడైన బ్యాటర్ గా పేరు తెచ్చుకున్నాడు.బ్యాకప్ ఓపెనర్ గా జైశ్వాల్ ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

మిడిల్ లో కోహ్లీ, అయ్యర్, రాహుల్:

నెంబర్ 3 స్థానంలో కోహ్లీ ఆడడం ఖయామైపోయింది. నాలుగో స్థానంలో నిలకడగా ఆడుతున్న అయ్యర్ ను తప్పించలేని పరిస్థితి. వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలో అయ్యర్ ఎలాంటి కీలక ఇన్నింగ్స్ లు ఆడాడో తెలిసిందే. ఇటీవలే ఛాంపియన్స్ ట్రోఫీలోనూ టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాదు ఇటీవలే ఆస్ట్రేలియా ఏ తో జరిగిన తొలి వన్డేలో సెంచరీ బాది ఫామ్ లో ఉన్నాడు. ఐదో స్థానంలో రాహుల్ కొనసాగుతాడు. ప్రస్తుతం వన్డేల్లో ఇండియాకు రాహుల్ వికెట్ కీపర్ కూడా. బ్యాకప్ వికెట్ కీపర్ గా పంత్ కోలుకోకపోవడంతో ధృవ్ జురెల్ ను ఎంపిక చేసే ఛాన్స్ ఉంది.      

పాండ్య మిస్.. జడేజాతో పాటు నితీష్, దూబేలకు ఛాన్స్:

ఆస్ట్రేలియా పిచ్ లపై ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్లు చాలా కీలకం. ఈ సిరీస్ కు హార్దిక్ పాండ్య మిస్ కావడంతో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబేలు ఇద్దరూ స్క్వాడ్ లో ఛాన్స్ దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పిన్ అల రౌండర్ గా జడేజా స్థానానికి ఎలాంటి ముప్పు లేదు.     
   
స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్:

ఈ సిరీస్ లో టీమిండియా స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ ను ఎంపిక చేస్తుందా లేకపోతే వరుణ్ చక్రవర్తిని సెలక్ట్ చేస్తుందా అనే విషయంలో ఆసక్తి నెలకొంది. కుల్దీప్ పైనే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫాస్ట్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ లతో పాటు హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ ఎంపికయ్యే అవకాశం ఉంది. 

ఆస్ట్రేలియా సిరీస్ కు భారత జట్టు: 
 
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, యశస్వి జైశ్వాల్, శ్రేయాస్ అయ్యర్, ధృవ్ జురెల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దూబే, మహ్మద్ సిరాజ్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా