IND-W vs ENG-W: టెస్ట్ క్రికెట్ చరిత్రలో అతి పెద్ద విజయం.. భారత్ దెబ్బకు ఇంగ్లాండ్‌ చిత్తు

IND-W vs ENG-W: టెస్ట్ క్రికెట్ చరిత్రలో అతి పెద్ద విజయం.. భారత్ దెబ్బకు ఇంగ్లాండ్‌ చిత్తు

మహిళా టెస్టు క్రికెట్ లో భారత మహిళలు అద్భుతం సృష్టించారు. టెస్ట్ క్రికెట్ లో మహిళలు 300 కొడితే భారీ స్కోర్ గా భావిస్తారు. కానీ మన మహిళా క్రికెట్ జట్టు మాత్రం ఇంగ్లాండ్ తో జరిగిన ఏకైన టెస్టులో 347 పరుగుల భారీ విజయాన్ని అందుకున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సత్తా చాటి మహిళా టెస్టు క్రికెట్ చరిత్రలోనే అతి పెద్ద విక్టరీ నమోదు చేసింది. 1998లో పాకిస్తాన్‌పై శ్రీలంక సాధించిన 309 పరుగుల విజయాన్ని మన మహిళల జట్టు బ్రేక్ చేశారు. మహిళా టెస్టు క్రికెట్ చరిత్రలో 300 పరుగులకు పైగా విజయం సాధించడం ఇది రెండోసారి మాత్రమే. 
  
మూడో రోజు ముగిసేసరికి భారత మహిళల జట్టు 6 వికెట్లకు 186 పరుగులు చేశారు. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండడం.. లీడ్ 400 పరుగులకు దాటిపోవడంతో ఓవర్‌నైట్ స్కోరు వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశారు. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఇంగ్లాండ్ ముందు 478 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లీష్ జట్టు కేవలం 27.3 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్ లో 136 పరుగులకు ఆలౌటైన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో అదే పేలవ ఆటతీరును ప్రదర్శించింది. 

భారత బౌలర్లలో దీప్తి శర్మకు 4, పూజ వస్ట్రాకర్ 3 వికెట్లు తీసుకోగా.. రాజేశ్వరి గైక్వాడ్ 2, రేణుక ఠాకూర్ కు ఒక వికెట్ లభించింది. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ బ్యాటర్లు ఎవరూ కూడా కనీసం 30 పరుగుల మార్క్ టచ్ చేయలేకపోయారు. 21 పరుగులు చేసిన హీథర్ నైట్ టాప్ స్కోరర్. అంతకముందు భారత మహిళలు తొలి ఇన్నింగ్స్ లో 428 పరుగులకు ఆలౌటయ్యారు. ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్ లో 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. హాఫ్ సెంచరీతో పాటు రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 9 వికెట్లు తీసిన దీప్తి శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.               

<