ఒకే  రోజు 10 వేల కేసులు.. కరోనా దుమ్మురేపుతోంది

ఒకే  రోజు 10 వేల కేసులు.. కరోనా దుమ్మురేపుతోంది

దేశంలో కరోనా కేసుల నమోదు దుమ్మురేపుతోంది.. రోజు రోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. నిన్నా మొన్నటి వరకు 5, 6.. 7 వేలు మాత్రమే నమోదు అవుతూ ఉండగా.. ఏప్రిల్ 12వ తేదీ ఒక్క రోజే 10 వేల పాజిటివ్ కేసులు నమోదు కావటం విశేషం. చాపకింద నీరులా క్రమంగా విస్తరిస్తూ వెళుతుంది వైరస్.

జస్ట్ 24 గంటల్లోనే 10 వేల 158 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో దేశంలో యాక్టివ్​ కేసుల సంఖ్య 45 వేలకు చేరినట్లు  కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఎనిమిది నెలల్లో ఈ స్థాయిలో కొత్త కేసులు రావటం ఇదే తొలిసారి. ఎక్స్​బీబీ1.16 అనే వేరియంట్ కారణంగా భారత్​లో కేసుల సంఖ్య పెరుగుతుందని వైద్య వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, ఆసుపత్రుల్లో చేరికలు మాత్రం తక్కువగానే ఉంటున్నట్టు అధికారులు చెబుతున్నారు.  మరో 10 నుంచి 12 రోజుల్లో కొత్త  కేసులు సంఖ్య భారీగా పెరగొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. ఆ తర్వాత కరోనా తగ్గుముఖం పడుతుంది అనేది వైద్య రంగం అంటోంది. అంటే ఏప్రిల్ నెలంతా కరోనా భారీగా ఉండొచ్చని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.  

కరోనా కేసులు పెరుగుతుండటంతో.. ప్రతిఒక్కరూ మాస్కు ధరించాలని.. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. గతంలో అంత తీవ్రత లేదని.. ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య తక్కువగానే ఉన్నా.. ఈ సమయంలోనే మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 24 గంటల్లో కరోనాతో 15 మంది చనిపోయారు. 200 మంది వరకు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ముంబై, ఢిల్లీలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రైవేట్ వార్డులు ఓపెన్ చేశారు.