
న్యూఢిల్లీ: భారత్, అమెరికా మధ్య ఈ ఏడాది జులై 8లోగా తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. తమపై అమెరికా విధించిన అదనపు 26 శాతం టారిఫ్ నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వాలని భారత్ కోరుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 2న విధించిన ఈ అదనపు సుంకాన్ని జులై 9 వరకు.. అంటే 90 రోజుల పాటు నిలిపివేశారు. అయితే 10 శాతం బేస్‌లైన్ టారిఫ్ ఇంకా అమలులో ఉంది.
వ్యవసాయ, పాల ఉత్పత్తులు వంటి సున్నితమైన రంగాలను రక్షించుకోవడానికి కొంత కోటా లేదా కనీస దిగుమతి ధర (ఎంఐపీ)ను భారత్అడగవచ్చని భావిస్తున్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల వాషింగ్టన్‌లో అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్, వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్‌లతో చర్చలు జరిపారు.
ఈ చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని, జులై 8 లోగా తాత్కాలిక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఒక అధికారి తెలిపారు. 26 శాతం అదనపు టారిఫ్, 10 శాతం బేస్‌లైన్ టారిఫ్ రెండూ భారతదేశానికి వర్తించకుండా చూడాలని భారత్ ప్రయత్నిస్తోంది. కార్మికులు ఎక్కువగా ఉండే వస్త్రాలు, తోలు వంటి రంగాలకు రాయితీలు కోరుతోంది.
అయితే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ రేట్ల కంటే తక్కువగా సుంకాలను తగ్గించడానికి ట్రంప్ ప్రభుత్వానికి యూఎస్ కాంగ్రెస్ ఆమోదం అవసరం. రెండు దేశాలు ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఒప్పందంలో మొదటి దశను ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. తద్వారా 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ల డాలర్ల వరకు తీసుకెళ్లాలని చూస్తున్నాయి.
వీటిపై రాయితీ ఇవ్వండి...
మనదేశం వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, తోలు వస్తువులు, దుస్తులు, ప్లాస్టిక్, రసాయనాలు, రొయ్యలు, నూనెగింజలు, ద్రాక్ష, అరటిపండ్లు వంటి వాటిపై విధించే సుంకాల్లో రాయితీలు కోరుతోంది. అమెరికా కొన్ని పారిశ్రామిక వస్తువులు, ఆటోమొబైల్స్ (ముఖ్యంగా ఈవీలు), వైన్స్, పెట్రోకెమికల్ ఉత్పత్తులు, డెయిరీ ఉత్పత్తులు, యాపిల్స్, ట్రీ నట్స్, జన్యుమార్పిడి (జీఎం) ఉత్పత్తులపై సుంకాలను తగ్గించాలని కోరుతోంది.
భారతదేశంలో రెగ్యులేటరీ నిబంధనల కారణంగా జీఎం పంటల దిగుమతికి ఆస్కారం లేదు. అల్ఫా ఆల్ఫా హే (ఒక రకమైన దాణా) వంటి నాన్-జీఎం ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి భారత్ సిద్ధంగా ఉంది. 2024-–25లో అమెరికా వరుసగా నాలుగో ఏడాది భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. ద్వైపాక్షిక వాణిజ్యం 131.84 బిలియన్ డాలర్లకు చేరింది.
సుంకాల ఎఫెక్ట్ను భారత్తట్టుకుంటుందన్న మూడీస్
దేశీయంగా వృద్ధి బాగుండటం, ఎగుమతులపై తక్కువ ఆధారపడటం వల్ల అమెరికా సుంకాల ప్రతికూల ప్రభావాలను, ప్రపంచ వాణిజ్య ఇబ్బందులను భారత్ ఎదుర్కోగలదని మూడీస్ రేటింగ్స్ బుధవారం (May 21) తెలిపింది. ప్రైవేట్ వినియోగాన్ని పెంచడానికి, తయారీ సామర్థ్యాన్ని విస్తరించడానికి, మౌలిక సదుపాయాల వ్యయాన్ని పెంచడానికి ప్రభుత్వం తీసుకునే చర్యల వల్ల భారత్కు ఎంతో మేలు జరుగుతుందని తెలిపింది.
ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం వల్ల వడ్డీరేట్లను మరింత తగ్గించడానికి అవకాశం ఉందని పేర్కొంది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థకు మరింత మద్దతు ఇవ్వవచ్చని మూడీస్తెలిపింది. ఇటీవల పాకిస్తాన్-భారత్ ఉద్రిక్తతలు భారతదేశం కంటే పాకిస్తాన్ వృద్ధిపై ఎక్కువగా ప్రభావం చూపుతాయని స్పష్టం చేసింది. భారత్లోని వ్యవసాయ, పారిశ్రామిక ప్రాంతాలు ఘర్షణ ప్రాంతాలకు దూరంగా ఉన్నాయని తెలిపింది.