యూఎన్ జనరల్ అసెంబ్లీ: పాక్ పై విరుచుకుపడిన భారత్

యూఎన్ జనరల్ అసెంబ్లీ: పాక్ పై విరుచుకుపడిన భారత్

ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ వేదికగా పాక్ పై భారత్ విరుచుకుపడింది. ముంబై ఉగ్రదాడికి కారణం ఎవరని భారత ప్రతినిధి మిజిటో వినితో  ప్రశ్నించారు. పొరుగు దేశాలతో శాంతిని కోరుకుంటున్నానన్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ..టెర్రరిజాన్ని ఎందుకు స్పాన్సర్ చేస్తున్నారో చెప్పాలన్నారు.

సొంత దేశంలోని సమస్యలు చెప్పకుండా... భారత్ కు వ్యతిరేకంగా షెహబాజ్ మాట్లాడుతున్నారని మిజిటో మండిపడ్డారు. భారత్ పై తప్పుడు ఆరోపణలను చేసేందుకే ఈ వేదికను పాక్ ఎంచుకుందన్నారు. భారత్ లో శాంతి కోరుకుంటున్నామని... దాన్ని సాకారం చేసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. 

ఇక అంతకుముందు ఐరాస జనరల్ అసెంబ్లీలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. భారత్ సహా అన్ని పొరుగు దేశాలతో శాంతిని ఆకాంక్షిస్తున్నామని చెప్పారు. దక్షిణాసియాలో సుస్థిరమైన శాంతి, స్థిరత్వం అనేది జమ్మూ కశ్మీర్ వివాదానికి న్యాయమైన, శాశ్వతమైన పరిష్కారంపై ఆధారపడి ఉంటుందన్నారు. జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ 2019లో భారత్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో శాంతి ప్రక్రియకు విఘాతం కలిగిందని చెప్పారు.