పాస్‌పోర్ట్‌ల ర్యాంకింగ్‌లో కిందికి పడిపోయిన భారత్

  పాస్‌పోర్ట్‌ల ర్యాంకింగ్‌లో కిందికి పడిపోయిన భారత్

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ కలిగి ఉన్న జాబితాలో ఫ్రాన్స్ అగ్రస్థానంలో నిలిచింది.  ఇందులో భారత్  గతేడాది కంటే ఒక స్థానం కిందకి పడిపోయి 85వ స్థానానికి చేరుకుంది. గత సంవత్సరం భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు వీసా లేకుండా 60 దేశాలకు ప్రయాణించవచ్చు, ఈ సంవత్సరం ఆ సంఖ్య 62 కి పెరిగింది. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ పాస్‌పోర్ట్‌ల బలం ఆధారంగా దేశాలను ర్యాంక్ చేస్తుంది. 2024లో, 194 దేశాలకు వీసా-రహిత యాక్సెస్‌ను మంజూరు చేసిన పాస్‌పోర్ట్‌తో ఫ్రాన్స్ జాబితాలో అగ్రస్థానంలో ఉంది.

ఫ్రాన్స్‌తో పాటుగా  జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్  దేశాలు టాప్ లో కొనసాగుతున్నాయి.  గత ఏడాది మాదిరిగానే పాకిస్థాన్ 106వ స్థానంలో కొనసాగుతుండగా, బంగ్లాదేశ్ 101వ స్థానం నుంచి 102వ స్థానానికి దిగజారింది. భారత్ కు  పొరుగున ఉన్న మాల్దీవులు బలమైన పాస్‌పోర్ట్‌ను కలిగి ఉంది.  మాల్దీవులు  58వ స్థానంలో కొనసాగిస్తోంది.  

ఇరాన్, మలేషియా,  థాయ్‌లాండ్‌లు భారతీయ పర్యాటకులకు వీసా-రహిత ప్రవేశం కల్పిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన తర్వాత కూడా భారత్  ర్యాంకింగ్స్‌లో పడిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.  హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రపంచవ్యాప్తంగా 199 విభిన్న పాస్‌పోర్ట్‌లు , 227 ప్రయాణ గమ్యస్థానాలను కవర్ చేస్తూ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) ప్రత్యేక డేటా ఆధారంగా గత 19 సంవత్సరాల  నుండి ర్యాంకింగ్‌లను అందిస్తుంది.