5 లక్షల కోట్లకు చేరిన సాఫ్ట్‌‌‌‌వేర్ ఎగుమతులు

5 లక్షల కోట్లకు చేరిన సాఫ్ట్‌‌‌‌వేర్ ఎగుమతులు
  • 2020–21 డేటాను విడుదల చేసిన ఎస్‌‌‌‌టీపీఐ

న్యూఢిల్లీ: ఆర్థిక సంవత్సరం 2020–21 లో  ఎస్‌‌టీపీఐ కింద రిజిస్టర్‌‌‌‌ అయిన సాఫ్ట్‌‌వేర్ కంపెనీల ఎగుమతులు రూ. 5 లక్షల కోట్లను దాటాయి.  కరోనా సమస్యలున్నప్పటికీ, డిజిటలైజేషన్‌‌ వేగంగా విస్తరించడం, ఐటీ కంపెనీలు కూడా సమర్ధవంతంగా వర్క్‌‌ ఫ్రమ్‌‌ హోమ్‌‌ విధానాలను అమలు చేయడంతో సాఫ్ట్‌‌వేర్ ఎగుమతులు పెరిగాయి. సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ టెక్నాలజీ ఫార్క్స్‌‌ ఆఫ్ ఇండియా(ఎస్‌‌టీపీఐ)  విడుదల చేసిన డేటా ప్రకారం 2020–21 లో  ఈ సంస్థ కింద రిజిస్టర్ అయిన ఐటీ కంపెనీల సాఫ్ట్‌‌వేర్ ఎక్స్‌‌పోర్ట్స్‌‌ రూ. 5.01 లక్షల కోట్లుగా ఉంది. ఇది ఆర్థిక సంవత్సరం 2019–20 లో రూ. 4.66 లక్షల కోట్లుగా నమోదయ్యింది.   ‘సాఫ్ట్‌‌వేర్ ఎగుమతుల గ్రోత్‌‌ 6–7 శాతంగా ఉంది. వర్క్‌‌ఫ్రమ్‌‌ హోమ్‌‌ విధానంతో ఐటీ కంపెనీలు తమ ఆపరేషన్స్‌‌ను కొనసాగించుకోగలిగాయి. క్లయింట్ కంపెనీలు డిజిటలైజేషన్‌‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో ఐటీ కంపెనీలు ఎక్కువగా లాభపడ్డాయి’ అని ఎస్‌‌టీపీఐ డైరెక్టర్‌‌‌‌ జనరల్‌‌ ఓంకార్‌‌‌‌ రాయ్‌‌ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా సాఫ్ట్‌‌వేర్ ఎగుమతులు పెరుగుతాయని ఎస్‌‌టీపీఐ అంచనావేస్తోంది. కరోనా సమస్యలను ఐటీ ఇండస్ట్రీ ఎదుర్కోగలుగుతుందని రాయ్‌‌ పేర్కొన్నారు. పాత తరం కంపెనీలు కూడా డిజిటల్ విధానాలను అలవాటు చేసుకుంటున్నాయని, మార్కెట్లో నిలవాలంటే డిజిటలైజేషన్ తప్పనిసరని ఈ కంపెనీలు భావిస్తున్నాయని చెప్పారు.