మిలటరీ ఖర్చులో మూడో స్థానంలో ఇండియా

మిలటరీ ఖర్చులో  మూడో స్థానంలో ఇండియా
  • మిలటరీ ఖర్చులో మనది మూడో స్థానం
  • ఫస్ట్, సెకండ్ ప్లేస్ లో అమెరికా, చైనా 
  • డిఫెన్స్ కు ఇండియా ఖర్చు రూ.5.87 లక్షల కోట్లు 
  • అమెరికా రక్షణ వ్యయం రూ.61.4 లక్షల కోట్లు  

రక్షణ రంగంపై ఖర్చు విషయంలో ప్రపంచ దేశాలు బడ్జెట్​ను పెంచుతూనే ఉన్నాయి.  మిలటరీ ఖర్చు విషయంలో ఇండియా ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలిచింది. ఫస్ట్, సెకండ్​ ప్లేస్​ల్లో అమెరికా, చైనా ఉన్నాయి. అమెరికా రక్షణ అవసరాల కోసం రూ.61.4 లక్షల కోట్లు ఖర్చు చేస్తుండగా.. ఇండియా రూ.5.87 లక్షల కోట్లు వ్యయం చేస్తోంది. ఈ మేరకు స్టాక్​హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(సిప్రీ) ఓ రిపోర్ట్​ను విడుదల చేసింది. నిరుడు ప్రపంచ దేశాలు రక్షణ రంగంపైనే సుమారు రూ.1.62 కోట్ల కోట్లు ఖర్చు చేశాయని వెల్లడించింది. ఇందులో అమెరికా, చైనా, ఇండియా, బ్రిటన్, రష్యా వాటానే 62% అని పేర్కొంది. 

స్టాక్​హోం:  రక్షణ రంగంలో ఖర్చుల విషయంలో ప్రపంచ దేశాలు తగ్గేదేలే అంటున్నాయి. దేశ రక్షణపై రాజీ పడే ప్రసక్తే లేదంటున్నాయి. నిరుడు ప్రపంచ దేశాలు రక్షణ రంగంపైనే 2,11,300 కోట్ల డాలర్లు (సుమారు రూ.1.62 కోట్ల కోట్లు) ఖర్చు చేశాయి మరి. స్టాక్​హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సిప్రీ) ఈ మేరకు సోమవారం ఓ నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం మొత్తం ఖర్చులో అమెరికా, చైనా, ఇండియా, బ్రిటన్​, రష్యాల వాటానే 62 శాతం ఉంది. ఈ జాబితాలో రష్యా, బ్రిటన్ వంటి మేటి దేశాలను సైతం వెనక్కు నెట్టి మన దేశం మూడో స్థానంలో నిలిచింది. కరోనా కారణంగా ద్రవ్యోల్బణం పెరిగి రక్షణ రంగ అభివృద్ధి కొంత నెమ్మదించినా.. 2020తో పోలిస్తే మాత్రం రక్షణ ఖర్చులు 6.1 శాతం పెరిగాయి.

మన ఖర్చు 2021లో 0.9% పెరిగింది  

రక్షణ రంగ ఖర్చుల్లో మన దేశమూ ఏ మాత్రం తగ్గట్లేదు. 2021లో మిలటరీ కోసం 7,660 కోట్ల డాలర్లు (సుమారు రూ.5.87 లక్షల కోట్లు) ఖర్చు పెట్టింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 0.9 శాతం ఎక్కువ. 2012 నుంచి లెక్కలు తీస్తే.. అది 64 శాతం ఎక్కువని సిప్రీ వెల్లడించింది. 2021 మిలటరీ బడ్జెట్​లో 64 శాతం నిధులను సొంతంగా (దేశీ) ఆయుధాలను తయారు చేసుకోవడం కోసమే కేటాయించింది. 

రష్యాది మన కన్నా తక్కువే

రష్యా కూడా రక్షణ రంగంపై ఖర్చును 2.9 శాతం పెంచినా, మనకన్నా వెనకే ఉంది. 6,590 కోట్ల డాలర్లు (సుమారు రూ.5.05 లక్షల కోట్లు) డిఫెన్స్​పై ఖర్చు చేసింది. ఆ దేశ జీడీపీలో రక్షణ రంగ ఖర్చులు 4.1 శాతం. గత ఏడాది ఆయిల్​ ధరలు భారీగా పెరగడంతో రష్యా డిఫెన్స్​ ఖర్చులు కూడా పెరిగాయని సిప్రీ మిలటరీ ఎక్స్​పెండిచర్​ అండ్​ అర్మ్స్​ ప్రొడక్షన్​ విభాగం​ డైరెక్టర్​ లూసీ బెరాడ్​ సూద్రూ పేర్కొన్నారు. 

అమెరికానే పెద్దన్న

రక్షణ రంగ ఖర్చుల్లో అమెరికానే పెద్దన్నగా నిలిచింది. 2021లో ఆ దేశం 80,100 కోట్ల డాలర్లు (సుమారు రూ.61.4 లక్షల కోట్లు) రక్షణ కోసం ఖర్చు చేసింది. అయితే, 2020తో పోలిస్తే ఆ ఖర్చు 1.4 శాతం తగ్గింది. మిలటరీ రీసెర్చ్​ అండ్​ డెవలప్​మెంట్​కోసం నిధులను 24 శాతం పెంచిన అమెరికా.. ఆయుధ కొనుగోళ్లకు మాత్రం నిధుల్లో 6.4 శాతం కోత పెట్టింది. ఇక, ఖర్చులో రెండో స్థానంలో ఉన్న చైనా.. 29,300 కోట్ల డాలర్లు (సుమారు రూ.22.46 లక్షల కోట్లు) రక్షణ కోసం ఖర్చు పెట్టింది. 2020తో పోలిస్తే చైనా రక్షణ వ్యయం 4.7 శాతం పెరిగింది. 6,840 కోట్ల డాలర్లతో (సుమారు రూ.5.24 లక్షల కోట్ల) ఖర్చుతో బ్రిటన్​ నాలుగో స్థానంలో నిలిచింది.