ట్రేడ్ వార్ అమెరికా పాలిట భస్మాసుర హస్తం!

ట్రేడ్ వార్ అమెరికా పాలిట భస్మాసుర హస్తం!

‘నేరం ఒకరిది- శిక్ష మరొకరికి’ చందంగా రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం భారత్ మెడకు చుట్టుకోవడం విడ్డూరం. ఈ యుద్ధం ముగిసేవరకు అమెరికా సుంకాల ఖడ్గం భారత్ మెడపై  వేలాడుతూనే ఉంటుందా?  అమెరికా ఒత్తిడికి భారత్  లొంగుతుందా? అనే సందేహానికి  కాలమే సమాధానం చెబుతుంది. రష్యా, ఉక్రెయిన్ల మధ్య శాంతి ఒప్పందానికి సమయం ఆసన్నమైందనే భావన అమెరికా అధ్యక్షుడు ట్రంప్,  జెలెన్ స్కీ మధ్య  వైట్ హౌస్​లో  జరిగిన చర్చల సారాంశాన్ని బట్టి,  వారి వ్యాఖ్యలను బట్టి అవగతమవుతున్నది. 

గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ట్రంప్​తో జరిగిన చర్చల్లో జెలెన్ స్కీకి మద్దతుగా యూరప్ దేశాల నేతలు కూడా పాల్గొనడం విశేషం.  త్వరలో  ట్రంప్, పుతిన్, జెలెన్ స్కీ మధ్య జరిగే  త్రైపాక్షిక సమావేశం సత్ఫలితాలనిస్తుందనే  ఆశాభావం సర్వత్రా వ్యక్తమౌతున్నది. ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరకూడదనేది పుతిన్ ప్రధాన డిమాండ్. రష్యా తాను ఆక్రమించిన భూభాగాలను ఉక్రెయిన్​కు ఎట్టి పరిస్థితుల్లోను తిరిగి ఇవ్వడానికి సంసిద్ధంగా లేని మాట వాస్తవం. ఉక్రెయిన్ భద్రతకు  హామీ ఇవ్వాలన్న జెలెన్ స్కీ డిమాండ్​ను  అమెరికా ఆమోదిస్తుందా?  ఇందుకు రష్యా అంగీకరిస్తుందా? అనేది ప్రస్తుతానికి సమాధానం లేని  ప్రశ్నగా మిగిలిపోయింది. తుది విడత చర్చలు జరిగితేనే కాని ఈ సందేహానికి సమాధానం దొరకదు. 


కా ల్పుల  విరమణ కాకుండా, శాంతి ఒప్పందమే రష్యా- ఉక్రెయిన్  మధ్య నెలకొన్న సుదీర్ఘ సంఘర్షణకు శాశ్వత పరిష్కారమని అమెరికా, ఉక్రెయిన్ దేశాలు భావించడం శుభ సూచకం. గత మూడున్నర సంవత్సరాలుగా రష్యా,- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంతో ప్రపంచ దేశాలన్నీ ఆర్ధికంగా ఛిన్నాభిన్నమైపోయాయి. ఇటీవల ట్రంప్ వివిధ దేశాలపై విధిస్తున్న టారిఫ్​లు గోరుచుట్టుపై రోకలి పోటులా భారత్ వంటి దేశాలకు  ఆర్థిక ప్రతిబంధకాలను కలిగిస్తున్నాయి. 37 ట్రిలియన్ డాలర్ల అప్పులతో  సతమతమవుతున్న అమెరికా తన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకోవడానికి ఇతర దేశాలపై సుంకాల భారం మోపడం, ఉక్రెయిన్ వంటి దేశాల్లోగల రేర్ ఎర్త్ మినరల్స్ ను కాజేయడానికి ప్రయత్నించడం అనుచితం.

వాణిజ్య యుద్ధం 

ఇప్పటికే ట్రంప్ మొండి వైఖరితో  భారత్- అమెరికాల మధ్య ఏర్పడిన వాణిజ్య యుద్ధం చిలికి చిలికి గాలివానై,  ఇరు దేశాల సంబంధాలకు తూట్లు పొడిచింది. అమెరికా వాణిజ్యంలో భారత్ కీలక భాగస్వామి. అమెరికాకు భారత్ అతి పెద్ద ఎగుమతి దారుగా ఉంది. ఇరుదేశాల మధ్య సుమారు 132 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతున్నది. ఉక్కు, అల్యూమినియం,  వస్త్రాలు, ఆభరణాలు,  ఎలక్ట్రానిక్స్ వస్తువులను  భారత్ అమెరికాకు సరఫరా చేస్తున్నది. ఆక్వా, ఫార్మా రంగాల ఉత్పత్తులను  అమెరికా దిగుమతి చేసుకుంటున్నది. భారతదేశం అమెరికాకు ఎగుమతి చేసే వస్తువుల విలువకంటే, అమెరికా నుంచి భారత్​కు  దిగుమతి జరిగే వస్తుసేవల విలువ తక్కువ. ఈ కారణంగానే  అమెరికా 45.8 బిలియన్ల వాణిజ్య లోటును ఎదుర్కొంటున్నది. ట్రంప్ విధించిన సుంకాల వలన  భారత్   నష్టాలను చవిచూడక తప్పదు. 
 

ఎస్​400తో  బెంబేలు!

ఈర్ష్యాద్వేషాలతో రెచ్చిపోతున్న ట్రంప్ భారత దేశ ఆర్థిక పురోభివృద్దిని అడ్డుకోవడానికి  అనేక విధాలుగా ప్రయత్నించడం గత కొంతకాలంగా చూస్తున్నాం. భారత్ అమ్ముల పొదిలో అనేక అధునాతన ఆయుధాలున్నాయి. భారత్ కొనుగోలు చేసిన రష్యాకు చెందిన ఎస్- 400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాక్ యుద్ధ విమానాలను,  పాక్  గగనతల రక్షణ వ్యవస్థను తుత్తునీయలు చేసిన సంఘటన పాక్​తో పాటు అమెరికా, చైనాలను బెంబేలెత్తించింది. అప్పటివరకు పాక్ ఉగ్రవాదుల చర్యలను ఖండించిన  ట్రంప్ ఒక్కసారిగా  స్వరం మార్చి  పాక్ కు వత్తాసు పలకడం ప్రారంభించడమే కాకుండా, ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్ సైనికాధిపతి ఆసిమ్ మునీర్​ను ట్రంప్  వైట్​హౌస్​కు  సాదరంగా ఆహ్వానించి  విందారగించడం గమనార్హం.

భారత్​ను రెచ్చగొడుతున్న వ్యాఖ్యలు

రష్యా వద్ద ఆయుధాలు కొనుగోలు చేయవద్దని భారత్​ను హెచ్చరించిన  ట్రంప్  ఉగ్రవాద దేశమైన పాక్  పట్ల సానుకూల  వైఖరి ప్రదర్శించడం భారత్​పై కయ్యానికి కాలు దువ్వడమే కాగలదు. ఎప్పటికైనా భారత్​కు పాక్ చమురు సరఫరా చేసే స్థితికి చేరుకుంటుందని ట్రంప్ పేర్కొనడం భారత్​ను అవమానించడమే. తమ అణ్వస్త్రాలతో భారత్​తో సహా సగం ప్రపంచాన్ని నాశనం చేయగల సామర్ధ్యం తమకుందని  ఇప్పటికే ఆసిమ్ మునీర్ అమెరికా గడ్డపై నిలబడి తీవ్రమైన, అభ్యంతరకరమైన  వ్యాఖ్యలు  చేసినా, శాంతి బహుమతి కోసం ఉవ్విళ్లూరుతున్న ట్రంప్ కు ఈ వ్యాఖ్యలు వీనులవిందు కలిగించాయా?  భారత ఆర్థిక మూలాలను పెకిలించడానికి అమెరికా చేస్తున్న కుటిల యత్నాలు ఫలించబోవు.  

రష్యా-,  ఉక్రెయిన్ల మధ్య శాంతి ఒప్పందం కోసం ఇటీవల  అలాస్కాలో ట్రంప్-, పుతిన్  మధ్య జరిగిన చర్చలు,  జెలెన్సీతో జరిగిన సంభాషణలు అమెరికా,  రష్యా, ఉక్రెయిన్ మధ్య త్రైపాక్షిక చర్చలకు మార్గం సుగమం చేశాయి. రష్యా-, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరగడానికి  అమెరికా, నాటో దేశాలు  ఉక్రెయిన్​కు అందించిన ఆయుధ, ఆర్థిక సాయమే కారణం. అలాంటప్పుడు  ట్రంప్ భారత్ ను నిందించి భారత్ పై టారిఫ్ వార్ ప్రకటించడం లో  ఎలాంటి ఔచిత్యం లేదు.  ట్రంప్ ప్రారంభించిన ‘ట్రేడ్ వార్’  అమెరికా పాలిట భస్మాసుర హస్తం కానుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

- సుంకవల్లి సత్తిరాజు.
సోషల్ ఎనలిస్ట్