
ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమిండియా కూర్పు పై దాదాపుగా స్పష్టత వచ్చేసింది. అయితే మహ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రాకు తోడుగా మూడో పేసర్‌గా ఎవరిని బరిలోకి దించుతారనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో రాణించిన మహ్మద్ సిరాజ్, నవ్దీప్ సైనీల్లో ఒకరిని తీసుకునే చాన్స్ ఉంది. సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్‌నూ పరిగణించే అవకాశాల్ని కొట్టిపారేయలేం. ఈ విషయంపై వెటరన్ బ్యాట్స్‌మన్ మహ్మద్ కైఫ్ స్పందించాడు. ఇషాంత్ ప్లేస్‌లో ఉమేశ్‌ను తీసుకోవాలని సూచించాడు.
‘మూడో పేసర్‌గా ఉమేశ్ యాదవ్‌ను తీసుకోవాలి. గత సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఆ పర్యటనలో భారత విజయాల్లో ఇషాంత్ శర్మ కీలక పాత్ర పోషించాడు. షమి, బుమ్రాతో కలసి బాగా బౌలింగ్ చేశాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఉమేశ్ మంచిగా బౌలింగ్ చేశాడు. అతడు మంచి రీప్లేస్‌మెంట్ కాగలడు. ఎక్కువగా పరుగులు ఇచ్చినా, అప్పుడప్పుడు లయ తప్పినా ఉమేశ్‌కు 45కు పైగా మ్యాచ్‌ల అనుభవం ఉందనే విషయం గుర్తుంచుకోవాలి. గత ఆసీస్ పర్యటనలోనూ అతడు జట్టుతోనే ఉన్నాడు. ఫిట్‌గా ఉండే ఉమేశ్ భారీ స్పెల్స్ బౌలింగ్ చేయగలడు. అందుకే ఉమేశ్‌ను ఫైనల్ ఎలెవన్‌లోకి తీసుకోవాలి. ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతోపాటు అశ్విన్, విహారి ఆఫ్ స్పిన్ బౌలింగ్‌తో తడాఖా చూపిస్తే భారత్‌కు తిరుగుండదు’ అని కైఫ్ పేర్కొన్నాడు.