ఇషాంత్ లేకపోవడం భారత్‌‌కు ఎదురుదెబ్బే

ఇషాంత్ లేకపోవడం భారత్‌‌కు ఎదురుదెబ్బే

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇషాంత్ శర్మ లేకపోవడం టీమిండియాకు ఎదురు దెబ్బేనని ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌‌మన్ స్టీవ్ స్మిత్ చెప్పాడు. ఆసీస్ గడ్డపై ఇషాంత్ సేవలు భారత్‌‌కు అవసరమని, అతడి గైర్హాజరీ టీమ్ పెర్ఫామెన్స్‌‌పై ప్రభావం చూపుతుందన్నాడు. ఇషాంత్ లేకపోతే భారత బౌలింగ్ అటాక్ బలంగా కనిపించదన్నాడు. ఐపీఎల్ పదమూడో సీజన్‌‌లో ఇషాంత్ గాయపడిన సంగతి తెలిసిందే. టోర్నీ మధ్యలోనే భారత్‌‌కు తిరిగి వచ్చేసిన సీనియర్ పేసర్.. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసంలో ఉన్నాడు. బుమ్రా బౌలింగ్ గురించి కూడా స్మిత్ కామెంట్స్ చేశాడు.

‘బుమ్రాను ఎదుర్కోవడానికి ఉత్సుకతగా ఉన్నా. రెడ్ బాల్ క్రికెట్‌‌లో అతడ్ని ఎదుర్కోవడం ఇదే తొలిసారి. ఏదైనా కొత్తగా యత్నించాలని మాత్రం అనుకోవడం లేదు. బుమ్రా ఎలా బౌలింగ్ చేస్తాడో మాకు తెలుసు. అతడి యాక్షన్ వెరైటీగా ఉంటుంది. వేరేవాళ్లతో పోల్చితే చాలా వైవిధ్యంగా ఉంటుంది. అతడు మంచి క్వాలిటీ బౌలర్’ అని స్మిత్ పేర్కొన్నాడు. ఇండియా-ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్ ఈ నెల 17న ఆరంభం కానుంది. తొలి మ్యాచ్ అడిలైడ్‌‌లోని ఓవల్‌‌లో డే అండ్ నైట్ ఫార్మాట్‌‌లో జరగనుంది.