నవీ ముంబై: విమెన్స్ వరల్డ్ కప్‌లో ఆఖరి లీగ్ మ్యాచ్ కూడా వానా ఖాతాలోకి వెళ్లింది. భారీ వర్షం వల్ల ఆదివారం ఇండియా, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌ను అర్ధాంతరంగా రద్దు చేశారు. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ఇప్పటికే సెమీస్ బెర్త్‌లు ఖాయం కావడంతో ఈ మ్యాచ్‌కు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా.. టీమిండియాకు ప్రాక్టీస్ లభిస్తుందని భావించారు. కానీ వాన దేవుడు ఆ అవకాశం ఇవ్వలేదు.
వర్షం వల్ల 27 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో.. టాస్ ఓడిన బంగ్లాదేశ్ ఓవర్లన్నీ ఆడి 119/9 స్కోరు చేసింది. షర్మిన్ అక్తర్ (36) టాప్ స్కోరర్. శోభనా మోస్త్రే (26) ఓ మాదిరిగా ఆడింది. తర్వాత ఇండియా లక్ష్యాన్ని 27 ఓవర్లలో 126గా నిర్దేశించారు. దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇండియా 8.4 ఓవర్లలో 57/0 స్కోరు చేసింది.
ఓపెనర్లు స్మృతి మంధాన (34 నాటౌట్), అమన్‌జోత్ కౌర్ (15 నాటౌట్) మెరుపు ఆరంభాన్నిచ్చారు. అయితే ఈ దశలో మొదలైన వర్షం ఎంతకూ ఆగకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఇక బుధవారం జరిగే తొలి సెమీస్‌లో ఇంగ్లండ్, సౌతాఫ్రికాతో తలపడుతుంది.
బౌలర్లు అదుర్స్
ఆరంభం నుంచే ఇండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బంగ్లా బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలింది. తొలి ఓవర్‌లోనే రేణుకా సింగ్ (1/23) సుమైయా అక్తర్ (2)ను ఔట్ చేసింది. రుబయా హైదర్ (13), షర్మిన్ ఇన్నింగ్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. డిఫెన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి సింగిల్స్‌కు కట్టుబడ్డారు. రెండో వికెట్‌కు 31 రన్స్ జోడించి రుబయా వెనుదిరిగింది.
కొద్దిసేపటికే నిగర్ సుల్తానా (9) కూడా ఔట్ కావడంతో బంగ్లా 53/3తో నిలిచింది. ఈ దశలో షర్మిన్‌కు తోడైన శోభన వేగంగా ఆడింది. నాలుగు ఫోర్లు కొట్టి ఒత్తిడిని తగ్గించుకుంది. కానీ స్పిన్నర్లు శ్రీచరణి (2/23), రాధా యాదవ్ (3/30) బౌలింగ్‌కు రావడంతో పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. నాలుగో వికెట్‌కు 38 రన్స్ జోడించి శోభన ఔట్ కాగా, మిగతా వాళ్లు సింగిల్ డిజిట్‌కు పరిమితమయ్యారు.
వరుస విరామాల్లో షోర్నా అక్తర్ (2), నహిదా అక్తర్ (3), రబేయా ఖాన్ (3), రితూ మోనీ (11) వికెట్లు సమర్పించుకున్నారు. చివర్లో నిషితా అక్తర్ (4 నాటౌట్), ముర్ఫా అక్తర్ (2 నాటౌట్) బ్యాట్లు ఝుళిపించకపోవడంతో బంగ్లా స్వల్ప స్కోరుకే పరిమితమైంది. దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్ చెరో వికెట్ తీశారు.
సంక్షిప్త స్కోర్లు
బంగ్లాదేశ్: 27 ఓవర్లలో 119/9 (షర్మిన్ 36, శోభనా 26, రాధా యాదవ్ 3/30). ఇండియా: 8.4 ఓవర్లలో 57/0 (స్మృతి 34*, అమన్‌జోత్ 15*).
