
ప్రపంచ ఆర్థికవ్యవస్థలో సుంకాలు వాణిజ్యాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. సుంకాలు ఒకదేశ ఆర్థిక వ్యూహాత్మక నిర్ణయాలను మాత్రమేకాక అంతర్జాతీయ రాజకీయాలను విశేషంగా ప్రభావం చూపించే కీలక అంశం. అంతర్జాతీయ మార్కెట్లో దేశాలు సుంకాలను ఒక శక్తిమంతమైన ఆయుధంగా ఉపయోగిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై విధించిన సుంకాలు.. వాణిజ్య అసమానతలను తగ్గించడం, అమెరికా ప్రజల్లో మేడిన్ అమెరికా అనే వాదాన్ని బలపరచడానికి మాత్రమే కాకుండా రాజకీయ వ్యూహం, వ్యాపార లాబీ, భౌగోళిక ప్రాధాన్యతలతో ఒక కీలకమైన వ్యూహంగా మనం భావించవచ్చు.
భారత్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు వేగంగా పెరిగాయి. 2024లో ఇరుదేశాల మధ్య మొత్తం వాణిజ్య విలువ సుమారు 212 బిలియన్ డాలర్లు(దాదాపుగా రూ.17.5 లక్షల కోట్లు)గా ఉంది. భారత్ సాధించిన గణనీయమైన ప్రగతితో 2014లో అమెరికాకు భారత్‌తో 2.5 బిలియన్ డాలర్ల లోటు ఉండగా, 2025లో 45.8 బిలియన్ డాలర్లకు చేరింది.
ప్ర స్తుత వాణిజ్యం నుంచి 2026-–27లో భారత్- అమెరికా వాణిజ్యం 300 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ బాడీ పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ఉన్నత విద్యకు భారతీయ విద్యార్థులు అత్యంత ఇష్టపడే గమ్యస్థానాల్లో అమెరికా ఒకటి. సెప్టెంబర్ 2023 నాటికి అమెరికాలో 3,20,260 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. యూఎస్ స్టేట్ వెబ్సైట్ ప్రకారం అమెరికాలోని భారతీయ విద్యార్థులు అమెరికా ఆర్థికవ్యవస్థకు ఏటా 8 బిలియన్ డాలర్లకు పైగా దోహదం చేస్తున్నారు. ఏప్రిల్ 2023లో విడుదల చేసిన సీఐఐ అధ్యయనం ప్రకారం 163 భారతీయ కంపెనీలు అమెరికాలో 40 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టాయి. 4,25,000 ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించాయి.
భారత జనరిక్ ఔషధ ప్రభావం
భారత ఔషధ పరిశ్రమ.. జనరిక్ మందులు ప్రపంచ ఉత్పత్తిలో మూడో స్థానంలో 20% వాటాను కలిగి ఉంది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే చౌకైన మందులు, వ్యాక్సిన్ల ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. 2023– 24లో జనరిక్ ఔషధాల టర్నోవర్ రూ. 417,345 కోట్లుగా ఉండి ప్రతి సంవత్సరం 10 శాతం పైగానే వృద్ధిని సాధిస్తోంది. భారత్ జనరిక్ మందులు అమెరికా మార్కెట్‌లో తక్కువ ధరకు లభిస్తాయి. భారతదేశం 47% జనరిక్ మందులను అమెరికాకు సరఫరా చేస్తుంది. భారతదేశం ఉత్పత్తి చేసిన మందులు అమెరికా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు 2022లో 219 బిలియన్ డాలర్లు ఆదా చేశాయి.
2013 నుంచి 2022 వరకు ఈ ఆదా మొత్తం 1.3 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఈ ఆదా ప్రధానంగా భారతదేశం ఉత్పత్తి చేసిన జనరిక్ మందుల ద్వారా సాధ్యమైంది. ఇవి అమెరికాలోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు తక్కువ ధరలో నాణ్యమైన ప్రత్యామ్నాయాలను అందిస్తున్నాయి. అయినా, యూఎస్ పెద్ద ఫార్మా కంపెనీలకు లాభాలు తగ్గుతున్నాయని బడా పారిశ్రమికవ్యక్తులు చేస్తున్న లాబీయింగ్‌తో అమెరికా సుంకాల ద్వారా తగ్గించే ప్రయత్నం చేస్తోంది. అయితే, భారత్ కంపల్సరీ లైసెన్స్ అనే చట్టాన్ని వాడి కొన్ని అత్యవసర మందులపై అమెరికా కంపెనీల పేటెంట్‌ను పక్కన పెట్టి దేశీయ కంపెనీలకు తక్కువ ధరలో తయారీకి అనుమతిస్తుంది. దీంతో అమెరికా భారత్ పై సుంకాల మోత మోగిస్తోంది.
అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకుప్రవేశం లేకపోవడంతో..
అమెరికా తన వ్యవసాయ ఉత్పత్తులను భారత దేశంలో ప్రవేశం కోసం అనేక సంవత్సరాలుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా అమెరికా.. పాలు, పాల ఉత్పత్తులు, వ్యవసాయ వస్తువులు అమెరికా నుంచి భారత్ కు ఎగుమతి చేసుకోవడానికి అవసరమైన సరళీకరణ చేయాలని ఒత్తిడి చేస్తోంది. భారత్ అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాల ప్రకారం కఠిన పర్యవేక్షణను అమలు చేస్తోంది. అదనంగా, ఇంపోర్ట్ కోటా, టారిఫ్‌లు విధించడం వల్ల అమెరికా పాల ఉత్పత్తులు, వాటి ఉత్పత్తులు భారత మార్కెట్‌లో తక్కువగా లభిస్తాయి. అమెరికా తన వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకోవడం కోసం భారత్‌పై సుంకాల ద్వారా వివిధ రూపాలలో ఒత్తిడిని తీసుకువస్తోంది. అయినప్పటికీ భారతదేశంలోని వ్యవసాయ రంగానికి వచ్చే నష్టాలను గమనించి అటువంటి
ప్రతిపాదనను భారత్ గట్టిగా తిరస్కరిస్తూండటం అమెరికాకు మింగుడుపడటం లేదు.
భారత డేటా లోకలైజేషన్
డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ చట్టం 2023 ద్వారా భారతదేశంలో నివసించే వ్యక్తుల డేటాను దేశీయ సర్వర్లలో నిల్వ చేయాలని, ప్రాసెస్ చేయాలని భారత ప్రభుత్వం తెలియజేస్తున్నది. ఈ చర్య ద్వారా డేటా ప్రైవసీతోపాటు విదేశీ సంస్థలపై ఆధారపడడం, వారి పెత్తనం తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. భారత రిజర్వ్ బ్యాంకు సైతం విదేశీ డిజిటల్ సంస్థలపై డేటా నిలువ, ప్రాసెసింగ్ నిబంధనలను చాలా కఠినతరం చేసింది.
తద్వారా ఈ సంస్థలు భారతదేశంలోనే తమ డేటా సెంటర్లను స్థాపించాల్సి వచ్చింది. భారతదేశ డేటా లోకలైజేషన్ విధానాలను అమలుచేయడం ద్వారా అమెరికా సంస్థలు విదేశాల్లో డేటా నిల్వచేసి మన దేశంలో లాభాలు పొందే వ్యవస్థకు గండి పడింది. ఈ విషయంలో కూడా అమెరికా భారత్‌పై కోపంగా ఉంది.
మెడికల్ పరికరాల ప్రవేశం కఠినతరం
భారత్ మార్కెట్లో మెడికల్ డివైజ్‌లు, వైద్య పరికరాల ప్రవేశం కోసం కేంద్ర ఫార్మా కంట్రోల్, ఫార్మా
మినిస్ట్రీ విధించిన కఠిన నిబంధన కారణంగా ఎమ్మారై సిటీస్కానర్లు, ఇన్సులిన్ పరికరాలు వంటి హైటెక్ పరికరాలకు ఐఎస్ఓ 13485 సిఈ మార్కింగ్ వంటి అంతర్జాతీయ ప్రమాణాలు అమెరికా పాటించాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేషన్ ప్రక్రియ చాలా సమయం తీసుకుంటుంది. ఇలాంటి అంశాలన్నీ కూడా అమెరికా తన వ్యాపారానికి పెద్ద అడ్డంకిగా భావిస్తోంది.
భారత్ వ్యూహం
భారతదేశం చైనాకు ప్రత్యామ్నాయంగా ఉండటం, ఇండో–పసిఫిక్ మౌలిక వేదికలలో కూడా కీలక భాగస్వామిగా ఉన్నప్పటికీ, అమెరికా నేడు విధిస్తున్న సుంకాల వల్ల భారత ఆర్థికవృద్ధి కొంతమేరకు తగ్గుదల అవడానికి ఆస్కారం ఉంది. అమెరికా భారత్‌ను ఒక వ్యూహాత్మక భాగస్వామ్యంగా కోరుకుంటున్నప్పటికీ భారత్ అనుమతులు వ్యాపార వృద్ధి ఎక్కువగా పెరగకుండా ఉండాలని భావిస్తోంది.
అమెరికా సుంకాల వల్ల భారత్ ఉత్పత్తులు అమెరికా మార్కెట్లో ప్రవేశించడం కొంత కష్టతరం అయినప్పటికీ, భారత కంపెనీలు తమ వ్యూహాలను మార్చి స్వదేశంలో ఏవిధంగా పెరగాలి, మిగతా దేశాలతో వ్యాపార సంబంధాలను ఎలా బలోపేతం చేసుకోవాలో వ్యూహాలు నిర్మించుకోవాలి. దీంట్లో ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా చైనాపై వస్తున్న వ్యతిరేకతను భారత్‌కు అనుకూలంగా మలుచుకోవాలి. భారతదేశం స్థానిక పరిశ్రమలను రక్షించడం, ప్రోత్సహించడం, స్వతంత్ర ఆర్థికవృద్ధిపై దృష్టి సారించాలి.
మన వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి
సుంకాలు తాత్కాలిక ఒత్తిడిగానే పనిచేస్తాయి. కానీ, దీనిద్వారా భారత్ వ్యూహాత్మకత ఆర్థిక నియంత్రణలను మరింత బలోపేతం చేయగలదు. భారతదేశం వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తుండటం, ప్రపంచ మార్కెట్లతో పోటీపడేవిధంగా వ్యవసాయ వృత్తికి మరిన్ని ప్రోత్సాహకాలు, విధానాలు అమలుచేసి స్వయం సమృద్ధిని సాధించాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో భారత మార్కెట్లకి దేశీయంగా, అంతర్జాతీయంగానూ అత్యధిక డిమాండ్ ఉంటుంది.
భారత ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ, సౌరశక్తి, ఐటీ సర్వీసులకు ఇస్తున్న సబ్సిడీలను కూడా అమెరికా తప్పుపడుతోంది. ఈ సబ్సిడీల కారణంగా భారత కంపెనీలు చాలా లాభపడి అమెరికాకు తీవ్ర నష్టం జరుగుతుందని వాదిస్తోంది. నేటి అంతర్జాతీయ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తే భారత్‌కు స్వదేశీ పద్ధతులలో ఉత్పత్తి, వినియోగం అనేది దేశానికి రక్షణ కవచంలా స్పష్టంగా కనిపిస్తున్నది.
- చిట్టెడి కృష్ణారెడ్డి,
అసోసియేట్ ప్రొఫెసర్,
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ