మూడో అతిపెద్ద ఎకానమీగా ఎదుగుతం

మూడో అతిపెద్ద ఎకానమీగా ఎదుగుతం

న్యూఢిల్లీ: ఇండియా వచ్చే ఐదేళ్లలో  మూడో అతిపెద్ద ఎకానమీగా అవతరించనుందని, 2047 నాటికి 35-–40 -ట్రిలియన్ డాలర్ల మార్కును తాకగలదని కేంద్ర వాణిజ్యం,  పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఇండియా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం మాత్రమే కాదని, రాబోయే అనేక దశాబ్దాల పాటు ఇదే హోదాలో కొనసాగుతుందని స్పష్టం చేశారు. "ఇండియా ఎదుగుతున్న తీరు గురించి నా సొంత నమ్మకం ఏమిటంటే, 2047 నాటికి  మన ఎకానమీ విలువ బహుశా 35-–40 ట్రిలియన్ డాలర్ల వరకు పెరుగుతుంది. మనదేశం మొదటిస్థానంలో ఉండాలన్నది ప్రతి భారతీయుడి కోరిక. మన పరిశ్రమలు సాధించిన విజయాలు గర్వకారణం. గత కొన్ని సంవత్సరాలుగా వచ్చిన సంస్కరణల వల్ల ఎకానమీకి ఎంతో మేలు జరిగింది” అని గోయల్ పూణేలో నిర్వహించిన ఎకనామిక్  డైలాగ్ 2023 ఈవెంట్​లో  మాట్లాడుతూ అన్నారు.  ఆసియా దేశాలకు ప్రత్యేక లక్షణాలు ఉన్నాయని, ఇక్కడ మనకు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు,  పారదర్శకత గల ఎకానమీలు ఉన్నాయని గోయల్ చెప్పారు. “గత పదేళ్లలో ఇండియా మరింత ముందుకు సాగింది. అంతర్జాతీయ మార్కెట్లలోకి చొచ్చుకుపోయింది. టెక్నాలజీలను అందిపుచ్చుకుంది. ఆధునిక పద్ధతులను అలవాటు చేసుకుంది.   మనం ఇప్పటికే పదవ అతిపెద్ద ఎకానమీ నుండి ఐదవ అతిపెద్ద ఎకానమీకు చేరుకున్నాం.  మనకు యువ జనాభా ఎక్కువ. ఇదే మనకు పెద్ద ఆస్తి” అని ఆయన వివరించారు. 

యుద్ధంతో సంపన్న దేశాలకు నష్టాలు

రష్యా–-ఉక్రెయిన్ యుద్ధం ఇండియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే అభివృద్ధి చెందిన దేశాలపై ఎక్కువ ప్రభావం చూపిందని మంత్రి తెలిపారు. ఆహార భద్రత,  ఇంధన భద్రత, ఇన్​ఫ్లేషన్​ (ధరల పెరుగుదల), వడ్డీ రేట్లు,  వృద్ధి తగ్గిపోవడం వంటి సమస్యలను ధనిక దేశాలు ఎదుర్కొంటున్నాయని చెప్పారు.  అభివృద్ధి చెందుతున్న దేశాలపైనా కొంత ప్రభావాన్ని చూపిందిన్నారు. 2019 లో ఇండియా ఆర్‌‌‌‌సీఈపీ గ్రూప్ ఆఫ్ నేషన్స్‌‌‌‌లో చేరడంపై చర్చలు జరుపుతున్నప్పుడు, ఆర్​సీఈపీ ఒప్పందంలో మనదేశానికి ఏమి ఇస్తున్నారో చూస్తే మనకు దక్కింది తక్కువేనని భావించామని గోయల్ గుర్తు చేసుకున్నారు. “నా అభిప్రాయం ప్రకారం, ఆర్​సీఈపీలో భాగం కావాలని అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు. ఎందుకంటే అది ప్రజాస్వామ్య బద్ధం కాని, ట్రాన్స్​పరెన్సీ  లేని ఫ్రీ ట్రేడ్​ అగ్రిమెంట్​(ఎఫ్​టీఏ). ఈ ఒప్పందం ఇండియాలోని అన్ని ఉత్పాదక రంగాలకు మరణశాసనం. కొన్నేళ్లుగా, చైనా నాసిరకం వస్తువులను మన ప్రజలకు అలవాటు చేయడం ద్వారా భారతదేశ ప్రయోజనాలను దెబ్బతీశారు. 15–-16 సంవత్సరాల క్రితం చైనాతో 2 బిలియన్ డాలర్లలోపు ఉన్న వాణిజ్య లోటు 2014 నాటికి దాదాపు 48 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇండియా వస్తువులను చట్టబద్ధమైన మార్గంలోనూ చైనాకు వెళ్లడానికి  అనుమతించలేదు. మనం మాత్రం చైనా నుండి ఉత్పత్తులను అనుమతించాం.  అందుకే ఆర్​సీఈపీలో చేరకూడదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2019 నవంబర్ 4న నిర్ణయించుకున్నప్పుడు నాకెంతో సంతోషంగా అనిపించింది. 

దీనివల్ల  ప్రతి పరిశ్రమ  వ్యాపారం, ప్రతి రైతు,  పాడి పరిశ్రమతో సంబంధం ఉన్న ప్రతివారికీ మేలు జరుగుతుంది” అని గోయల్​ వివరించారు.  ఎఫ్​టీఏల గురించి మాట్లాడుతూ తాము ప్రపంచ చరిత్రలో అత్యంత వేగంగా ఇలాంటి ఒప్పందాలను కుదుర్చుకుంటున్నామని, ఇండియా–యూఏఈ ఒప్పందం 88 రోజుల్లో పూర్తయిందని అన్నారు. ఆస్ట్రేలియాతోనూ అతి త్వరలో ఎఫ్​టీఏని కూడా కుదుర్చుకుంటామని, ఇజ్రాయెల్, కెనడా, ఈయూ, యూకే, జీసీసీ దేశాలతోనూలతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు.  రష్యా, ఈఏయూ  దాని భాగస్వామ్య దేశాలు కూడా ఇండియాతో చర్చలను వేగవంతం చేయాలని కోరుకుంటున్నాయని పీయుష్​ గోయల్​ వివరించారు.