మహిళల హాకీ జట్టుకు కాంస్యం

మహిళల హాకీ జట్టుకు కాంస్యం

కామన్వెల్త్ గేమ్స్ లో భారత మహిళల హాకీ జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. ఈ  ప్రఖ్యాత క్రీడా వేడుకల్లో గత 16 ఏళ్లలో  మన హాకీ టీమ్ కు  పతకం రావడం ఇదే తొలిసారి. ఇవాళ  న్యూజిలాండ్, భారత్ మధ్య జరిగిన మ్యాచ్ హైడ్రామా మధ్య షూటౌట్ వరకూ సాగింది. చివరకు 2-1 పాయింట్లతో భారత్ గెలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. అంతకుముందు మ్యాచ్ మొదటి క్వార్టర్ లోనే భారత ప్లేయర్ సలీమా తేటే గోల్ చేసి 10 తేడాతో మన టీమ్ ను ఆధిక్యంలోకి తీసుకెళ్లింది.

ఆ తర్వాత రెండు, మూడు క్వార్టర్లలో భారత్, న్యూజిలాండ్ జట్ల ఆటగాళ్లు గోల్ చేసేందుకు పోటీపడ్డా.. అది సాధ్యం కాలేదు. చివరకు నాలుగో క్వార్టర్ చివర్లో హైడ్రామా చోటుచేసుకుంది. 18 సెకన్లలో మ్యాచ్ ఖతం అవుతుందనగా.. న్యూజిలాండ్ విజృంభించి గోల్ చేసి పాయింట్ల పట్టికను సమం చేసింది. ఈనేపథ్యంలో మ్యాచ్ ఫలితాన్ని తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ ను ప్రకటించారు. ఉత్కంఠభరితంగా జరిగిన షూటౌట్ రౌండ్ లో .. భారత్ ఒక గోల్ చేసి 21 తేడాతో మ్యాచ్ ను చేజిక్కించుకుంది.