T20 World Cup 2024: గట్టెక్కించిన సూర్య, దూబే.. సూపర్ 8 కు భారత్

T20 World Cup 2024: గట్టెక్కించిన సూర్య, దూబే.. సూపర్ 8 కు భారత్

వరల్డ్ కప్ లో భారత్ సూపర్ 8 కు చేరుకుంది. న్యూయార్క్ వేదికగా జరిగిన మ్యాచ్ లో అమెరికాపై 7 వికెట్ల తేడాతో చెమటోడ్చి నెగ్గింది.  స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా టాపార్డర్ తడబడినా.. సూర్య కుమార్ యాదవ్(49 బంతుల్లో 50, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) శివమ్ దూబే(35 బంతుల్లో 31 ఫోర్, సిక్స్) భాగస్వామ్యంతో భారత్ కు విజయాన్ని అందించారు. మొదట బ్యాటింగ్ చేసిన అమెరికా నిర్ణీత 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులకు చేసింది. లక్ష్య ఛేదనలో భారత్ 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. 

సూర్య, దూబే భారీ భాగస్వామ్యం 

స్వల్ప లక్ష్య ఛేదనంలో భారత్ కు మంచి ఆరంభం లభించలేదు. తొలి ఓవర్ లో ఎదుర్కొన్న తొలి బంతికే కోహ్లీ డకౌటయ్యాడు. రోహిత్ శర్మ(3) ఔటవ్వడంతో భారత్ 10 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రిషబ్ పంత్, సూర్య కుమార్ యాదవ్ జట్టును ముందుకు నడిపించారు. ఆచి తూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. 29 పరుగుల భాగస్వామ్యం తర్వాత అలీ ఖాన్ వేసిన ఒక చక్కటి బంతికి పంత్ (18) బౌల్డయ్యాడు. 

ఈ దశలో దూబేతో కలిసి సూర్య కుమార్ యాదవ్ భారత్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. అనవసర షాట్లకు పోకుండా జాగ్రత్తగా ఆడుతూ జట్టుకు విజయాన్ని అందించారు. ఈ క్రమంలో 49 బంతుల్లో సూర్య  2 ఫోర్లు, 2 సిక్సర్లతో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 31 పరుగులు చేసి దూబే నాటౌట్ గా నిలిచాడు.  అంతకముందు భారత బౌలర్లు చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులకు పరిమితమైంది. నితీష్ కుమార్ 27 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.