
జార్జ్‌టౌన్ (గయానా): టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా సత్తా చాటింది. ఇంగ్లాండ్ పై 68 పరుగుల తేడాతో చిత్తు చేసి మూడో సారి ఫైనల్లో అడుగు పెట్టింది. 172 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 103 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో బట్లర్ (23), హ్యారీ బ్రూక్ (25) కాసేపు పోరాడారు. మిగతావారంతా ఘోర వైఫల్యం చెందారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, కుల్దీప్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. బుమ్రా 2 వికెట్లు తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (39 బాల్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 57) మరోసారి తన క్లాస్ చూపెట్టాడు. హిట్‌మ్యాన్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్ (36 బాల్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 47) మెరుపులతో టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్ ముందు ఇండియా 172 రన్స్ టార్గెట్ ఉంచింది. గురువారం రాత్రి వర్షం అంతరాయంతో ఆలస్యంగా మొదలైన మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ఇండియా 20 ఓవర్లలో 171/7 స్కోరు చేసింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ (9), రిషబ్ పంత్ (4), శివం దూబే (0) నిరాశ పరచగా.. రోహిత్, సూర్యతో పాటు హార్దిక్ పాండ్యా (13 బాల్స్‌లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 23) ఫర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ మూడు వికెట్లు పడగొట్టాడు.
అటు చినుకులు.. ఇటు మెరుపులు
వర్షం వల్ల ఆట 75 నిమిషాలు ఆలస్యంగా మొదలవగా.. మధ్యలో మరోసారి వరుణుడి రాకతో ఇన్నింగ్స్‌కు అంతరాయం కలిగింది. ఓవైపు చినుకులు పలకరిస్తుండగా.. ఇంకోవైపు రోహిత్, సూర్యకుమార్ మెరుపులు మెరిపించారు. కానీ, చివర్లో పుంజుకున్న ఇంగ్లండ్ బౌలర్లు రోహిత్‌సేన భారీ స్కోరును అడ్డుకున్నారు. ఇన్నింగ్స్ రెండో బాల్‌నే బౌండ్రీకి పంపించి తన ఉద్దేశం ఏంటో చెప్పిన హిట్‌మ్యాన్ ఉన్నంతసేపు స్వేచ్ఛగా షాట్లు కొట్టాడు. కానీ, మరో ఓపెనర్ కోహ్లీ మళ్లీ ఫెయిలయ్యాడు. టాప్లీ వేసిన మూడో ఓవర్లో సిక్స్ కొట్టిన అతను మరో షాట్‌కు ట్రై చేసి లైన్ మిస్సయి బౌల్డ్ అయ్యాడు.
టాప్లీ ఓవర్లోనే రెండు ఫోర్లతో రోహిత్ జోరు కొనసాగించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన రిషబ్ పంత్ కరన్ వేసిన ఆరో ఓవర్లో బెయిర్‌స్టోకు క్యాచ్ ఇవ్వగా పవర్ ప్లేను ఇండియా 46/2తో ముగించింది. ఈ దశలో రోహిత్‌కు తోడైన సూర్య తన మార్కు షాట్లతో అలరించాడు. ఏడో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన స్పిన్నర్ ఆదిల్ రషీద్‌కు రోహిత్ రివర్స్ స్వీప్, స్వీప్ షాట్లతో రెండు ఫోర్లతో స్వాగతం పలికాడు. జోర్డాన్ వేసిన ఎనిమిదో ఓవర్లో సూర్య స్కూప్ షాట్‌తో సిక్స్ కొట్టాడు. ఆ ఓవర్ తర్వాత వర్షం రావడంతో ఆట నిలిచింది. చినుకులు ఆగినా.. ఔట్ ఫీల్డ్‌లో అక్కడక్కడ తడిగా ఉండటంతో ఆట ఆలస్యమైంది. తిరిగి మొదలైన తర్వాత రోహిత్.. రెండు సిక్సర్లతో 36 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకొని స్కోరు వంద దాటించాడు. కరన్ ఓవర్లో సిక్స్, ఫోర్‌తో సూర్య సైతం మరింత వేగం పెంచాడు.
వీళ్ల జోరు చూస్తుంటే ఇండియా భారీ స్కోరు చేసేలా కనిపించింది. ఈ దశలో పుంజుకున్న ఇంగ్లిష్ బౌలర్లు వరుస వికెట్లతో ఇండియా జోరుకు బ్రేకులు వేశారు. 14వ ఓవర్లో స్పిన్నర్ ఆదిల్ రషీద్ గూగ్లీకి రోహిత్ బౌల్డ్ అవ్వడంతో మూడో వికెట్‌కు 73 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. మరో ఎండ్‌లో ఫిఫ్టీకి చేరువైన సూర్య రెండు ఓవర్ల తర్వాత ఆర్చర్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడి జోర్డాన్‌కు చిక్కాడు. దాంతో ఇండియా 124/4తో నిలిచింది. జోర్డాన్ వేసిన 18వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టిన హార్దిక్ పాండ్యా ( 23) వెంటనే కరన్‌కు క్యాచ్ ఇచ్చాడు. తర్వాతి బాల్‌కే కీపర్‌కు చిక్కిన దూబే డకౌటయ్యాడు. ఆర్చర్ వేసిన 19వ ఓవర్లో జడేజా (17 నాటౌట్) రెండు ఫోర్లు రాబట్టగా.. చివరి ఓవర్లో అక్షర్ పటేల్(10) సిక్స్ కొట్టి స్కోరు 170 మార్కు దాటించాడు.