దేశంలో లిథియం ఆయాన్‌‌‌‌ బ్యాటరీల తయారీకి ప్లాన్

దేశంలో లిథియం ఆయాన్‌‌‌‌ బ్యాటరీల తయారీకి ప్లాన్
  • రంగంలోకి కేంద్ర ప్రభుత్వం
  • గనులను కొననున్న కాబిల్‌‌‌‌
  • దిగుమతులు ఆగే చాన్స్‌‌

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీకి అవసరమైన విడిభాగాల్లో చాలా వరకు మనదేశంలోనే దొరుకుతున్నా, బ్యాటరీలను మాత్రం విదేశాల నుంచి తెప్పించక తప్పడం లేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్రం ప్లాన్లను రెడీ చేసింది. ఎగుమతుల కోసం చూడకుండా మనదేశంలోనే పెద్ద ఎత్తున లిథియం ఆయాన్‌‌‌‌ బ్యాటరీలను తయారు చేయించనుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఖనిజ్‌‌ బిదేశ్‌‌ ఇండియా లిమిటెడ్‌‌ (కాబిల్‌‌) అర్జెంటీనా, చిలీ, ఆస్ట్రేలియా, బొలివియాలోని లిథియం, కోబాల్ట్‌‌ గనులను సొంతం చేసుకోవడానికి చర్చలు జరుపుతోంది.  విదేశాల్లో గనులు కొనడంతోపాటు మనదేశంలోనూ తయారీని పెంచడానికి అర్బన్‌‌ మైనింగ్‌‌ విధానాన్ని అమలు చేస్తారు. రీసైకిల్డ్ మెటీరియల్స్ ద్వారా బ్యాటరీలను తయారు చేస్తారు. ఇండియాలో లిథియం రిజర్వులు చాలా తక్కువగా ఉండటంతో ఈవీ కంపెనీలు చైనా నుంచి బ్యాటరీలను తెప్పించుకుంటున్నాయి. ‘‘బ్యాటరీ సెల్‌‌లో లిథియం పరిమాణం నాలుగు శాతం కంటే తక్కువే ఉంటుంది కాబట్టి సెల్‌‌లను మనదేశంలోనే తయారు చేసుకోవచ్చు.  లిథియం రిజర్వులు తక్కువ ఉన్నందున కాబిల్‌‌ కొనబోయే గనుల ద్వారా, అర్బన్‌‌ మైనింగ్‌‌ ద్వారా దీనిని సమీకరించుకుంటాం. తద్వారా దిగుమతులను తగ్గించుకుంటాం’’ అని నీతి ఆయోగ్‌‌ సీఈఓ అమితాబ్ కాంత్‌‌ అన్నారు. చైనా నుంచి బ్యాటరీ దిగుమతులను తగ్గించడానికి ప్రయత్నించాలని ఎంపీ కె.కేశవరావు నాయకత్వంలోని పార్లమెంటరీ ప్యానెల్‌‌ కేంద్రానికి సూచించింది.

లిథియం సప్లై చాలా కీలకం...
ప్రపంచంలోని అడ్వాన్స్‌‌డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) తయారీ 90 శాతం చైనాలోనే జరుగుతోంది. ఇండియాలో లిథియం- అయాన్ బ్యాటరీలు తయారు కావడం లేదు. అందుకే కంపెనీలు సెల్‌‌లను,  బ్యాటరీ ప్యాక్‌‌లను దిగుమతి చేసుకుంటున్నాయి. దేశ ఒరిజినల్ ఎక్విప్‌‌మెంట్ తయారీ (ఓఈఎంలు) కంపెనీలకు  లిథియం సెల్స్‌‌ తయారీలో ప్రభుత్వ మద్దతు తప్పనిసరి. లిథియంను అందుబాటులోకి తేవడం వల్ల తక్కువ ఖర్చుతో బ్యాటరీలను తయారు చేయవచ్చని, ఈవీల ధరలను తగ్గించే అవకాశమూ ఉంటుందని కేశవ రావు ప్యానెల్ పేర్కొంది.  సోడియం అయాన్, అల్యూమినియం ఎయిర్, జింక్ ఎయిర్, సూపర్ కెపాసిటర్లతోనూ బ్యాటరీ సెల్స్‌‌ తయారీకి ప్రయత్నాలు వివిధ దశల్లో ఉన్నాయి. రాబోయే 4–-5 సంవత్సరాల వరకు మాత్రం లిథియం వాడకమే ఎక్కువ ఉండవచ్చు. "ఇతర సెల్స్‌‌ కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తాయని నేను బలంగా నమ్ముతున్నాను. 2016 నుండి లిథియం వాడకం పెరగడం వల్ల లిథియం మైనింగ్, నిల్వలు మొదలైన వాటి కోసం వెతుకులాట ఎక్కువయింది” అని కాంత్ అన్నారు.  భారతదేశంలో ఈవీల వాడకాన్ని పెంచడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో ఫాస్టర్ అడాప్షన్  మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ (ఫేమ్‌‌) 2,  ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్‌‌ (పీఎల్‌‌ఐలు) స్కీమ్స్​ ముఖ్యమైనవని చెప్పారు.  

ఈవీలవైపు పెద్ద కంపెనీలు కూడా..
మనదేశంలో గత రెండు సంవత్సరాలలో, అనేక ఈవీ స్టార్టప్‌‌‌‌లు వచ్చాయి. ఈ ఏడాది జనవరి–-జూలైలో ఈవీ సెక్టార్లలో 3.5 బిలియన్‌‌ డాలర్లకు పైగా ఇన్వెస్ట్‌‌మెంట్లు వచ్చాయి.  భారతదేశ ఈవీ మార్కెట్‌‌ 2030 నాటికి  206 బిలియన్‌‌ డాలర్లకు చేరుతుందని    అంచనా. స్టార్టప్‌‌లతోపాటు హీరో, బజాజ్,  టీవీఎస్‌‌ వంటి పెద్ద కంపెనీలూ ఈవీలపై ఫోకస్‌‌ చేయడమే ఇందుకు కారణం. పీఎల్‌‌ఐ వల్ల బ్యాటరీల తయారీ విపరీతంగా పెరుగుతుందని కాంత్‌‌ స్పష్టం చేశారు. 2030 నాటికి మనదేశంలో వెహికల్స్‌‌లో ఈవీల వాటాను 30 శాతానికి తేవాలనే టార్గెట్‌‌తో పనిచేస్తున్నామని చెప్పారు. అందుకే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఈవీ కొనుగోలుపై పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తున్నాయని వివరించారు.