అలా జరిగుంటే టీమిండియా వరల్డ్ కప్ గెలిచుండేది : అఖిలేష్ యాదవ్

 అలా జరిగుంటే టీమిండియా వరల్డ్ కప్ గెలిచుండేది  :  అఖిలేష్ యాదవ్

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.  ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ ను అహ్మదాబాద్‌లో కాకుండా లక్నోలో మ్యాచ్ నిర్వహించి ఉంటే టీమిండియా కచ్చితంగా కప్ గెలిచి ఉండేదని అన్నారు.  ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఎస్పీ చీఫ్ మాట్లాడుతూ లక్నోలో మ్యాచ్ జరిగి ఉంటే టీమిండియాకు విష్ణువు, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆశీస్సులు లభించేవని అన్నారు.   అహ్మదాబాద్‌లోని మోడీ స్టేడియం పిచ్‌లో  కొన్ని సమస్యలు ఉన్నాయని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.

 స్వదేశంలో వన్డే వరల్డ్ కప్‌‌లో వరుసగా పది విజయాలతో ఎదురైన ప్రతీ జట్టునూ మట్టి కరిపిస్తూ దూసుకొచ్చిన రోహిత్​సేన ఆఖరి మెట్టుపై తడబడింది.  అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం లక్ష మంది ప్రేక్షకుల ముంగిట జరిగిన ఫైనల్ మ్యాచ్‌‌లో ఇండియా 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. అన్ని విభాగాల్లో ఆధిపత్యం చూపెట్టిన ఆస్ట్రేలియా ఆరోసారి వరల్డ్ కప్‌‌ నెగ్గి ఈ ఆటలో  తమకు తిరుగేలేదని మరోసారి చాటి చెప్పింది. 

ఏకపక్షంగా సాగిన తుది పోరులో ఇండియా 50 ఓవర్లలో 240 రన్స్‌‌కే ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (66), విరాట్ కోహ్లీ (54), రోహిత్ శర్మ (47) రాణించినా మిగతా బ్యాటర్లు నిరాశ పరచడంతో ఆతిథ్య జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. చేజింగ్‌‌లో ట్రావిస్ హెడ్‌‌ (137) సెంచరీతో చెలరేగడంతో ఆస్ట్రేలియా 43 ఓవర్లలో నాలుగే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. హెడ్‌‌ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌గా నిలవగా.. విరాట్‌‌ కోహ్లీకి ప్లేయర్‌‌‌‌ ఆఫ్​ ద టోర్నమెంట్ అవార్డు దక్కింది.