ఎల్​ఏసీ వెంట చైనా కదలికలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిఘా

ఎల్​ఏసీ వెంట చైనా కదలికలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిఘా

న్యూఢిల్లీ: అరుణాచల్​ప్రదేశ్​లోని తవాంగ్ సెక్టార్​ వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇండియన్​ ఎయిర్​ఫోర్స్ (ఐఏఎఫ్) అప్రమత్తమైంది. లైన్​ ఆఫ్​ యాక్చువల్ కంట్రోల్ (ఎల్​ఏసీ) వెంట చైనా కదలికలపై నిఘా పెట్టేందుకు సుఖోయ్​–30 ఫైటర్ జెట్స్​ను రంగంలోకి దించింది. ఇండియన్ ఆర్మీతో కలిసి పెట్రోలింగ్​ చేస్తూ.. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నది. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు బార్డర్​ రీజియన్​లో ఫైటర్ జెట్స్ ఫ్రీక్వెన్సీ పెంచింది. ఘర్షణకు ముందు నుంచే సరిహద్దులో గస్తీ ముమ్మరం చేసింది.

సాధారణం కంటే ఫైటర్​ జెట్స్ నిఘా 2 నుంచి 3 రెట్లు పెంచినట్టు ఇండియన్ ఎయిర్​ఫోర్స్ అధికారులు మంగళవారం ప్రకటించారు. ఎల్​ఏసీ దగ్గర్లో చైనా కూడా తన యాక్టివిటీ పెంచిందన్నారు. ఫైటర్​ జెట్స్​తో ఎయిర్ పెట్రోలింగ్ చేస్తున్నదని తెలిపారు. చైనా ఆర్మీకి దీటుగా బదులిచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. తేజ్​పూర్​తో పాటు ఈస్టర్న్​ ఏరియాలో ఐఎఎఫ్​ బలం పెంచామన్నారు. పశ్చిమ బెంగాల్​లోని హసిమారా ఎయిర్​ బేస్​లో రాఫెల్ జెట్​ల స్క్వాడ్రన్​ ఉందని, అవసరమైతే వాటిని కూడా బార్డర్​కు తరలిస్తామని ప్రకటించారు. తవాంగ్ సెక్టార్​లోని యాంగ్ట్సే ఏరియాలో డ్రోన్లతో చైనా గస్తీ కాస్తోందన్నారు. డిసెంబర్​ 9న జరిగిన ఘర్షణపై రివ్యూ చేసినట్టు ఎయిర్ స్టాఫ్ చీఫ్ వీఆర్​ చౌదరీ తెలిపారు.