గ్యాంగ్ టక్: ఇండియన్ ఆర్మీ త్రిశక్తి కోర్ కు చెందిన ఇంజినీర్లు 72 గంటల్లోనే 70 అడుగుల బెయిలీ బ్రిడ్జిని నిర్మించారు. సిక్కింలోని గ్యాంగ్ టక్ వద్ద డిక్చు– సంక్లాంగ్ రహదారిపై ఈ నిర్మాణాన్ని చేపట్టారు. జూన్ 23న నిర్మాణ పనులను ప్రారంభించి 72 గంటల్లోనే నిర్మించారు. ఎడతెరిపి లేని వర్షాలు, సాంకేతిక అడ్డంకులను అధిగమించి దీనిని పూర్తి చేశారు.
ఈ సందర్భంగా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, స్థానిక అధికారులు ఆర్మీకి సహకరించారు. ఇటీవలి వరదల కారణంగా నార్త్ సిక్కింలోని అనేక ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఆర్మీ ఇంజినీర్లు బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి తెగిపోయిన ప్రాంతాలకు కనెక్టివిటీని పునరుద్ధరించారు. ఈ బ్రిడ్జి.. మంగన్ జిల్లాలోని ప్రజలకు ప్రాథమిక అవసరాలతో పాటు వైద్య సదుపాయాలను అందించడంలో సహాయపడుతుంది.
