లేహ్: ఒకవైపు 18,600 అడుగుల ఎత్తు.. మరోవైపు బలమైన పర్వత గాలులు.. హెలికాప్టర్ దిగేందుకు జాగ లేని పరిస్థితి. అయినాసరే, మంచుకొండల్లో చిక్కుకుపోయిన ఓ పర్వతారోహకుడిని భారత ఆర్మీ సోల్జర్లు కాపాడారు. లడఖ్‌లోని నన్‌కున్ పర్వతాల్లో ఆర్మీ ఏవియేషన్ పైలట్లు ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను విజయవంతంగా చేశారు.
హెలికాప్టర్ బరువు తగ్గించి..
అన్ని వేల అడుగుల ఎత్తులో గాలి సాంద్రత తక్కువగా ఉంటుంది కాబట్టి హెలికాప్టర్ ఇంజిన్ పనితీరు, రోటర్ బ్లేడ్ల లిఫ్ట్ సామర్థ్యం తగ్గిపోతుంది. దాంతో, అవసరం లేని పరికరాలన్నింటినీ తొలగించి హెలికాప్టర్ బరువును తగ్గించుకుని సోల్జర్లు రంగంలోకి దిగారు. బాధితుడి వద్దకు చేరుకున్న తర్వాత అసలు సవాల్ ఎదురైంది.
నిటారుగా ఉన్న కొండవాలు.. బలమైన గాలులు.. హెలికాప్టర్ దిగేందుకు ల్యాండింగ్ స్థలం లేదు. దీంతో పైలట్లు హెలికాప్టర్‌ను అత్యంత తక్కువ ఎత్తులో గాల్లోనే అదుపులో ఉంచారు. ఆపై, ఒక్క స్టాండ్‌ను మాత్రమే కొండవాలుపై ఆణించి క్లిష్టమైన టెక్నికల్ విధానాన్ని పాటించారు. హెలికాప్టర్‌ను అదే స్థితిలో స్థిరంగా ఉంచి, బాధితుడిని లోపలికి చేర్చి సురక్షితంగా కిందికి తెచ్చారు.
