దుబాయ్‌లో భారత బిలియనీర్ అరెస్ట్.. కొడుకుతో సహా జైలుపాలు, ఏమైందంటే..?

దుబాయ్‌లో భారత బిలియనీర్ అరెస్ట్.. కొడుకుతో సహా జైలుపాలు, ఏమైందంటే..?

ఇటీవలి కాలంలో చాలా మంది భారతీయ సంపన్నులు ఇండియా నుంచి ఇతర దేశాలకు వలస వెళుతున్న సంగతి తెలిసిందే. విలాసవంతమైన జీవితం, తక్కువ పన్నులు, ఎక్కువ ఇతర ప్రయోజనాల దృష్ట్యా వాళ్లు అనేక దేశాలకు వెళుతూ అక్కడే తమ వ్యాపారాలను ఏర్పాటు చేయటం, విస్తరించటం వంటి కార్యకలాపాలను చేపడుతున్న సంగతి తెలిసిందే. 

అయితే తాజాగా భారతదేశానికి సంబంధించిన ప్రముఖ వ్యాపారవేత్త బల్విందర్ సింగ్ సాహ్ని దుబాయ్‌లో జైలుపాలయ్యాడు. విలాసవంతమైన జీవనశైలిని కలిగి ఉన్న వ్యాపారవేత్త మనీలాండరింగ్ కేసులో చిక్కుకోవటంతో 5 ఏళ్ల జైలు శిక్ష పొందాడు. ఆయనకు సంబంధించిన రూ.344 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే దీనికి అదనంగా రూ.కోటి 14 లక్షలు జరిమానా విధించింది. శిక్షాకాలం ముగిసిన తర్వాత దేశం నుంచి బహిష్కరించాలని కూడా కోర్టు ఆదేశాల్లో పేర్కొంది. 

వాస్తవానికి బల్వీందర్ సింగ్ దుబాయ్‌లో పేరుగాంచిన అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ యజమాని. అతనికి యూఏఈ, అమెరికా, ఇండియాల్లో వ్యాపారం విస్తరించి ఉంది. పైగా కార్లకు ఖరీదైన నంబర్ ప్లేట్లను కొనుగోలు చేయటంలో సాహ్ని వార్తల్లో నిలిచాడు. 2016లో దుబాయ్‌లో 'D5' నంబర్ ప్లేట్‌ను ఏకంగా రూ.75 కోట్లు వెచ్చించి దక్కించుకున్నారు. అయితే ప్రస్తుతం ఆయన అనేక షెల్ కంపెనీల ద్వారా రూ.344 కోట్ల విలువైన అనుమానాస్పద లావాదేవీల ద్వారా మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో సాహ్నితో పాటు అతని కుమారుడితో సహా 32 మందికి కోర్టు శిక్ష విధించింది. ప్రస్తుతం ఈ కేసులో కొందరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.