జాహ్నవి కేసులో సమగ్ర విచారణ.. అమెరికాకు భారత్ కాన్సులేట్ విజ్ఞప్తి

జాహ్నవి కేసులో సమగ్ర విచారణ.. అమెరికాకు భారత్ కాన్సులేట్ విజ్ఞప్తి

వాషింగ్టన్: ఈ ఏడాది జనవరి 23న అమెరికాలోని సియాటిల్‌‌లో  పోలీసు పెట్రోలింగ్  వెహికల్  ఢీకొని చనిపోయిన తెలుగు విదార్థిని జాహ్నవి కందుల(23) కేసులో మరిన్ని వివరాలు బయటకొచ్చాయి. ఆమెను ఢీకొట్టిన సమయంలో  వెహికల్ స్పీడ్ గంటకు 119కి.మీ.గా ఉందని  ఓ వార్తాసంస్థ వెల్లడించింది.

హైస్పీడుతో  ఢీకొనడంతో జాహ్నవి దాదాపు 100 అడుగుల దూరంలో ఎగిరిపడినట్లు తెలిపింది. కెవిన్ డేవ్ అనే పోలీసు ఆఫీసర్  పెట్రోలింగ్  వెహికల్ నడిపినట్లు చెప్పింది. ఈ కేసుకు సంబంధించిన ఓ వీడియోను  సీటెల్ పోలీస్ డిపార్ట్‌‌మెంట్ సోమవారం విడుదల చేసింది. ఆ వీడియోలో  ప్రమాదానికి కారణమైన అధికారి ప్రవర్తన ఆగ్రహానికి గురిచేస్తున్నది.  

కాగా, దీనిపై శాన్ ఫ్రాన్సిస్కోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా (సీజీఐ) తీవ్రంగా స్పందించింది. జాహ్నవి మృతి సమయంలో పోలీసుల ప్రవర్తన ఆందోళనకరమైనదని మండిపడింది. కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని అమెరికాను కోరింది.  

అసలేం జరిగిందంటే..!

ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి 2021లో అమెరికా వెళ్లింది. అక్కడ సౌత్ లేక్ యూనియన్‌‌లోని నార్త్‌‌ఈస్ట్రన్  వర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నది. జనవరి 23న కాలేజీ నుంచి ఇంటికి బయలుదేరింది. రోడ్డు దాటుతుండగా పోలీసు వెహికల్ ఢీకొట్టింది. 

దాంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ప్రమాదానికి సంబంధించిన వీడియో తాజాగా బయటపడింది. ఆ వీడియోలో జాహ్నవి పట్ల పోలీసు అధికారి చులకనగా మాట్లాడిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. జాహ్నవి మృతితో పాటు అతడిపై కూడా విచారణ కొనసాగుతోంది.