ఎన్ని డెబిట్ కార్డులు ఉండి ఏం ఉపయోగం. అకౌంట్‌లో డబ్బులుంటేనే వినియోగానికి అక్కరకొస్తది. ఉదాహరణకు ఏటీఏం కార్డు.. నగదు విత్‌డ్రా చేయాలన్నా.. షాపింగ్‌కు వెళ్లాలన్నా మొదట అకౌంట్‌లో డబ్బులుండాలి. అదే క్రెడిట్ కార్డు అయితే ఖాతాలో పైసలు లేకున్నా వాడేయచ్చు. తరువాత ఎప్పుడో ఒక నెల రోజులకు కట్టొచ్చు. అందువల్లే జనాలు క్రెడిట్ కార్డుల కోసం ఎగబడుతున్నారు. ఈ బిజినెస్ మన దేశంలో మూడు పువ్వులు ఆరు కాయల్లా వికసిస్తోంది.
దేశంలో క్రెడిట్ కార్డుల పరిశ్రమ గణనీయమైన వృద్ధిని సాధిస్తోందని, గత ఐదేళ్లలో జారీ చేసిన క్రెడిట్ కార్డుల సంఖ్య రెట్టింపు అయిందని పీడబ్ల్యూసీ నివేదిక వెల్లడించింది. 2028-29 నాటికి దేశంలో క్రెడిట్ కార్డు వినియోగదారుల సంఖ్య 200 మిలియన్లకు(20 కోట్లు) చేరుతుందని నివేదించింది.. మొత్తంగా వీటిలో 15 శాతం కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు (CAGR) నమోదవుతుందని వెల్లడించింది. భవిష్యత్తులోనూ ఇదే ధోరణి కొనసాగుతుందని అంచనా వేసింది.
తగ్గుతున్న డెబిట్ కార్డుల వినియోగం
క్రెడిట్ కార్డుల బిజినెస్ రెట్టింపు వృద్ధిని సాధిస్తుంటే.. డెబిట్ కార్డుల వినియోగం బాగా తగ్గిందని నివేదిక పేర్కొంది. డెబిట్ కార్డ్ లావాదేవీల సంఖ్య, విలువ రెండూ తగ్గాయి. ఇది వినియోగదారుల ప్రాధాన్యతలలో మార్పును సూచిస్తోంది. FY23-24 ఏడాదిలో డెబిట్ కార్డ్ లావాదేవీల వాల్యూమ్ మునుపటి సంవత్సరంతో పోలిస్తే 33 శాతం తగ్గింది. డెబిట్ కార్డ్‌లపై ఏడాదికి18 శాతంమేర ఖర్చు తగ్గింది. ఒకే ఏడాదిలో డెబిట్ కార్డులు గణనీయంగా తగ్గాయి. FY 23-24 సమయంలో డెబిట్ లావాదేవీల పరిమాణం, విలువ మునుపటి సంవత్సరంతో పోలిస్తే 33 శాతం తగ్గాయి. అదే సమయంలో డెబిట్ కార్డ్‌లపై ఖర్చు ఏడాదిలో 18 శాతం తగ్గింది. డిజిటల్ పేమెంట్స్ వాడకం కూడా డెబిట్ కార్డుల వినియోగం తగ్గడానికి ఒక కారణంగా చెప్పవచ్చు.
డిజిటల్ చెల్లింపులు..
దేశంలో డిజిటల్ చెల్లింపులు వృద్ధిపథంలో సాగుతున్నట్లు పీడబ్ల్యూసీ నివేదిక వెల్లడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ చెల్లింపుల లావాదేవీల పరిమాణం ఏడాదిలో 42 శాతం పెరిగింది. ఈ ట్రెండ్ FY28-29 నాటికి మూడు రెట్లు పెరుగుతుందని అంచనా వేసింది. కొత్త వ్యాపార ఆలోచనలు, సాంకేతిక పురోగతి, ఖాతాదారులకు అవగాహన పెరగడం వంటి కారణాలు డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్నాయని నివేదిక వెల్లడించింది.