Saurabh Tiwary: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఐపీఎల్ స్టార్

Saurabh Tiwary: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఐపీఎల్ స్టార్

భారత క్రికెటర్, ఝార్ఖండ్ డైనమైట్ సౌరభ్ తివారీ (Saurabh Tiwary) క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫిబ్రవరి 16 నుండి 19 వరకు జంషెడ్‌పూర్‌ వేదికగా రాజస్థాన్‌తో జరగనున్న రంజీ మ్యాచ్ తన కెరీర్‌లో చివరిదని తెలిపాడు. గత 17 ఏళ్లుగా జార్ఖండ్ రంజీ జట్టుకు సేవలందిస్తున్న తివారీ తన నిర్ణయాన్ని ఇప్పటికే జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (JSCA)కు తెలియజేశాడు. 

సౌరభ్ తివారీ 11 ఏళ్ల వయస్సు నుంచే క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. 2006-07 రంజీ ట్రోఫీ సీజన్‌ ద్వారా ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. 2008లో విరాట్ సారథ్యంలో అండర్-19 ప్రపంచ కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడు. భారీ సిక్సర్లు బాదడంలో మంచి దిట్ట. 2010లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ అరంగ్రేటం చేసిన అతడు ఆ సీజన్‌లో 419 పరుగులు చేశాడు. దీంతో జాతీయ సెలెక్టర్ల నుంచి పిలుపొచ్చింది. జాతీయ జట్టు తరుపున మూడు వన్డేలు ఆడిన తివారి 49 పరుగులు చేశాడు. వీటిలో రెండింటిలో నాటౌట్‌గా నిలిచాడు.

సౌరభ్ తివారీ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రైజింగ్ పూణే సూపర్‌జెయింట్‌, ఢిల్లీ డేర్‌డెవిల్స్(ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్) జట్లకు ఆడాడు. ఇక దేశవాళీ క్రికెట్‌లో 115 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో 47.51 సగటుతో 8030 పరుగులు చేశాడు. ఇందులో  22 సెంచరీలు ఉన్నాయి. లిస్ట్ ఏ కెరీర్ లో 116 మ్యాచ్‌ల్లో 46.55 సగటుతో 4050 పరుగులు చేశాడు.

Also Read : ఆర్‌సీబీ టైటిల్ గెలిస్తే అదొక చరిత్ర

"చదువుకుంటున్న రోజుల్లో మొదలుపెట్టిన ఈ ప్రయాణానికి వీడ్కోలు పలుకుతున్నందుకు కొంచెం కష్టంగా ఉంది. అందుకు ఇదే సరైన సమయమని అనుకుంటున్నా.. నేను నా ప్రదర్శన ఆధారంగా తీసుకున్న నిర్ణయం కాదిది. రంజీల్లో, గత దేశవాళీ సీజన్‌లో నా రికార్డులు చూడొచ్చు. జట్టులో యువకులకు స్థానం కల్పించడం మంచిదని నేను భావిస్తున్నా.. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నా.. నాకు రాజకీయ పార్టీల నుండి ఆఫర్ వచ్చింది. అయితే, వాటి గురించి నేను ప్రస్తుతం ఆలోచించడం లేదు.." అని తివారీ విలేకరుల సమావేశంలో తెలిపాడు.