ఇంగ్లండ్‌‌ నుంచి దుబాయ్‎కు‎ ఇండియన్ క్రికెటర్లు

ఇంగ్లండ్‌‌ నుంచి దుబాయ్‎కు‎ ఇండియన్ క్రికెటర్లు
  • చలో యూఏఈ
  • ఇంగ్లండ్‌‌ నుంచి అరబ్​గడ్డకు ఇండియా క్రికెటర్లు
  • ఆరు రోజుల క్వారంటైన్‌‌ తర్వాతే జట్లలోకి ఎంట్రీ
  • అబుదాబి చేరిన రోహిత్‌‌, బుమ్రా, సూర్యకుమార్‌‌  

కరోనా దెబ్బకు ఇంగ్లండ్‌‌ సిరీస్‌‌కు అనుకోని ముగింపు పడగా.. అనుకున్నదాని కంటే కొన్ని రోజుల ముందే టీమిండియా శిబిరంలో ఐపీఎల్‌‌ సందడి మొదలైంది. లీగ్‌‌ ప్రారంభానికి సమయం దగ్గరపడుతుండటం.. ఆరు రోజుల క్వారంటైన్‌‌ తప్పనిసరి కావడంతో ప్లేయర్లంతా యూఏఈ జర్నీ హడావుడిలో ఉన్నారు. బీసీసీఐ చార్టెడ్‌‌ ఫ్లైట్‌‌ ప్లాన్‌‌ రద్దు కాగా..  ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసిన విమానాల్లో మాంచెస్టర్‌‌ నుంచి అరబ్‌‌గడ్డకు వెళుతున్నారు. క్వారంటైన్‌‌ రూల్‌‌ దెబ్బకు పలువురు ఇంగ్లిష్‌‌ క్రికెటర్లు సీజన్‌‌ నుంచి తప్పుకోవడం లీగ్‌‌ వర్గాల్లో నిరాశ కలిగిస్తోంది.

దుబాయ్‌‌‌‌: ఇంగ్లండ్‌‌‌‌ సిరీస్‌‌‌‌ అనుకున్న షెడ్యూల్‌‌‌‌ కంటే ముందే ముగియడంతో ఐపీఎల్‌‌‌‌ బరిలో ఉన్న టీమిండియా క్రికెటర్లు యూఏఈ చేరుకుంటున్నారు. ప్లేయర్లందరికీ రెండోసారి నిర్వహించిన ఆర్టీపీసీఆర్‌‌‌‌ టెస్ట్‌‌‌‌లో నెగెటివ్‌‌‌‌ రావడంతో ప్రయాణాలు ఊపందుకున్నాయి. వాస్తవానికి ఇంగ్లండ్‌‌‌‌లో ఉన్న ఇండియా టీమ్‌‌‌‌ను యూఏఈ చేర్చేందుకు బీసీసీఐ సెప్టెంబర్‌‌‌‌ 15న చార్టెడ్‌‌‌‌ ఫ్లైట్‌‌‌‌ బుక్‌‌‌‌ చేసింది. బబుల్‌‌‌‌ టు బబుల్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ కింద ప్లేయర్లను ఎలాంటి క్వారంటైన్‌‌‌‌ లేకుండా నేరుగా తమ ఫ్రాంచైజీలతో కలిపేలా ప్లాన్‌‌‌‌ చేసింది. కానీ కరోనా అన్నింటిని తారుమారు చేసింది. ఇంగ్లండ్‌‌‌‌తో ఐదో టెస్ట్‌‌‌‌ రద్దు కావడంతో బీసీసీఐ అనుకున్న చార్టెడ్‌‌‌‌ ఫ్లైట్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ కూడా క్యాన్సిల్‌‌‌‌ అయ్యింది. ఈ కారణం వల్ల బబుల్‌‌‌‌ టు బబుల్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌కు అవకాశం లేకపోగా  యూకే నుంచి  యూఏఈ వస్తున్న ప్లేయర్లకు ఆరు రోజుల క్వారంటైన్‌‌‌‌ తప్పనిసరైంది. దీంతో లీగ్‌‌‌‌కు సమయం దగ్గరపడుతుండటంతో తమ ప్లేయర్లను రప్పించుకునే అంశంలో ఐపీఎల్ ఫ్రాంచైజీలు స్పీడు పెంచాయి. ఆదివారం రాత్రి కల్లా ప్లేయర్లను యూఏఈ చేర్చేందుకు స్పెషల్‌‌‌‌ ఫ్లైట్స్‌‌‌‌ బుక్‌‌‌‌ చేస్తున్నాయి.  ఇందులో భాగంగా ముంబై ఇండియన్స్‌‌‌‌ ప్లేయర్లు రోహిత్‌‌‌‌ శర్మ, జస్‌‌‌‌ప్రీత్‌‌‌‌ బుమ్రా, సూర్యకుమార్‌‌‌‌ యాదవ్‌‌‌‌ తమ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ఉదయమే అబుదాబి చేరుకున్నారు. అయితే ఆరు రోజుల క్వారంటైన్‌‌‌‌ అనంతరం వీళ్లు మిగిలిన టీమ్‌‌‌‌తో కలుస్తారు. రాయల్‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌ బెంగళూరు,  చెన్నై సూపర్‌‌‌‌ కింగ్స్‌‌‌‌, పంజాబ్‌‌‌‌ కింగ్స్‌‌‌‌ కూడా యూఏఈలో ఉన్న తమ ప్లేయర్స్‌‌‌‌ కోసం ఫ్లైట్స్‌‌‌‌ బుక్‌‌‌‌ చేస్తున్నాయి.  బెంగళూరు కెప్టెన్‌‌‌‌ విరాట్‌‌‌‌ కోహ్లీ, పేసర్‌‌‌‌ మహ్మద్‌‌‌‌ సిరాజ్‌‌‌‌తో కలిసి యూఏఈ చేరుకోనున్నారు. వీళ్లు శనివారం రాత్రి మాంచెస్టర్‌‌‌‌ నుంచి బయలుదేరే చాన్సుంది.  ఇక రవీంద్ర జడేజా, చతేశ్వర్‌‌‌‌ పుజారా, శార్దూల్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌తోపాటు ఇంగ్లండ్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ సామ్‌‌‌‌ కరన్‌‌‌‌ కోసం  చెన్నై  ఫ్రాంచైజీ  ఏర్పాట్లు చేసింది. సాయంత్రమే బయలుదేరిన ఈ ఫ్లైట్‌‌‌‌లో చెన్నై ప్లేయర్లతోపాటు ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ రవిచంద్రన్‌‌‌‌ అశ్విన్‌‌‌‌ కూడా ఉన్నాడు. డీసీ  కెప్టెన్‌‌‌‌ రిషబ్‌‌‌‌తో పాటు రహానె, ఇషాంత్‌‌‌‌ శర్మ, పృథ్వీ షా,  ఉమేశ్‌‌‌‌ యాదవ్‌‌‌‌, అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌ కూడా దుబాయ్‌‌‌‌ బయలుదేరారు.  సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌ వికెట్‌‌‌‌ కీపర్‌‌‌‌ వృద్ధిమాన్‌‌‌‌ సాహా,  రాజస్తాన్‌‌‌‌ రాయల్స్‌‌‌‌ ఆటగాడు లివింగ్‌‌‌‌స్టోన్‌‌‌‌ కూడా అరబ్‌‌‌‌గడ్డకు పయనమయ్యారు. మరోపక్క తమ కెప్టెన్‌‌‌‌ కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌తోపాటు మయాంక్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌, మహ్మద్‌‌‌‌ షమీ యూఏఈ బయలుదేరేలా పంజాబ్‌‌‌‌ కింగ్స్‌‌‌‌ కూడా ఏర్పాట్లు చేస్తోంది. 

ముగ్గురు ఇంగ్లండ్‌‌‌‌ క్రికెటర్లు ఔట్‌‌‌‌..
ఇండియాతో టెస్ట్‌‌‌‌ సిరీస్‌‌‌‌లో ఆడిన ముగ్గురు ఇంగ్లండ్‌‌‌‌ క్రికెటర్లు ఐపీఎల్‌‌‌‌ నుంచి తప్పుకున్నారు. సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ ఓపెనర్‌‌‌‌ బెయిర్‌‌‌‌ స్టో, పంజాబ్‌‌‌‌ కింగ్స్‌‌‌‌ బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌ డేవిడ్‌‌‌‌ మలాన్‌‌‌‌, ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ క్రిస్‌‌‌‌ వోక్స్‌‌‌‌ వ్యక్తిగత కారణాల వల్ల లీగ్‌‌‌‌ నుంచి విత్‌‌‌‌ డ్రా అయ్యారు. అయితే ఆరు రోజుల తప్పనిసరి క్వారంటైన్‌‌‌‌ రూల్‌‌‌‌ వల్లే ఆ ముగ్గురు ఈ నిర్ణయం తీసుకున్నారని బీసీసీఐకి చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. బెయిర్‌‌‌‌స్టో  లేకపోవడం సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌కు పెద్ద లోటు అయితే అతనికి రీప్లేస్‌‌‌‌మెంట్‌‌‌‌గా వెస్టిండీస్‌‌‌‌కు చెందిన షర్ఫేన్‌‌‌‌ రూథర్‌‌‌‌ఫోర్డ్‌‌‌‌ను సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ జట్టులోకి తీసుకుంది. కాగా డేవిడ్‌‌‌‌ మలాన్‌‌‌‌కు రీప్లేస్‌‌‌‌మెంట్‌‌‌‌గా ఐడెన్‌‌‌‌ మార్‌‌‌‌క్రమ్‌‌‌‌ (సౌతాఫ్రికా)కు పంజాబ్‌‌‌‌ జట్టు చాన్స్​ ఇచ్చింది. 

వార్నర్‌‌‌‌ వచ్చేశాడు..
ఆస్ట్రేలియా స్టార్‌‌‌‌ బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌, సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌ మాజీ కెప్టెన్‌‌‌‌ డేవిడ్ వార్నర్‌‌‌‌.. ఐపీఎల్‌‌‌‌ కోసం యూఏఈ వచ్చేశాడు. శుక్రవారమే అరబ్‌‌‌‌గడ్డపై అడుగుపెట్టిన వార్నర్‌‌‌‌ ప్రస్తుతం క్వారంటైన్‌‌‌‌లో ఉన్నాడు. గాయం వల్ల నాలుగు నెలలుగా ఆటకు దూరమైన వార్నర్‌‌‌‌..  ప్రస్తుతం ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌పై ఫోకస్‌‌‌‌ పెట్టాడు. క్వారంటైన్‌‌‌‌ ఉన్న హోటల్‌‌‌‌ రూమ్‌‌‌‌లోనే పలు ఎక్స్‌‌‌‌ర్‌‌‌‌సైజులు చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను వార్నర్‌‌‌‌ సోషల్‌‌‌‌ మీడియాలో పోస్ట్‌‌‌‌ చేశాడు. ఫస్ట్‌‌‌‌ ఫేజ్‌‌‌‌లో తీవ్ర నిరాశపర్చిన సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌.. సెకండ్‌‌‌‌ ఫేజ్‌‌‌‌లోనైనా సత్తా చాటాలంటే వార్నర్‌‌‌‌ ఫామ్‌‌‌‌లోకి రావడం కీలకం. ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌, ఆస్ట్రేలియా ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ మార్కస్‌‌‌‌ స్టోయినిస్‌‌‌‌ కూడా వార్నర్‌‌‌‌ వెంట యూఏఈ వచ్చాడు.