
పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలు ఉండడంపై ఇటీవల భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. పాకిస్తాన్ ఒక రోగ్ కంట్రీ అని.. అలాంటి దేశం వద్ద న్యూక్లియర్ వెపన్స్ ఉండడం ఎంత వరకు సేఫ్ అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. పాక్ వద్ద ఉన్న అణ్వాయుధాలను అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) పర్యవేక్షించాలని సూచించారు. 2025 మేలో కశ్మీర్‌లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
ఇటువంటి పరిస్థితుల్లో, అణ్వాయుధ భద్రతపై అంతర్జాతీయ స్పందన లేకపోవడం, అనుమానాలకు తావిస్తోంది. అమెరికా, చైనా, బ్రిటన్, గల్ఫ్ దేశాలు కాల్పుల విరమణ, శాంతి చర్చలను ప్రోత్సహించాయి. కానీ పాకిస్తాన్ అణ్వాయుధ భద్రతపై స్పష్టమైన ఆందోళన వ్యక్తం చేయడంలో విఫలమయ్యాయి.
భారత్, పాకిస్తాన్ రెండూ అణ్వాయుధ దేశాలే. కాకపోతే, భారతదేశం వద్ద ఉన్న సహనం వేరు. ఒక తీవ్రవాద దేశంగా ముద్ర పడిన పాకిస్తాన్ వేరు అనే విషయాన్ని గమనించాలి. మనది ప్రజాస్వామ్యదేశం, పాకిస్తాన్ పేరుకు పార్లమెంటేరియన్ దేశం తప్ప అది మతఛాందస శక్తులను, మతోన్మాద తీవ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న దేశం. అంతేకాదు అది మిలటరీ ఆధిపత్యంలో కొనసాగుతూ వస్తున్న దేశం. అలాంటి దేశం చేతిలో అణ్వాయుధాలు ఎంత భద్రంగా ఉంటాయనేదే ప్రశ్న.
పర్యవేక్షణ వ్యవస్థపై విశ్వాసం ఎంత?
2020 చివరి నాటికి పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాల సంఖ్య 200కి చేరి ఉండవచ్చని ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ న్యూక్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రాజెక్ట్‌లో భాగంగా చేసిన పరిశోధన ‘ది న్యూక్లియర్ నోట్‌బుక్’ అంచనా వేస్తోంది. పాకిస్తాన్ అణ్వాయుధాలు జాతీయ కమాండ్ అథారిటీ (NCA) పర్యవేక్షణలో ఉన్నా, వ్యవస్థపై అంతర్జాతీయ నిపుణుల విశ్వాసం అంతగా లేదు. తాజాగా అమెరికాలోని టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్, థింక్‌ట్యాంకులు పాకిస్తాన్‌లో మిలిటెంట్ గ్రూపుల చొరబాటు, అంతర్గత భద్రతా వైఫల్యాలు, ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత వంటి అంశాలను ప్రస్తావిస్తూ, అణ్వాయుధ భద్రతపై తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశాయి.
అణ్వాయుధ కేంద్రాలు ఉగ్రవాదుల లక్ష్యంగా మారితే..
2025 ఏప్రిల్ నాటికి, బలూచిస్తాన్ విముక్తి సేన పాకిస్తాన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో చేసిన తిరుగుబాటు తెలిసిందే. ఈ ప్రాంతంలో ముఖ్యమైన మిస్సైల్ తయారీ కేంద్రం సమీపంలో చోటుచేసుకున్న దాడులు, పాకిస్తాన్ ప్రభుత్వం భద్రతపై పూర్తి నియంత్రణ కోల్పోయినట్లు సూచిస్తున్నాయి.
ఈ పరిస్థితిలో అణ్వాయుధ నిల్వ కేంద్రాలు ఉగ్రవాదుల లక్ష్యంగా మారితే, దాని ప్రభావం అంతర్జాతీయ స్థాయిలో తీవ్రంగా ఉంటుంది. ఇటీవల ఒక అధ్యయనం ప్రకారం, భారత్-, పాకిస్తాన్ మధ్య అణు యుద్ధం సంభవిస్తే 50 మిలియన్ల మంది ప్రాణనష్టానికి, ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల మంది ఆహార కొరతను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించింది.
భద్రతపై ప్రశ్నించని దేశాలు
అమెరికా, పాకిస్తాన్ అణ్వాయుధ భద్రతపై నేరుగా ప్రశ్నలు లేవనెత్తలేదు. పాకిస్తాన్‌కు అత్యంత సన్నిహిత మిత్రదేశంగా చైనా వ్యవహరిస్తోంది. పాకిస్తాన్‌ను భారత్‌పై వ్యూహాత్మకపరంగా సమతూకంగా నిలబెట్టే యత్నంలో, పాకిస్తాన్ అణు కార్యక్రమానికి మౌన మద్దతు ఇస్తోంది. తాజాగా, చైనా-–పాక్ ఎకనామిక్ కారిడార్ కోసం చైనా చేసిన మిలటరీ ఇన్‌ఫ్రా ఇన్వెస్ట్మెంట్లు కూడా ఆ దేశానికి మద్దతుగా మారాయి. బ్రిటన్, గల్ఫ్ దేశాలు.. ఉగ్రవాద వ్యతిరేక చట్టాలు, శాంతి చర్చలు అంటూ మాట్లాడుతున్నప్పటికీ, పాకిస్తాన్ అణ్వాయుధ భద్రతపై స్పష్టమైన వైఖరి ప్రశ్నించడం లేదు. గల్ఫ్ దేశాలు పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తున్న ముస్లిం మైత్రీ, తక్కువ ధరల మైలిటరీ పని సేవల ఆధారిత సంబంధాలు కారణంగా మౌనం పాటిస్తున్నాయి.
పాక్లో రాజకీయ అస్థిరత
పాకిస్తాన్‌లో రాజకీయ అస్థిరత పెరిగిపోయింది. ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నాయకత్వంలోని ప్రభుత్వం, ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ తెహ్రీక్- ఇ- ఇన్సాఫ్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఆందోళనలను ఎదుర్కొంటోంది. ఈ రాజకీయ అస్థిరత, సైనిక, అణు సంస్థల మధ్య సమన్వయాన్ని దెబ్బతీస్తోంది. జూన్ 2025లో ఖైబర్ ఫఖ్తూన్‌ఖ్వాలో టీటీపీ చేపట్టిన దాడి, అణ్వాయుధ స్థావరానికి 100 కిలోమీటర్ల దూరంలో జరిగింది, ఇది భద్రతా లోపాలను మరింత స్పష్టం చేసింది.
తీవ్రవాద దేశంలో అణ్వాయుధాలు ప్రమాదం
పాకిస్తాన్‌లో అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళితే, కేవలం దాని పొరుగు దేశాలకే కాదు, యూరప్, మధ్యప్రాచ్యం, అమెరికా వంటి ప్రాంతాలకు కూడా ముప్పుగా మారతాయి. ఈ సందర్భంలో అమెరికా శాంతి కోరిక మాత్రమే అడగడం కాదు, భద్రతపై జవాబుదారీగా మాట్లాడాలి. చైనా వ్యూహాత్మక మద్దతు పేరు చెప్పి, ఉగ్రవాద భవిష్యత్తును ప్రోత్సహించవద్దు. బ్రిటన్, గల్ఫ్ దేశాలకు మౌనం పనికి రాదు. పాకిస్తాన్ అణ్వాయుధ భద్రత ఒక ప్రపంచ భద్రతా అంశం. దీనిపై అంతర్జాతీయ పర్యవేక్షణ అనివార్యం. శాంతి చర్చలు, కాల్పుల విరమణలు తాత్కాలిక ఉపశమనం కలిగించవచ్చు. కానీ అణ్వాయుధ భద్రతపై గట్టి హామీలు లేకుండా, శాంతికి స్థిరత్వం లేదు. ఇప్పుడు ప్రపంచం మాట్లాడాలి. స్పష్టమైన చర్యలు తీసుకోవాలి.
ప్రపంచం ప్రశ్నించకపోతే..
IAEA (అంతర్జాతీయ అణుశక్తి సంస్థ) గతంలో పాకిస్తాన్‌పై భద్రతా మార్గదర్శకాలు సలహా ఇచ్చినా, వాటిపై అమలు ఎంతవరకు జరిగిందో స్పష్టత లేదు. భారత్ ఇటీవల చేపట్టిన ఆపరేషన్ సిందూర్, పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేయడంలో విజయవంతమైంది. ఉగ్రవాదుల ఉనికి అణ్వాయుధ భద్రతపై ప్రభావం చూపించే అవకాశాలు ఎంత? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాకిస్తాన్ అణ్వాయుధ భద్రతపై ప్రపంచం ప్రశ్నించకపోతే, ఒక చిన్న తప్పిదం కూడా అతి పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. దక్షిణాసియాలో యుద్ధమయ్యే పరిస్థితిని ప్రపంచవ్యాప్తంగా ఆహార సరఫరా సమస్యలను, ఆర్థిక విపత్తులను, పర్యావరణ నాశనాన్ని తీసుకురావచ్చు.
సిద్ధగౌని సుదర్శన్, సీనియర్ జర్నలిస్ట్