పాకిస్తాన్​కు మనదేశ రహస్యాలు లీక్

పాకిస్తాన్​కు మనదేశ రహస్యాలు లీక్

 

  • రష్యాలో ఇండియన్ ఎంబసీ 
  • ఉద్యోగి నిర్వాకం.. మీరట్​లో అరెస్టు

లక్నో: మన దేశ ఆర్మీ రహస్యాలను పాకిస్తాన్​కు అందజేస్తున్న ఐఎస్ఐ ఏజెంట్​ సతేంద్ర సివాల్​ను ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్(ఏటీఎస్) పోలీసులు అరెస్ట్ చేశారు. పాక్ ఐఎస్ఐ ఏజెంట్లు మన దేశ విదేశాంగ శాఖలో పనిచేస్తున్నోళ్లకు డబ్బిస్తామని ఆశపెట్టి.. రహస్యాలను లాగుతున్నారని ఏటీఎస్​కు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. హాపూర్​లోని షామయుద్దీన్​పూర్ గ్రామానికి చెందిన సతేంద్ర సివాల్​కు పాక్ నుంచి డబ్బు అందినట్లు గుర్తించారు. ఆదివారం మీరట్​లో అతడిని అరెస్ట్ చేసి విచారించారు. తాను పాక్​కు ఇన్ఫర్మేషన్ అందించినట్లు, అందుకు క్యాష్ తీసుకున్నట్లు నిందితుడు ఒప్పుకున్నాడని పోలీసులు మీడియాకు వెల్లడించారు. 

నిందితుడు మాస్కోలోని ఇండియన్ ఎంబసీలో 2021నుంచి ఇండియా బేస్డ్ సెక్యూరిటీ అసిస్టెంట్​గా పనిచేస్తున్నాడని తెలిపారు. ఇండియన్ ఎంబసీ, డిఫెన్స్ మినిస్ట్రీ, విదేశీ వ్యవహారాల శాఖకు సంబంధించిన కీలక సమాచారాన్ని సతేంద్ర సివాల్ పాకిస్తాన్​కు అప్పగించినట్లు ఏటీఎస్ అధికారులు అనుమానిస్తున్నారు. వాటికి సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నారు. విచారణలో నిందితుడు పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడని, చివరికి గూఢచారిగా పనిచేసినట్లు ఒప్పుకున్నాడని ఏటీఎస్ అధికారులు తెలిపారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. ఇలాంటి వ్యక్తుల ద్వారా సైనిక రహస్యాలు దేశం దాటి వెళ్లడంతో మనదేశానికి అతిపెద్ద ఆపద వచ్చే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.