ఆ టూరిస్ట్ ప్రదేశాలకు వెళ్లకండి: భారతీయులకు ఇండియన్ ఎంబసీ ట్రావెల్ అడ్వైజరీ జారీ

ఆ టూరిస్ట్ ప్రదేశాలకు వెళ్లకండి: భారతీయులకు ఇండియన్ ఎంబసీ ట్రావెల్ అడ్వైజరీ జారీ

న్యూఢిల్లీ: థాయిలాండ్-కంబోడియా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాలు సరిహద్దుల్లో పరస్పరం భీకర దాడులు చేసుకుంటున్నాయి. థాయ్, కంబోడియా దేశాల మధ్య దాడులు తీవ్రతరం అవుతుండటంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు భారతీయులకు థాయ్‎లాండ్‎లోని ఇండియన్ ఎంబసీ శుక్రవారం (జూలై 25) ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. థాయిలాండ్-కంబోడియా సరిహద్దుల్లో ఉద్రిక్తల నేపథ్యంలో భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని, కొన్ని పర్యాటక ప్రదేశాల్లో పరిస్థితి బాగోలేదని.. అక్కడ వెళ్లొద్దని హెచ్చరించింది. 

ఉబోన్ రాట్చథాని, సురిన్, సిసాకెట్, బురిరామ్, సా కాయో, చంతబురి, ట్రాట్ వంటి ఏడు ప్రావిన్సులలోని పర్యాటక ప్రదేశాలకు వెళ్లడం సేఫ్ కాదని థాయిలాండ్ పర్యాటక అథారిటీ (TAT) హెచ్చరించిందని.. థాయిలాండ్‌‎కు వెళ్లే టూరిస్టులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది. ఫు చోంగ్‑నా యోయి నేషనల్ పార్క్, ప్రసాత్ తా ముయెన్ థామ్ ఆలయం, చోంగ్ చోమ్, బాన్ హాట్ లేక్ ప్రాంతాల్లో కూడా పరిస్థితి బాగోలేదని.. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వెళ్లకపోవడమే మంచిదని హెచ్చరించింది.

కాగా, సరిహద్దు వివాదం కారణంగా థాయ్ లాండ్, కంబోడియా దేశాలు పరస్పరం దాడి చేసుకున్న విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య సరిహద్దు వద్ద పలు గ్రామాల్లో గురువారం (జూలై 24) ఇరు దేశాల సైనికులు.. ఫైటర్ జెట్లు, రాకెట్లు, ఫిరంగులతో దాడులకు దిగారు. ఈ అటాక్‎లో ఇరువైపులా 11 మంది చనిపోగా పలువురు గాయపడ్డారు. 

►ALSO READ | పాకిస్తాన్లో వాన,వరద బీభత్సం..నెలరోజుల్లో 266 మంది మృతి

థాయ్ లాండ్‎లోని సురిన్ ప్రావిన్స్, కంబోడియాలోని ఒడ్డర్ మీంచే ప్రావిన్స్ సరిహద్దుల వద్ద ‘ఎమరాల్డ్ ట్రయాంగిల్’ ఏరియా విషయంలో ఇరు దేశాల మధ్య కొన్ని దశాబ్దాలుగా వివాదం నడుస్తోంది. లావోస్‎తో పాటు ఇరు దేశాల సరిహద్దులు  ఇక్కడ కలుస్తాయి. ప్రాచీన దేవాలయాలకు ఈ ప్రాంతం ఆవాసంగా ఉంది. 15 ఏండ్ల కిందట ఇరు దేశాలు ఈ ప్రాంతం కోసం గొడవపడ్డాయి. 

ఈ ఏడాది మే నెలలో కూడా జరిగిన గొడవలో కంబోడియన్ సైనికుడు చనిపోయాడు. తాజాగా 2025, జూలై 24న మళ్లీ రెండు దేశాలు దాడి చేసుకున్నాయి. అయితే.. ముందుగా దాడి చేసింది మీరంటే మీరే అంటూ రెండు దేశాలు ఆరోపణలు చేసుకున్నాయి. థాయ్ లాండ్‎పై రాకెట్లు, ఫిరంగులతో కంబోడియా దాడి చేయగా.. థాయ్ లాండ్ కూడా ఎఫ్16 ఫైటర్ జెట్లతో కౌంటర్ ఎటాక్ చేసింది.