టెస్టులు చేసినంకనే పెండ్లికి రానిచ్చిర్రు

టెస్టులు చేసినంకనే పెండ్లికి రానిచ్చిర్రు

ఆమెది చైనా. అతడిది ఇండియా. ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇండియాలో పెళ్లికి రెడీ అయ్యారు. చైనా నుంచి పెండ్లి కూతురు అమ్మానాన్నలు, మరో ఇద్దరు చుట్టాలొచ్చారు. కానీ..వాళ్లను పెళ్లి మండపానికి కాకుండా హాస్పిటల్కు తీసుకెళ్లారు. టెస్టులన్నీ చేసి, వాళ్లకు కరోనా వైరస్ లక్షణాలేవీ లేవని తేల్చిన తర్వాతే పెళ్లి మండపానికి పంపించారు. మధ్యప్రదేశ్ లోని మాండ్సర్ టౌన్ లో జరిగిందీ సంఘటన. ఆపెళ్లి కొడుకు సత్యార్థ్ మిశ్రా. మధ్యప్రదేశ్ లోని మాండ్సర్ టౌన్ కు చెందినోడు. పెళ్లి కూతురు జిహావో వాంగ్. చైనా సిటిజన్.

ఇద్దరూ కెనడాలోని షెరిడాన్ యూనివర్సిటీలో ఐదేళ్ల క్రితం పరిచమయ్యారు. ఇంకేం .. చూపులు కలిశాయి. మనసులూ తెలిశాయి. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరువైపుల పెద్దోళ్లతో మాట్లాడి వాళ్లనూ ఒప్పించేశారు. ఇక పెళ్లి చేసుకోవడమే మిగిలింది. కానీ ఆమెనేమో చైనీస్.ఇతడేమో ఇండియన్. ఏ రకంగా చూసినా ఇద్దరి పద్ధతులూ పూర్తిగా డిఫరెంట్. అసలుమ్యాచ్ అయ్యే చాన్సే లేదు. అయితే, ఇండియన్ కల్చర్, ట్రెడిషనల్ పెండ్లిళ్ల గురించి తెలుసుకున్న జిహావో ఇండియాలోనే ఇక్కడి పద్ధతుల్లోనే పెళ్లాడాలని డిసైడ్ అయింది. వధూవరులిద్దరూ కెనడా నుంచి వచ్చి మాండ్సర్ లో వాలిపోయారు.

చైనా నుంచి వధువు అమ్మా నాన్నలు,రిలేటివ్స్ కూడా వచ్చేశారు. వీళ్లు కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తున్న చైనా నుంచి వస్తుండటంతో లోకల్ డాక్టర్లు, అధికారులు టెన్షన్ పడ్డా రు. అందుకే వాళ్లు టౌన్ లో దిగగానే డాక్టర్లు, అధికారులు కలిశారు. నేరుగా హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఆరుగురు డాక్టర్లతో కూడిన టీం వాళ్లకు టెస్టులు చేసి, వైరస్ లక్షణాలు లేవని తేల్చిన తర్వాతే పెళ్లి మండపానికి పంపారు. ఈ జంట ఆదివారం బంధుమిత్రుల సమక్షంలోఘనంగా పెళ్లి చేసుకున్నారు.

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి