మధ్య తరగతిలో గొప్పోళ్ల డాబుసరి : అప్పులు చేసి లగ్జరీ ఐటమ్స్ కొంటున్నారు..!

మధ్య తరగతిలో గొప్పోళ్ల డాబుసరి : అప్పులు చేసి లగ్జరీ ఐటమ్స్ కొంటున్నారు..!

Indian Middle Class: ప్రస్తుతం సమాజంలో హుందాగా కనిపించే వారికి సొసైటీ గౌరవం ఇస్తోంది. వాడికి వెనకాల వందల కోట్లు అప్పులున్నా సరే బయటకి వచ్చినప్పుడు ఎలా కనిపిస్తున్నాం అనేదానికే ప్రాధాన్యం ఇవ్వబడుతోంది. డబ్బు ఒంటిమీద ధరించిన బట్టల్లో, వాడే వస్తువుల్లో చూపించుకోవటం కూడా సహజంగా మారిపోయింది. 

ప్రస్తుతం సమాజంలో మధ్యతరగతి ప్రజలు లగ్జరీ వస్తువులు, ఖరీదైన జీవనశైలి వెనకు పరిగెడుతున్నారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సమాజంలో గౌరవం కోసమో లేక తాము ఎందులోనూ తీసిపోము అని చెప్పుకోవటానికి మధ్యతగరతి ప్రజలు లగ్జరీ మత్తులో తూగుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఒకప్పుడు రోలెక్స్, గుచి, లూఈస్ ఫిలిప్పీ వంటి లగ్జరీ బ్రాండ్ వస్తువులు ధనికోసమే.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోయాయి. ఎందుకంటే వీటిని ప్రస్తుతం ఎక్కువగా భారతీయ మధ్యతరగతి ప్రజలు, వేతనజీవులు, ఫ్రీలాన్సర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్లు వాడటం సర్వ సాధారణంగా మారిపోయింది. 

మధ్యతరగతి ప్రజలు ప్రస్తుతం ధనవంతులుగా కనిపించటం కోసం ఎక్కువగా లగ్జరీ వస్తువులు కొంటున్నారని మార్కెట్ నిపుణుడు అభిజిత్ చోక్సీపేర్కొన్నారు. దేశంలో 75 శాతం లగ్జరీ వస్తువులకు డిమాండ్ మధ్యతరగతి ప్రజల నుంచే ఉందని పేర్కొన్నారు. ఉదాహరణకు 1995లో లూఈస్ ఫిలిప్పీ 40వేల రూపాయల హ్యాండ్ బ్యాగ్ కేవలం ధనికులకు అమ్మగా దాని ధర రూ.2లక్షల 80వేలు అయినప్పటికీ ప్రస్తుతం ఈఎంఐలు మధ్యతరగతి యువత కొంటున్నారని పేర్కొన్నారు. ఇక్కడ లగ్జరీ వస్తువులు చీప్ కాలేదని మిడిల్ క్లాస్ వాటికి అడిక్ట్ అయ్యారని అన్నారు. వస్తువు ధర కాకుండా సమాజంలో దానిని కలిగి ఉండటంతో వచ్చే గౌరవం కోసం వారు వెంపర్లాడుతున్నారని చెప్పారు. 

ఇలాంటి అలవాట్లకు మధ్యతరగతి ప్రజలు అడిక్ట్ కావటానికి పరిశ్రమలు కూడా ప్రధాన కారణంగా మారాయి. నేటి కాలంలో ఖరీదైన వాచీలు, డిజైనరీ బ్యాగ్స్, బ్రాండెడ్ బట్టలను క్వాలిటీ కోసం కాకుండా స్టేటస్ చూపించుకునేందుకు మధ్యతరగతి ప్రజలు కొంటున్నారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మంది ఈ క్రమంలో ఈఎంఐ ఆప్షన్ వాడుతూ అప్పులపై ఆధారపడుతున్నారని వెల్లడైంది. దీంతో సేవింగ్స్ కి వెళ్లాల్సిన డబ్బు క్రెడిట్ కార్డ్ బిల్లులకు వెళుతోందని తేలింది. అయితే ప్రజలు ఇకపై షాపింగ్ చేసేటప్పుడు తమకోసం చేస్తున్నారా లేక సమాజంలో గొప్పగా కనిపించటం కోసం కొంటున్నారా అనే విషయాలను గమనించుకోవటం ముఖ్యం అని నిపుణులు సూచిస్తున్నారు.