ఇండియన్​ మిస్సైల్​ ప్రోగ్రాం

ఇండియన్​ మిస్సైల్​ ప్రోగ్రాం

భారత రక్షణ వ్యవస్థలో క్షిపణి అభివృద్ధి కార్యక్రమం కీలకమైంది. 1958లో సైన్యానికి చెందిన టెక్నికల్​ డెవలప్​మెంట్​ ఎస్టాబ్లిష్​మెంట్స్​, డిఫెన్స్​ సైన్స్​ ఆర్గనైజేషన్​కు చెందిన డైరెక్టరేట్​ ఆఫ్​ టెక్నికల్​ డెవలప్​మెంట్​ ప్రొడక్షన్​ను కలిపి రక్షణ, పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్​డీఓ) ఏర్పడింది. రక్షణ రంగంలో పరిశోధన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం దీని ఉద్దేశం. 1983లో సమగ్ర నియంత్రణ క్షిపణి అభివృద్ధి కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టుకు ఆద్యుడు ఏపీజే అబ్దుల్​ కలాం. దేశంలోని కొన్ని ప్రభుత్వ రంగ పరిశోధన కేంద్రాలు, ప్రయోగశాలల సహకారంతో డీఆర్​డీఓ చేపట్టిన ఈ కార్యక్రమం 2008లో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకుంది. ప్రస్తుతం ఒక్కో క్షిపణి అభివృద్ధి కార్యక్రమం చేపడుతున్నారు. 

క్షిపణి: స్వయం చోదకశక్తి కలిగి గాలిలో దూసుకుపోయి లక్ష్యాలను ఛేదించే సామర్థ్యమున్న ఆయుధాలను రక్షణశాఖ పరిభాషలో క్షిపణులుగా వ్యవహరిస్తారు. బాహ్య లేదా అంతర్గత వ్యవస్థల ద్వారా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు మొత్తం ప్రయాణాన్ని నియంత్రణ వ్యవస్థలో ఉండేదాన్ని నియంత్రిత క్షిపణి అంటారు. 

పరిధిని బట్టి క్షిపణుల రకాలు

1. స్వల్ప శ్రేణి/ టాక్టికల్​ క్షిపణులు: వీటి పరిధి 500 కి.మీ.
2. మధ్యశ్రేణి/ కీలక క్షిపణులు: వీటి పరిధి 501–5000 కి.మీ.
3. దూరశ్రేణి కీలక క్షిపణి: 5000 కి.మీ.లు అంతకంటే ఎక్కువ

లక్ష్య ఛేదనను బట్టి క్షిపణులు రెండు రకాలు 

బాలిస్టిక్​ క్షిపణి: భూమి గురుత్వాకర్షణ శక్తిని వినియోగించుకొని లక్ష్యాలను ఛేదించేవి. తొలుత బాహ్య అంతరిక్షంలోకి స్వయం చోదకశక్తి ద్వారా చేరి, తిరిగి వాతావరణంలోకి చేరి గురుత్వాకర్షణతో అధిక వేగంతో లక్ష్యాలను ఛేదిస్తుంది.  

క్రూయిజ్​ క్షిపణి: తన ప్రయాణంలో అధికభాగం భూమికి సమాంతరంగా కొద్ది ఎత్తులో సాగుతూ లక్ష్యాన్ని చేరువవుతున్న సమయంలో పైకి లేచి సూపర్​సోనిక్​ వేగంతో లక్ష్యాన్ని ఛేదిస్తుంది. 
ఐజీఎండీపీలో భాగంగా అభివృద్ధి చేస్తున్న టాక్టికల్, ఉపరితలం నుంచి ఉపరితల క్షిపణి – పృథ్వీ, మధ్యశ్రేణి బాలిస్టిక్​ క్షిపణి – అగ్ని స్వల్పశ్రేణి ఉపరితలం నుంచి గగనతలం క్షిపణి – త్రిశూల్​, మధ్యశ్రేణి ఉపరితలం నుంచి గగనతలం క్షిపణి– ఆకాశ్, యుద్ధట్యాంకు విధ్వంసక క్షిపణి – నాగ్​

టాక్టికల్​ క్షిపణులు: త్రిశూల్​, ఆకాశ్​, నాగ్​స్ట్రాటిజిక్​ క్షిపణులు: పృథ్వీ, అగ్ని

పృథ్వీ: ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించగల స్వల్పశ్రేణి బాలిస్టిక్​ క్షిపణి. పృథ్వీ నిర్మాణం తొలిసారిగా 1983లో మొదలైంది. 1985న తొలిసారిగా దీన్ని శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. పృథ్వీ–1, 2, 3, 4, 5లను అభివృద్ధి చేశారు.

కె– సమూహం క్షిపణులు: జలాంతర్గామి నుంచి ప్రయోగించగల బాలిస్టిక్​ క్షిపణుల కుటుంబాన్ని కె–సమూహాల క్షిపణులుగా పరిగణిస్తారు. ఇందులో ఇప్పటికే సాగరిక (కె 15)ను అభివృద్ధి చేశారు. దీని పరిధి 700 కి.మీ. అమెరికా, ఫ్రాన్స్​, రష్యా, చైనా, బ్రిటన్​ తర్వాత ఇలాంటి క్షిపణి ఇప్పుడు భారత్​ వద్ద మాత్రమే ఉంది. 

ఆకాష్​: ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగల స్వల్పశ్రేణి క్షిపణి. దీని పరిధి గరిష్టంగా 30 కి.మీ. రాంజెట్​ సూత్రాన్ని తొలిసారిగా దీనిలో ఉపయోగించారు. పూర్తిగా రాడార్​ నియంత్రణలో పనిచేస్తుంది. 

త్రిశూల్: ​త్రివిధ దళాల అవసరాలకు దీన్ని ఉద్దేశించారు. ఉపరితలం నుంచి గగనతంలోకి ప్రయోగించగల స్వల్పశ్రేణి క్షిపణి. ఈ క్షిపణిని భారత స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. వీటిని భుజం మీద ఉంచుకొని లేదా వాహనం ద్వారా ప్రయోగించవచ్చు. దీని పరిధి 9 కి.మీ. అస్త్ర: గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించగల క్షిపణి అస్త్ర. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ బియాండ్​ విజువల్​ రేంట్​ ఎయిర్​ టూ ఎయిర్​ మిసైల్​ క్షిపణి. పరిధి 80కి.మీ.

ఇండియన్​ బాలిస్టిక్​ మిసైల్​ డిఫెన్స్​ ప్రోగ్రాం

శత్రుదేశం ప్రయోగించే బాలిస్టిక్​ క్షిపణులను గగనతలంలోనే అడ్డుకొని విధ్వంసం చేసే అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ ఇండియన్​ బాలిస్టిక్​ మిసైల్​ డిఫెన్స్​ ప్రోగ్రాం. ఇది రెండంచెల వ్యవస్థ. మొదటి అంచె వ్యవస్థ పృథ్వీ/ ప్రద్యుమ్న ఎయిర్​ డిఫెన్స్​, రెండోది అడ్వాన్స్​డ్​ ఎయిర్​ డిఫెన్స్​. స్వల్ప సమయంలోనే కనీసం రెండు నగరాలను రక్షించే వ్యవస్థలను మోహరించగల క్షిపణి రక్షణ కవచాన్ని డీఆర్​డీఓ  రూపొందించింది.  

ఎస్-400  

ఇది రష్యా తయారు చేసిన ఎయిర్​ డిఫెన్స్​ సిస్టమ్​. 600 కి.మీ. సుదూరం నుంచి ప్రయోగించే క్షిపణులు, భారత భూభాగం వైపు వస్తున్న విమానాలను, అన్​మ్యాన్​డ్ ఏరియల్​ వెహికిల్​లను ఈ అధునాతన రక్షణ వ్యవస్థలోని కమాండ్​ సెంటర్​ పసిగట్టగలదు. వాటి నుంచి ఎదురయ్యే ప్రమాద తీవ్రత ఆధారంగా వేటిని ముందుగా కూల్చాలో నిర్ణయించగలదు. వాటిని నిర్వీర్యం చేసేందుకు కచ్చితత్వంతో క్షిపణులను సంధిస్తుంది. అలాగే తోటి రక్షణ వ్యవస్థలతో సమన్వయం చేసుకోగలదు. ఇందులో మల్టీఫంక్షన్​ రాడార్​,  ఆటోమేటిక్​ వ్యవస్థ, యాంటీ ఎయిర్​క్రాఫ్ట్​ మిసైల్​ సిస్టమ్స్​, లాంచర్లు, కమాండ్​ కంట్రోల్​ సెంటర్లు ఉంటాయి. భారత భూభాగం వైపు దూసుకువస్తున్న 8‌‌‌‌0 వస్తువులను ఏకకాలంలో ట్రాక్​ చేయగలదు. ఇందులో 400 కి.మీ., 250 కి.మీ.ల దీర్ఘశ్రేణి క్షిపణులు, 120 కి.మీ. దూరంలోకి లక్ష్యాలను ఛేదించే మధ్యశ్రేణి క్షిపణులు, 40 కి.మీ. లక్ష్యాలను ఛేదించే స్వల్పశ్రేణి క్షిపణులు ఉంటాయి.

బ్రహ్మోస్​ 

సూపర్​ సోనిక్​ క్రూయిజ్​ క్షిపణి. దీని పరిధి 290కి.మీ. 2007, జూన్​లో సైన్యం అమ్ములపొదిలో చేరింది. భారత్​ రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన రెండు దశల బ్రహ్మోస్​ బరువు 3.9 టన్నులు. యుద్ధనౌక, జలాంతర్గామి, మొబైల్​ లాంచర్లు, నేల లేదా సముద్రం నుంచి దీన్ని ప్రయోగించవచ్చు. 300కిలో పేలోడ్​ను మోసుకెళ్లగలదు. 5-7 మాక్​ల వేగంతో ప్రయాణించే ఒక హైపర్​సోనిక్​ బ్రహ్మోస్​-2 క్షిపణి అభివృద్ధిని భారత్​, రష్యా సంయుక్తంగా చేపడుతున్నాయి. భవిష్యత్తులో 1500 కి.మీ. పరిధి ఉన్న అణుసామర్థ్యం గల ఎల్​ఏసీఎంలను పొందాలన్నది త్రివిధ దళాల లక్ష్యం.