ఎంపీల సస్పెన్షన్​పై ఆందోళన.. ఉభయసభలు వాయిదా

ఎంపీల సస్పెన్షన్​పై ఆందోళన.. ఉభయసభలు వాయిదా
  • స్మోక్ అటాక్ ఘటనపై హోంమంత్రి ప్రకటనకు డిమాండ్

న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభల్లో వరుసగా మూడోరోజూ గందరగోళం నెలకొంది. లోక్ సభలో స్మోక్ అటాక్ ఘటన, ప్రతిపక్షాల ఎంపీలపై సస్పెన్షన్ లపై అపొజిషన్ పార్టీల ఎంపీలు శుక్రవారం కూడా ఆందోళన చేశారు. దీంతో ఎలాంటి ప్రొసీడింగ్స్ జరగకుండానే ఉభయసభలు సోమవారానికి వాయిదాపడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్ సభ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని, నినాదాలు చేస్తూ ఆందోళన మొదలుపెట్టారు.  స్మోక్ అటాక్ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్ సభకు వచ్చి ప్రకటన చేయాలని, పార్లమెంట్ లో భద్రతా లోపానికి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష కాంగ్రెస్, తృణమూల్, డీఎంకే, ఇతర పార్టీల ఎంపీలు డిమాండ్ చేశారు. 14 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడంపైనా నిరసన తెలిపారు. స్మోక్ అటాక్ చేసిన నిందితులకు విజిటర్ పాస్ లు ఇప్పించిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాపై చర్యలు తీసుకోవాలని కూడా నినాదాలు చేస్తూ వెల్ లోకి దూసుకెళ్లారు. దీంతో ప్రారంభమైన ఒక నిమిషానికే సభను స్పీకర్ చైర్​లో ఉన్న రాజేంద్ర అగర్వాల్ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. మధ్యాహ్నం తిరిగి ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు మళ్లీ ఆందోళనకు దిగారు. స్పీకర్ చైర్ లో ఉన్న కిరిట్ సోలంకి ఎంత నచ్చచెప్పినా వినకపోవడంతో ఆయన సభను సోమవారానికి వాయిదా వేశారు.   

రాజ్యసభలోనూ..

రాజ్యసభలోనూ ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనలు మొదలుపెట్టారు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభం కాగానే.. సభలో షెడ్యూల్ చేసిన కార్యకలాపాలను నిలిపేసి, పార్లమెంట్​లో భద్రతా వైఫల్యంపై చర్చ చేపట్టాలంటూ డిమాండ్ చేశారు. ఈ విషయంపై తనకు రూల్ 267 కింద 23 నోటీసులు అందాయని, అన్నింటినీ తిరస్కరిస్తున్నానని చైర్మన్ స్పష్టం చేశారు. అనంతరం జీరో అవర్ ను ప్రకటించారు. దీంతో ప్రతిపక్ష సభ్యులంతా లేచి నినాదాలు ప్రారంభించారు. దీంతో సమావేశాలు నడిచే పరిస్థితి లేకపోవడంతో చైర్మన్ సభను సోమవారానికి వాయిదా వేశారు.    

రాఘవ్ చద్ధాపై చైర్మన్ సీరియస్

రాజ్యసభ మధ్యాహ్నం తిరిగి ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు మళ్లీ నిరసనలు కొనసాగించారు. ఈ సందర్భంగా ఆప్ ఎంపీ రాఘవ్ చద్ధా లేచి చేయి ఎత్తి చూపుతూ.. పాయింట్ ఆఫ్ ఆర్డర్​ను లేవనెత్తారు. సభలో రూల్స్ ఉల్లంఘనపై ఏదైనా విజ్ఞప్తి చేయాలనుకున్నప్పుడు సభ్యులు పాయింట్ ఆఫ్ ఆర్డర్​ను లేవనెత్తుతారు. అయితే, చద్ధా చేయి ఎత్తి చూపడంతో చైర్మన్ ధన్​ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మిస్టర్ చద్ధా.. పాయింట్ ఆఫ్ ఆర్డర్​ను లేవనెత్తేందుకు ఇలా చేయెత్తి చూపాల్సిన అవసరం లేదు. మీ నోటితో చెప్తే చాలు..” అంటూ అసహనం వ్యక్తం చేశారు.

పార్లమెంట్ బయట ఎంపీల నిరసన

ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ బయట శుక్రవారం కూడా నిరసనలు తెలిపారు. భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేయాలని, ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తేయాలని డిమాండ్ చేశారు. పలువురు ఎంపీలు సైలెంట్ ప్రొటెస్ట్ నిర్వహించారు. భద్రతా వైఫల్యంపై ప్రశ్నించిన ఎంపీలను సస్పెండ్ చేయడం ఏమిటంటూ రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు.