కోయంబత్తూరు, బెంగళూరు మధ్య డబుల్​ డెక్కర్​ రైలు

కోయంబత్తూరు, బెంగళూరు మధ్య డబుల్​ డెక్కర్​ రైలు

రైలు ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించేందకు చర్యలు చేపట్టింది రైల్వేశాఖ. ఇందులో భాగంగా ఉదయ్​ ఎక్స్​ప్రెస్​ రైలు కోయంబత్తూరు, బెంగళూరు మధ్య తిరిగి ప్రారంభం కానుంది. ఈ ఉత్క్రిష్ట్ డబుల్ డెక్కర్ ఎయిర్ కండిషన్డ్ యాత్రి (ఉదయ్) ఎక్స్ ప్రెస్‌ను మార్చి 31 నుండి తిరిగి ప్రవేశపెట్టనున్నట్లు భారతీయ రైల్వే, దక్షిణ జోన్ ప్రకటించింది. రైల్వే బోర్డు ఆమోదించిన ప్రకారం రైలు నం.22666 / 22665 కోయంబత్తూర్ Jn- KSR బెంగళూరు-కోయంబత్తూరు ఉదయ్ ఎక్స్ ప్రెస్ రైళ్లు 31 మార్చి నుండి అమలులోకి వస్తాయని దక్షిణ రైల్వే తెలిపింది. బుధవారం మినహా వారానికి ఆరు రోజులు కోయంబత్తూరు, బెంగళూరు మధ్య ఉదయ్ ఎక్స్ ప్రెస్ నడుస్తుంది.    

ప్రయాణికుల సౌలభ్యం కోసం ఉదయ్ ఎక్స్ ప్రెస్ పూర్తిగా ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ తో రూపొందించారు. GPS ఆధారిత ప్రయాణికుల సమాచార వ్యవస్థ, Wi-Fi సౌకర్యం వంటి కొత్త ఫీచర్లను ఈ రైలులో ఏర్పాటు చేశారు.  ఎయిర్ కండిషన్డ్ డబుల్ డెక్కర్ కోచ్‌లు, చైర్ క్లాస్ తో పాటు..ఫుడ్ వెండింగ్ మెషీన్లు, ప్రయాణికుల కోసం ప్రత్యేకమైన డైనింగ్ ఏరియా కూడా ఉంటాయి.

రైలు 22666 కోయంబత్తూరు జంక్షన్ నుండి ఉదయం 5.45 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.40 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. రైలు 22665 బెంగళూరులో మధ్యాహ్నం 2.15 గంటలకు బయలుదేరి రాత్రి 9 గంటలకు కోయంబత్తూరు జంక్షన్‌కు చేరుకుంటుంది. అధునాతన ఉదయ్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు రిజర్వేషన్‌లు ఫిబ్రవరి 24 నుండి అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం...

మార్చ్ 7 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు