స్పేస్‌‌ స్టార్టప్‌‌లకు నిధుల పంట

స్పేస్‌‌ స్టార్టప్‌‌లకు నిధుల పంట
  • వెంచర్‌‌ క్యాపిటల్‌‌ కంపెనీల నుంచి పైసలే పైసలు
  • పెట్టుబడులకు సిద్ధమవుతున్న మరికొన్ని సంస్థలు

బెంగళూరు: అరచేతిలో ఇమిడే శాటిలైట్‌‌‌‌ను రోదసిలోకి పంపే స్పేస్‌‌‌‌ స్టార్టప్‌‌‌‌ ఒకటైతే పర్యావరణానికి అనుకూల ఇంధనాలతో వాటిని పరుగెత్తించే స్పేస్‌‌‌‌ స్టార్టప్‌‌‌‌ మరొకటి. మనదేశంలో ఇలాంటివి వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. భవిష్యత్‌‌‌‌లో స్పేస్‌‌‌‌ స్టార్టప్‌‌‌‌లకు అపార అవకాశాలు ఉంటాయన్న అంచనాల నేపథ్యంలో ఇన్వెస్టర్లను ఆకర్షించడంలో ఇవి ముందుంటున్నాయి. వీటిలో మదుపు చేయడానికి చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నాయి. ఎలక్ట్రిక్‌‌‌‌ థ్రస్టర్లతో, హానిరహిత రసాయనాలతో శాటిలైట్లకు ఇంధనం తయారు చేసే బెంగళూరుకు చెందిన బెలాట్రిక్స్‌‌‌‌ ఏరోస్పేస్‌‌‌‌లో ఒక ఇన్వెస్టర్ల గ్రూప్‌‌‌‌ ఇటీవల మూడు మిలియన్ డాలర్లు (దాదాపు రూ.20 కోట్లు) పెట్టుబడిగా పెట్టింది. సంస్థ కోఫౌండర్‌‌‌‌ కరణం యశస్‌‌‌‌ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ కంపెనీలో ప్రి–సిరీస్‌‌‌‌ ఏ రౌండ్‌‌‌‌ పెట్టుబడులకు వెంచర్‌‌‌‌ క్యాపిటల్‌‌‌‌ ఫండ్‌‌‌‌ ఐడీఎఫ్‌‌‌‌సీ పరంపర నాయకత్వం వహిస్తోంది. బెలాట్రిక్స్‌‌‌‌కు నిధులు ఇచ్చిన ఏడుగురు ఇన్వెస్టర్లలో హీరో మోటోకార్ప్‌‌‌‌ అధిపతి ముంజల్‌‌‌‌ కుటుంబానికి చెందిన సుమన్‌‌‌‌కాంత్‌‌‌‌ ముంజల్‌‌‌‌, బాలీవుడ్‌‌‌‌ నటి దీపికా పదుకోన్‌‌‌‌ కూడా ఉన్నారు. ఎర్త్‌‌‌‌ అబ్వర్వేషన్‌‌‌‌ శాటిలైట్లను డిజైన్‌‌‌‌ చేసి నిర్వహించే ముంబై కంపెనీ కవా స్పేస్‌‌‌‌కు కూడా ఇన్వెస్టర్ల నుంచి నిధులు వచ్చాయని మేనేజింగ్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌ విశేష్‌‌‌‌ రాజారామ్‌‌‌‌ చెప్పారు. అయితే అందిన మొత్తాన్ని మాత్రం వెల్లడించలేదు.

వేచిచూసే ధోరణిలో మరికొన్ని కంపనీలు

ప్రస్తుతం కొన్ని స్పేస్‌‌‌‌ స్టార్టప్‌‌‌‌లకు నిధులు అందినప్పటికీ, మరికొందరు ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణితో ఉన్నారు. పలు స్టార్టప్‌‌‌‌లతో ఇప్పటికీ చర్చలు జరిపామని, తుది నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పడుతుందని మ్యాపిల్‌‌‌‌ క్యాపిటల్‌‌‌‌, ఐడియాస్ప్రింగ్‌‌‌‌ క్యాపిటల్‌‌‌‌,భారత్‌‌‌‌ ఇన్నోవేషన్‌‌‌‌ ఫండ్‌‌‌‌, 3వన్‌‌‌‌4 క్యాపిటల్‌‌‌‌ వంటి కంపెనీలు తెలిపాయి. రోదసి కార్యక్రమాల అమలుకు చాలా సమయం పడుతుంది కాబట్టి లాభాలు కళ్లజూడటానికి సుదీర్ఘకాలం ఎదురుచూడాలని ఐడియాస్ప్రింగ్‌‌‌‌కు చెందిన నాగానంద్‌‌‌‌ దొరస్వామి అన్నారు.   ప్రైవేటు కంపెనీలు ఇస్రో ద్వారా శాటిలైట్లను పంపొచ్చు లేదా ఎలాన్‌‌‌‌ మస్క్‌‌‌‌కు చెందిన స్పేస్‌‌‌‌ ఎక్స్‌‌‌‌, న్యూజిలాండ్‌‌‌‌కు చెందిన రాకెట్‌‌‌‌ ల్యాబ్స్‌‌‌‌నూ వాడుకోవచ్చు. బెలాట్రిక్స్‌‌‌‌ ఇస్రో ద్వారానే తమ శాటిలైట్లను పంపిస్తోంది. రోదసీరంగాన్ని ప్రైవేటు సంస్థలు ఎలా ఉపయోగించుకోవాలో నిర్దేశిస్తూ ప్రభుత్వం రూపొందించిన బిల్లును త్వరగా ప్రవేశపెట్టాలని స్పేస్‌‌‌‌ స్టార్టప్‌‌‌‌లు కోరుతున్నాయి.

మరో ఏడు స్టార్టప్‌‌‌‌లకు కూడా

శాటిలైట్లను, రాకెట్లను, సపోర్ట్‌‌‌‌ సిస్టమ్స్‌‌‌‌ను అభివృద్ధి చేస్తూ స్పేస్‌‌‌‌ మిషన్లలో సాయపడే బెలాట్రిక్‌‌‌‌, కవా వంటి స్పేస్‌‌‌‌ స్టార్టప్‌‌‌‌లు మనదేశంలో 12కుపైగా ఉన్నాయి. ఇవి ఎన్నో కంపెనీలకు తమ సేవలు అందిస్తున్నాయి. రోదసిరంగంలో దశాబ్దాలుగా ప్రభుత్వ గుత్తాధిపత్యమే ఉంది. స్పేస్‌‌‌‌ స్టార్టప్‌‌‌‌లకు భారీగా నిధులు అందడంతో ప్రైవేటురంగం కూడా శాటిలైట్ల సేవలు అందిస్తోంది. ‘‘స్పేస్‌‌‌‌ టెక్నాలజీరంగంలో గతంలోనూ వెంచర్‌‌‌‌ క్యాపిటల్‌‌‌‌ సంస్థలు పెట్టుబడులు పెట్టినా ఇంత భారీగా ఇన్వెస్ట్‌‌‌‌ చేయడం మాత్రం ఇదే మొదటిసారి. బెలాట్రిక్స్‌‌‌‌లోకి రూ.20 కోట్ల పెట్టుబడులు రావడమే ఇందుకు నిదర్శనం’’ అని ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ స్పేస్‌‌‌‌ ప్రొడక్ట్స్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ప్లేస్‌‌‌‌ శాట్‌‌‌‌సెర్చ్‌‌‌‌ కో–ఫౌండర్ నారాయణ్‌‌‌‌ ప్రసాద్‌‌‌‌ అన్నారు. బెలాట్రిక్స్‌‌‌‌, కవాతోపాటు మరో ఏడు స్పేస్‌‌‌‌ స్టార్టప్‌‌‌‌లకు నిధులు అందాయని స్టార్టప్‌‌‌‌ డేటా ట్రాకర్‌‌‌‌ ట్రాక్‌‌‌‌ఎక్స్‌‌‌‌ఎన్‌‌‌‌ తెలిపింది. స్పేస్‌‌‌‌ స్టార్టప్‌‌‌‌లు భూమిపై రెండువేల కిలోమీటర్ల ఎత్తులో చిన్న శాటిలైట్లను పంపించగలుతాయి కాబట్టి వీటికి డిమాండ్‌‌‌‌ బాగుంది. కమ్యూనికేషన్‌‌‌‌ శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టాలంటే మాత్రం మరింత ఎత్తుకు వెళ్లాలి. చిన్న శాటిలెట్ల ద్వారా పంటలను పరిశీలించడం, నిఘా వేయడం, అర్బన్‌‌‌‌ ప్లానింగ్‌‌‌‌ వంటి  పనులు చేయవచ్చు. ఇండియాలో గత ఐదేళ్లలో దాదాపు 24 కంపెనీలు స్టార్టప్‌‌‌‌ల నుంచి యూనికార్న్‌‌‌‌ల స్థాయికి ఎదిగాయి. బిలియన్‌‌‌‌ డాలర్ల కంటే ఎక్కువ వాల్యుయేషన్‌‌‌‌ (దాదాపు రూ.ఏడు వేల కోట్లు) ఎక్కువ ఉన్న కంపెనీలను యూనికార్న్‌‌‌‌ అంటారు. రోదసీ యాత్రలపై, పరిశోధనలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతుండడంతో వీటికి నిధుల వరద పారుతోంది. రాబోయే పదేళ్లలో దాదాపు 17 వేల చిన్న శాటిలైట్లను ఇవి ఆకాశంలోకి పంపుతున్నాయి. అందుకే వీటి  మార్కెట్‌‌‌‌ పెరుగుతోంది. స్పేస్‌‌‌‌ స్టార్టప్‌‌‌‌లో ఇన్వెస్ట్‌‌‌‌ చేసే వారికి భారీ లాభాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.