పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తర్వాత స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలు.. కారణం ఏంటీ..

పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తర్వాత స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలు.. కారణం ఏంటీ..

భారత స్టాక్ మార్కెట్లు సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా భారీ లాభాల్లో దూసుకుపోతున్నాయి. మార్కెట్లు ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.4 లక్షల కోట్లు పెరిగింది. ప్రధానంగా ఆటో, బ్యాంకింగ్ తో పాటుగా టైర్స్, ఎయిర్ లైన్, పెట్రోలియం కంపెనీల షేర్లు ఇంట్రాడేలో లాభాల్లో దూసుకుపోతున్నాయి. దీనికి తోడు ఈరోజు భారత కరెన్సీ రూపాయి డాలర్ తో మారక విలువ 35 పైసలు పెరగటం మార్కెట్లకు పెద్ద రిలీఫ్ గా మారింది. 

ఉదయం 10.15 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 824 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడేలో ఇది 900 పాయింట్ల మేర లాభపడింది. దీనికి తోడు నిఫ్టీ సూచీ 244 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 909 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 500 పాయింట్ల మేర లాభంతో దూసుకుపోతున్నాయి. అయితే ఈ వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇంత వేగంగా దూసుకుపోవటాని వెనుక ప్రధాన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాల బాట పట్టాయి. ఇన్వెస్టర్లలో సరికొత్త ఉత్సాహం నింపడానికి ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. అవేంటంటే.. 

1. ఇరాన్ యుద్ధానికి తెర.. కుదురుతున్న శాంతి ఒప్పందం:
ప్రపంచ దేశాలను వణికించిన ఇరాన్ యుద్ధం ముగింపు దశకు వచ్చినట్లు తెలుస్తోంది. వాషింగ్టన్, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించి అవగాహన ఒప్పందం దాదాపు ఖరారైందని అమెరికా అధ్యక్షుడుట్రంప్ ప్రకటించారు. యుద్ధానికి ముందు ప్రపంచ చమురు, ఎల్‌ఎన్‌జీ రవాణాలో ఐదో వంతు వాటా కలిగిన కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ దీనివల్ల తిరిగి తెరుచుకోనుంది. ఈ భౌగోళిక రాజకీయ సానుకూలతలు మార్కెట్లకు బూస్ట్‌నిచ్చాయి.

2. దిగొచ్చిన క్రూడ్ ధరలు:
ఇరాన్ యుద్ధం ముగిసే అవకాశాలు స్పష్టమవ్వడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. గ్లోబల్ బెంచ్‌మార్క్ క్రూడ్ ఆయిల్ ధరలు గత రెండు వారాల్లో మొదటిసారిగా బ్యారెల్‌కు 100 డాలర్ల కంటే కిందకు పడిపోయాయి. చమురు ధరలు తగ్గడం భారతదేశం లాంటి దిగుమతులపై ఆధారపడే దేశాల ఆర్థిక వ్యవస్థలకు, కార్పొరేట్ రంగానికి పెద్ద ఊరట.

3. ప్రపంచ మార్కెట్ల పరుగులు:
పై రెండు సానుకూల అంశాల ప్రభావంతో ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. మరోవైపు అమెరికా మార్కెట్ సూచీ వాల్ స్ట్రీట్ ఫ్యూచర్స్ కూడా 1 శాతానికి పైగా లాభాల్లో ట్రేడ్ అవుతూ.. అక్కడ కూడా మార్కెట్లు బలంగా ప్రారంభం కానున్నట్లు సంకేతాలిచ్చాయి. ఈ గ్లోబల్ క్యూస్ మన మార్కెట్లలో బుల్ రన్‌కు గట్టి సపోర్ట్ అందించాయి.