Market Crash: మార్కెట్లను కమ్మేసిన యుద్ధ భయాలు.. ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్!

Market Crash: మార్కెట్లను కమ్మేసిన యుద్ధ భయాలు.. ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్!

Sensex-Nifty: నేడు తెల్లవారుజామున 1.44 గంటల సమయంలో భారత త్రివిధ దళాలు సంయుక్తంగా ఆపరేషన్ సిందూర్ విజవయంతంగా నిర్వహించాయి. ఇందులో పాక్ భూభాగంతో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లోని 9 ప్రధాన టెర్రర్ క్యాంపులను బాంబులతో ధ్వంసం అయ్యాయి. అయితే ప్రపంచం మార్కెట్లతో పాటు భారతీయ స్టాక్ మార్కెట్లలోని ఇన్వెస్టర్లు పెరుగుతున్న ఉద్రిక్తతలతో ఆందోళన చెందుతున్నారు. 

నేడు మార్కెట్ ఓపెనింగ్ ముందు ప్రీఓపెనింగ్ సెషన్లో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల దిశగా ప్రయాణాన్ని సూచించాయి. అయితే ఇదే క్రమంలో ఉదయం గిఫ్ట్ నిఫ్టీ సూచీ మాత్రం సాఫ్ట్ స్టార్ట్ ఉంటుందని సూచించింది. ప్రధానంగా ఇప్పటికే అంతర్జాతీయ ఆందోళనలకు తోడుగా భారత్-పాక్ యుద్ధ భయాలపై ఇన్వెస్టర్లు కలవరం చెందుతున్నారు. పాకిస్థాన్ దీనిపై ప్రతీకార చర్య ఉంటుందని, ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తామే ముందుగా చెప్పం అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సర్వత్రా ఆందోళనలకు దారితీస్తున్నాయి. 

నేడు ఉదయం 9.15 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 243 పాయింట్ల నష్టంతో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 66 పాయింట్ల స్వల్ప నష్టంతో ఉంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 33 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 102 పాయింట్ల నష్టంతో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. 

ప్రస్తుతం భారత్ పాక్ మధ్య పెరుగుతున్న యుద్ద భయాలు, బోర్డర్ ఉద్రిక్తతల మధ్య నిపుణులు ఈక్విటీ మార్కెట్లపై కొంత ప్రభావం ఉంటుందని అంటున్నారు. అయితే మరో పక్క యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లపై కీలక ప్రకటన కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తుండగా.. వడ్డీ రేట్ల ప్రకటనతో ప్రభావితం అయ్యే రంగాల షేర్లు మాత్రం దానికి అనుగుణంగా కదులుతాయని వారు అంచనా వేస్తున్నారు. అయితే పహల్గామ్ ఉద్రదాడి తర్వాత భారత్ చర్యలు కేవలం ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి మాత్రమే ఉపయోగిస్తున్నందున ప్రపంచదేశాల నుంచి కూడా దీనికి మద్దతు లభిస్తోంది. ఇది కొంత ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచుతోంది.