
న్యూయార్క్ : అమెరికాలోని న్యూజెర్సీలో ఓ ఇండియన్ స్టూడెంట్(23) తన తాత, నానమ్మ, మేనమామను కాల్చి చంపాడు. దాంతో అతనిపై ట్రిపుల్ మర్డర్ కేసు నమోదైంది. న్యూ డర్హామ్ రోడ్‌లోని కొప్పోలా డ్రైవ్‌లో ఉన్న ఓ అపార్ట్మెంట్లో దిలీప్ కుమార్ బ్రహ్మభట్(72), అతని భార్య బిందు బ్రహ్మభట్(72), కొడుకు యశ్ కుమార్ బ్రహ్మభట్(38) నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు.
గుజరాత్ నుంచి వీరి మనవడు ఓం బ్రహ్మభట్ ఉన్నత చదువుల కోసం 2 నెలల కిందట అమెరికా వచ్చాడని వెల్లడించారు. ఓమ్ ఇటీవల ఆన్‌లైన్‌లో హ్యాండ్‌గన్ కొన్నాడని..దానితో తన గ్రాండ్ పేరెంట్స్, మేనమామను కాల్చి చంపాడని వివరించారు. ఈ విషయం సోమవారం ఉదయం 9 గంటలకు ఓం స్వయంగా ఫోన్ చేసి చెప్పాడని పోలీసులు వెల్లడించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బుల్లెట్ గాయాలతో ఉన్న ముగ్గురినీ ఆస్పత్రికి తరలించామని చెప్పారు. అయితే, అప్పటికే ముగ్గురూ చనిపోయారని డాక్టర్లు నిర్ధారించినట్లు తెలిపారు.
ఓం బ్రహ్మ భట్‌పై ట్రిఫుల్ మర్డర్ కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు తన తాత, నానమ్మ, మామను ఎందుకు చంపాడనేది తెలుసుకోవడానికి దర్యాప్తు జరుపుతున్నామని పేర్కొన్నారు. ఎవరిదగ్గరైనా ఈ కాల్పులకు సంబంధించి సమాచారం ఉంటే తమను సంప్రదించాలని పోలీసులు సూచించారు.