ఇండియన్స్ చూపు యూకే వైపు

ఇండియన్స్ చూపు యూకే వైపు

బ్రిటన్​లో పోస్ట్​ స్టడీ వర్క్​ నిబంధనలతో పాటు పలు సంస్కరణలకు తెరతీసి మరింత మంది విదేశీ విద్యార్థులను ఆకర్షించాలని బ్రిటన్​లో కొత్తగా ఏర్పాటైన బోరిస్​ జాన్సన్​ ప్రభుత్వం యోచిస్తోంది.

2019 మార్చి నాటికి 21,165 మందికి టైర్​ 4 వీసాలు మంజూరయ్యాయని, 2018 తో (15161) పోల్చుకుంటే 40 శాతం పెరుగుదల ఉందని యూకేకు చెందిన ఆఫీస్ ఆఫ్ నేషనల్​ స్టాటిస్టిక్స్ నివేదిక తెలిపింది. బ్రిటన్​లో చదువుతున్న విదేశీ విద్యార్థులు 25 బిలియన్​ పౌండ్స్​ కంటే ఎక్కువ ఆదాయం జనరేట్​ చేయడమే కాక స్థానికంగా ఉద్యోగాల కల్పనకు, వ్యాపారాభివృద్ధికి దోహదపడ్డారని 2017లో నిర్వహించిన ఓ సర్వే నివేదిక తెలిపింది. ఈ నేపథ్యంలోనే రెండు దేశాల మధ్య విద్యా సంబంధ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు రానున్న మూడు నెలల్లో ఇండియాను సందర్శించడంతో పాటు పలు కార్యక్రమాలు చేపట్టనుంది. బ్రిటన్ ప్రభుత్వం 2011లో పోస్ట్ స్టడీ వర్క్​ పర్మిట్​ను రద్దు చేసిన తర్వాత అక్కడ చదివే మన విద్యార్థుల సంఖ్య బాగా తగ్గిపోయింది. 2011లో 38,677 మంది చదువుతుండగా 2016 నాటికి కేవలం 16,655 మంది మాత్రమే బ్రిటన్​లో ఉన్నారు.

సంస్కరణలివే

  • యూజీ, పీజీ అభ్యర్థులందరికీ ప్రస్తుతం నాలుగు నెలలుగా ఉన్న పోస్ట్​ స్టడీ వర్క్​ పర్మిట్​ను 12 నెలలకు పెంచాలని ప్రతిపాదన. ప్రస్తుతం పీహెచ్​డీ అభ్యర్థులకు మాత్రమే ఈ అవకాశం ఉంది.
  • బ్రిటన్​లోని ప్రముఖ యూనివర్శిటీల వైస్​చాన్స్​లర్లు ఈ ఏడాది సెప్టెంబర్​ మొదటి వారంలో ఇండియాలో పర్యటిస్తారు. వీరు మానవ వనరుల అభివృద్ధి శాఖ అధికారులు, ఇండియన్​ వైస్​ ఛాన్స్​లర్లతో సమావేశమై ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలపై చర్చిస్తారు.
  •  సెప్టెంబర్​లోనే లండన్​ స్కూల్​ఆఫ్ ఎకనామిక్స్​, లీడ్స్​ యూనివర్శిటీ నుంచి అధికారిక బృందాలు ఇండియాలో పర్యటిస్తాయి.
  •  అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించి త్వరగా అప్లై చేసుకునేలా ప్రోత్సహించేందుకుగాను #GetReadyForClass క్యాంపెయిన్​ నిర్వహణ
  • బ్రిటన్​లో అండర్​గ్రాడ్యుయేట్​ కోర్సులు చేస్తున్న బ్రిటన్ విద్యార్థులకు అదే కోర్సును కొంతకాలం ఇండియన్​ యూనివర్శిటీల్లో చదువుకునే అవకాశం కల్పించడం.
  •  ఇందుకుగాను యూకే ఇండియా ఎడ్యుకేషన్ అండ్​ రీసెర్చ్​ ఇనిషియేటివ్​ మొబిలిటీ ప్రోగ్రామ్​ను ప్రారంభించడం. దీని కింద 2020 సెప్టెంబర్​లో దాదాపు 200 మంది బ్రిటన్​ స్టూడెంట్స్​ ఇండియాలో చదువుకోనున్నారు.
  •  అలాగే బ్రిటిష్​ కౌన్సిల్​ నిర్వహించే ఫ్యూచర్ లీడర్స్ కనెక్ట్​ ప్రోగ్రామ్​ లో నలుగురు భారతీయులు హసీబా బేగం, ఖాజ్రి బబ్బార్, శాంభవి సింగ్​, శ్రేయా జునేజా పాల్గొనడం

అప్లికేషన్​ ప్రాసెస్​

యూకేలో చదవాలనుకునేవారు ‘టైర్ 4 (జనరల్​ స్టూడెంట్​ వీసా) వీసా తీసుకోవాల్సి ఉంటుంది. పాయింట్ బేస్డ్ (పీబీఎస్) సిస్టమ్​లో ఫండ్స్ మెయింటెనెన్స్ ఆధారంగా పాయింట్లు కేటాయిస్తారు. ముందుగా ఏ కాలేజీలో చేరాలో నిర్ణయించుకొని సంబంధిత వెబ్​సైట్​లో రిజిస్టర్​ చేసుకోవాలి. యూనివర్శిటీ నుంచి అడ్మిషన్ ఆఫర్ లెటర్​ వచ్చిన తర్వాత ఫండ్స్​ సిద్ధం చేసుకోవాలి. అనంతరం ఆన్​లైన్​లో వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. ఆన్​లైన్​ లేదా టెలిఫోన్​ ద్వారా ఇంటర్వ్యూకు అపాయింట్​మెంట్ కోరవచ్చు. అపాయింట్​మెంట్​ లభిస్తే అప్లికేషన్​ తో పాటు సంబంధిత డాక్యుమెంట్స్​తో ఇంటర్వ్యూ కు హాజరవ్వాలి. వీసా ఫీజు, బయోమెట్రిక్​ ఇన్ఫర్మేషన్​, డిజిటల్​ ఫోటో సబ్​ మిట్​ చేసిన తర్వాత అన్ని సరిగా ఉంటే వీసా మంజూరు చేస్తారు. అయితే వీసాకు దరఖాస్తు చేయాలంటే యూకేలో చదువు కోసం విద్యార్థులు అంగీకరిస్తున్నట్లు యూనివర్శిటీ ఇచ్చే కన్ఫర్మింగ్​ అండ్​ యాక్సెప్టెన్స్​ ఆఫ్​ స్టడీ (సీఏఎస్​) నంబర్​ తప్పనిసరి. ఇది సంబంధిత యూనివర్శిటీ ప్రొవైడ్​ చేస్తుంది.

ఇవీ బెనిఫిట్స్​

బ్రిటన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పురాతనమైనది. ఇక్కడి విశ్వవిద్యాలయాలు నాలుగైదు శతాబ్దాల కింద ఏర్పడి అంతర్జాతీయ గుర్తింపు కలిగి ఉన్నాయి. దాదాపు 50 వేలకు పైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటికి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. ఇంగ్లిష్​ లాంగ్వేజ్​ నాలెడ్జ్​తో పాటు​ కెరీర్​ కు కావాల్సిన అన్ని రకాల స్కిల్స్​ నేర్పించడం ఈ యూనివర్శిటీల ప్రత్యేకత. ప్రపంచస్థాయి ప్రమాణాలు కలిగిన ఇన్​ఫ్రాస్ర్టక్చర్​తో 30 శాతం రీసెర్చ్​ ఒక్క బ్రిటన్​ నుంచే వస్తోంది. లండన్​ 5వ స్టూడెంట్​ ఫ్రెండ్లీ సిటీగా గుర్తింపు పొందింది. ఇతర దేశాల్లో డిగ్రీకి నాలుగు, పీజీకి రెండు నుంచి మూడేళ్ల కాలవ్యవధి ఉండగా బ్రిటన్​లో వీటి కంటే తక్కువగా డిగ్రీ మూడు, పీజీ ఒక సంవత్సరంలో పూర్తవుతుంది. బ్రిటన్‌‌‌‌ మొత్తం విద్యార్థుల్లో దాదాపు 60 శాతం విదేశీ విద్యార్థులే కావడంతో కల్చరల్​ డైవర్శిటీ కూడా ఎక్కువే.

గతంలోనే మార్పులు

  • 2016కు ముందు డిగ్రీలు పూర్తవగానే విద్యార్థులు స్వదేశాలకు వెళ్ళిపోవాల్సి వచ్చేది. కానీ 2016 తర్వాత కార్పొరేట్ ఇంటర్న్​షిప్ చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో ఫుల్​టైమ్​ జాబ్​ సాధించే అవకాశం విద్యార్థులకు లభించింది. మళ్లీ ఇప్పుడు 12 నెలల పాటు పోస్ట స్టడీ వర్క్ పర్మిట్​ ను కల్పించాలని భావిస్తున్నారు.
  •  హెచ్​డీ పూర్తి చేసినవారికి 12 నెలలపాటు పోస్ట స్టడీ వర్క్​ పర్మిట్​కు ఆమోదం తెలిపారు. ఈ టైమ్​లో విద్యార్థులు ఎంట్రప్రెన్యూర్​గా కూడా మారొచ్చు.
  • కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫర్ స్టడీస్ లో తెలిపిన కోర్సు కంటే తక్కువ స్థాయి కోర్సులో చేరకూడదు.
  • ఎలాంటి లాంగ్వేజ్ టెస్ట్ లేకుండానే ఒక కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులను అదే కంపెనీకి చెందిన యూకే ఆఫీసుకు బదిలీ చేసే ఇంట్రా కంపెనీ ట్రాన్స్‌‌‌‌ఫర్ (ఐసీటీ) ఆపర్చునిటీ కూడా వచ్చింది. దీనికి ముందు ఇంగ్లిష్ టెస్ట్​ తప్పనిసరిగా ఉండేది.
  • బిజినెస్ వీసా విజిటర్స్, టూరిస్ట్​లు షార్ట్‌‌‌‌టర్మ్ కోర్సులు/ట్రైనింగ్ సెషన్స్​లో పాల్గొనే అవకాశం కల్పించారు.

విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు

అమెరికా         211703

కెనడా             124000

అస్ట్రేలియా        87115

సౌదీ అరేబియా 70800

యూఏఈ        50000

న్యూజిలాండ్​     30000

బహ్రెయిన్        27200

బ్రిటన్​              16550

చైనా               18171

సోర్స్: మినిస్ట్రీ ఆఫ్​ ఎక్స్​టర్నల్​ అఫైర్స్​

(2018 జూలై 18 నాటికి)

  టాప్‌‌ – 10 ఇన్​స్టిట్యూట్స్

  • యూనివర్శిటీ ఆఫ్‍ ఆక్స్​ఫోర్డ్​
  •     యూనివర్శిటీ ఆఫ్‍ కేంబ్రిడ్జ్​
  •     ఇంపీరియల్​ కాలేజ్​ ఆఫ్​ లండన్​
  •     యూనివర్శిటీ కాలేజ్​ ఆఫ్​ లండన్​
  •     లండన్​ స్కూల్​ ఆఫ్​ ఎకనామిక్స్​ అండ్​ పొలిటికల్​ సైన్స్​
  •     యూనివర్శిటీ ఆఫ్​ ఎడిన్​బర్గ్​
  •     కింగ్స్ కాలేజ్​, లండన్​
  •     యూనివర్శిటీ ఆఫ్​ మాన్​చెస్టర్​
  •     యూనివర్శిటీ ఆఫ్‍ బ్రిస్టల్​
  •     యూనివర్శిటీ ఆఫ్‍ వార్విక్​

సోర్స్: టైమ్స్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్

పార్ట్​టైం జాబ్స్​.. స్కాలర్​షిప్స్

డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులైతే వారానికి 10 గంటలు, డిగ్రీ, మాస్టర్స్ చదివేవారు వారానికి 20 గంటలు పార్ట్​టైం వర్క్​ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. యావరేజ్​ లివింగ్​ కాస్ట్​ కూడా తక్కువే. దాదాపు 19 స్కాలర్​షిప్స్​ ద్వారా కోర్సుతో పాటు అకామడేషన్​కూ ఫైనాన్షియల్ సపోర్ట్​ లభిస్తుంది. నేషనల్​ హెల్త్​ సర్వీస్​ ద్వారా ఫ్రీ మెడికల్​ ట్రీట్​మెంట్​ సదుపాయం ఉంటుంది. కోర్సు పూర్తి చేసుకొని బ్రిటన్​లో నివసించే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పై ఎలాంటి పరిమితి లేదు కాబట్టి స్టడీస్​ అయ్యాక అక్కడే ఫుల్​టైం ఎంప్లాయ్​మెంట్ వెతుక్కోవచ్చు. 35 వేల బ్రిటిష్​ పౌండ్స్ శాలరీ ఉంటే పర్మనెంట్​ బ్రిటిష్​ సిటిజెన్​గా దరఖాస్తు చేసుకోవచ్చు.