ఢిల్లీలో ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన మెడికోల ఆందోళన

ఢిల్లీలో ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన మెడికోల ఆందోళన

న్యూఢిల్లీ: దేశంలోని మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉక్రెయిన్ లో వైద్య విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులు డిమాండ్ చేశారు. పేరేంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఉక్రెయిన్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో శనివారం  రాం లీలా మైదానంలో ఆందోళన చేపట్టారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఉక్రెయిన్ – రష్యా యుద్ధం మొదలైన సమయంలో ఆపరేషన్ గంగా పేరుతో తమను స్వదేశానికి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం... అనంతరం  దేశంలోని పలు మెడికల్ కాలేజీల్లో తమకు అడ్మిషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిందన్నారు. కానీ ఐదు నెలలు దాటినా ఇప్పటివరకు తమకు ఏ కాలేజీలో అడ్మిషన్ కల్పించలేదని వాపోయారు. తమకు అడ్మిషన్ కల్పించాలంటూ గతంలో జంతర్ మంతర్ లో దీక్షలు చేశామని, నేషనల్ మెడికల్ కౌన్సిల్ భవనం ఎదుట ఆందోళన చేపట్టామని... అయితే ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అందుకే ఇవాళ రాం లీలా మైదానంలో దీక్షలు చేపట్టినట్లు విద్యార్థులు, తల్లిదండ్రులు తెలిపారు. 

ఉక్రెయిన్ వెళ్లలేక... ఇక్కడ అడ్మిషన్ లేక

ఉక్రెయిన్ వెళ్లలేక... ఇక్కడ అడ్మిషన్ లేక తాము అకడెమిక్ సంవత్సరాన్ని కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తమ చదువులు ఆగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం 18 వేలకు పైగా వైద్య విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చామని,  ఇప్పుడు తమ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. దేశంలో మొత్తం 595 మెడికల్ కాలేజీలు ఉన్నాయన్న వారు... ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు ఆ కాలేజీల్లో  ప్రవేశం కల్పించాలని కోరారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ –రష్యా దేశాల మధ్య యుద్ధం మొదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిస్సైల్స్, బాంబులతో రష్యా  ఉక్రెయిన్ పై విరుచుకుపడింది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులను భారత్ స్వదేశానికి క్షేమంగా తరలించింది.