ఐటీసీ చేతికి బిల్ట్‌‌‌‌? రూ.5,500 కోట్ల పెట్టుబడికి అంగీకారం

ఐటీసీ చేతికి బిల్ట్‌‌‌‌? రూ.5,500  కోట్ల పెట్టుబడికి అంగీకారం
  • కార్మిక వర్గాల్లో జోరుగా చర్చ
  • డ్రోన్‌‌‌‌  కెమెరాలతో సర్వే 
  • పేపర్‌‌‌‌  గుజ్జు ఫ్యాక్టరీ ఆస్తుల లెక్కింపు

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, మంగపేట, వెలుగు:   సొంత రాష్ట్రం ఏర్పడిన కొత్తలో మూతపడిన తొలి ఫ్యాక్టరీ  బిల్ట్​ను ఇండియన్‌‌‌‌  టొబాకో కంపెనీ(ఐటీసీ) దక్కించుకోనుందని కార్మిక వర్గాల్లో చర్చ నడుస్తున్నది.  దాదాపు 5,500 కోట్లు పెట్టుబడి పెట్టి త్వరలోనే  పేపర్‌‌‌‌ గుజ్జు(పల్ప్​) తయారీ ఫ్యాక్టరీని రీ ఓపెన్‌‌‌‌ చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది.  బిల్ట్‌‌‌‌ ఫ్యాక్టరీ దగ్గర  ఫిన్‌‌‌‌ క్విస్ట్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌ కంపెనీ డ్రోన్‌‌‌‌ కెమెరాలతో సర్వే జరుపుతోంది. బిల్ట్‌‌‌‌ ఆస్తులను లెక్కించే పనిలో ఉంది.  బెంగుళూరు నుంచి వచ్చిన ఐదుగురు ఎక్స్​పర్ట్​ టీం బిల్ట్‌‌‌‌ ఫ్యాక్టరీలో సర్వే చేస్తోంది. 

పదేండ్ల కింద మూతపడ్డ ఫ్యాక్టరీ 

ములుగు జిల్లా మంగపేట  మండలం కమలాపూర్‌‌‌‌లో  బిల్ట్‌‌‌‌ ఫ్యాక్టరీ మూతపడి పదేండ్లు అవుతోంది. 1975లో అవంతా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌‌‌‌ కు చెందిన బల్లార్‌‌‌‌ పూర్‌‌‌‌ ఇండస్ట్రీస్  ప్రైవేట్ లిమిటెడ్ (బిల్ట్) సంస్థ ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది.  రోజుకు 300 టన్నుల పల్ప్​ ఉత్పత్తి జరిగేది. 705 మంది పర్మినెంట్‌‌‌‌ కార్మికులు, దాదాపు రెండు వేల మంది కాంట్రాక్ట్  కార్మికులు పనిచేసేవాళ్లు.  ఈ ఫ్యాక్టరీపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవించేవి.  లాస్‌‌‌‌ వస్తుందనే కారణంతో 2014 ఏప్రిల్ లో  బిల్ట్‌‌‌‌ ఫ్యాక్టరీని ఓనర్లు మూసేశారు. ఇక్కడ ఉత్పత్తి చేసే పేపర్ గుజ్జు కంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పేపర్ గుజ్జు తక్కువ ధరకు లభిస్తోందని,  ఇక్కడ తయారయ్యే ముడి సరుకును కొనడానికి సంస్థలు ముందుకు రావడం లేదని చెప్పారు.

600 ఎకరాల విస్తీర్ణం..! 

రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూత పడిన ఫస్ట్‌‌‌‌ ఫ్యాక్టరీ ఇదే.  బిల్ట్‌‌‌‌ ఫ్యాక్టరీ 600 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. కార్మికులకు స్పెషల్​గా క్వార్టర్స్‌‌‌‌ కట్టించారు. కార్మికుల పిల్లలు చదువుకోవడానికి స్కూల్‌‌‌‌ ఉండేది. ఫ్యాక్టరీ మూతపడిన వెంటనే ముందుగా క్వార్టర్స్‌‌‌‌కు కరెంట్‌‌‌‌,  వాటర్‌‌‌‌ సప్లై ఆగిపోయింది. ఆ తర్వాత గుడి, బడి అన్నీ పోయాయి. దీంతో వేలాది మంది కార్మికులు క్వార్టర్స్‌‌‌‌ వదిలేసి బయట అద్దెకు తీసుకొని తలో పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. బిల్ట్‌‌‌‌ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదు.  ఫ్యాక్టరీ తెరిచి నడిపిస్తే ఏటా రూ.300 కోట్ల వరకు సబ్సిడీ ఇస్తామని రాష్ట్ర సర్కారు జీవో జారీ చేసింది. అయినా బ్యాంకు లోన్లు కట్టేది ఉండడంతో బిల్ట్‌‌‌‌ మేనేజ్​మెంట్​ పట్టించుకోలేదు.  ఈక్రమంలో దొంగల కండ్లన్నీ ఫ్యాక్టరీ సామన్లపై పడ్డాయి. కోట్ల విలువ చేసే సామన్లను ఎత్తుకెళ్లి అమ్ముకుంటున్నారు.  కరెంట్​ మోటార్లు, చిన్నగా ఉండి వెయిట్ ఎక్కువ ఉండే ఇనుప వస్తువులు ఎక్కువగా దొంగిలించారు.  దొంగతనం చేస్తుండగా ఎవరైనా చూసి పోలీసులకు చెబితేనే వారిని పట్టుకుని కేసు ఫైల్ చేస్తున్నారు. 

కార్మికులు, ఎంప్లాయిస్‌‌‌‌కు 9.49 కోట్ల చెల్లింపులు

నేషనల్‌‌‌‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌‌‌‌ (ఎన్‌‌‌‌సీఎల్‌‌‌‌టీ) 31 మార్చి, 2023న ఇచ్చిన ఆర్డర్స్‌‌‌‌  ప్రకారం ఈ చెల్లింపులు జరిగాయి. మూత పడిన బిల్ట్‌‌‌‌ ఫ్యాక్టరీని ఇతరులకు అమ్మేసే విషయమై కార్మికులకు  సెటిల్‌‌‌‌మెంట్‌‌‌‌ చేశారు. చట్టప్రకారం 1,926 మంది ఎంప్లాయీస్‌‌‌‌, కార్మికులకు రూ.9.49 కోట్లను చెల్లించారు. అయితే కార్మికులు, ఎంప్లాయిస్‌‌‌‌ ఫ్యాక్టరీ మూసేసిన నాటి నుంచి తమకు రావాల్సిన జీతాలు, ఇతర అలవెన్స్‌‌‌‌లు అన్నీ కలిపి 125 కోట్లు చెల్లించాలని కోరారు. అయితే 2021 ఆగస్టు 24 నాటికి 80.79 కోట్లు చెల్లించేలా కంపెనీ మేనేజ్​మెంట్​ అంగీకరించింది. అయితే ఎన్‌‌‌‌సీఎల్‌‌‌‌టీ ముంబై బెంచ్‌‌‌‌ ఫ్యాక్టరీ ఆస్తులు, అప్పులను లెక్కించి కార్మికులకు, ఎంప్లాయీస్​కు రూ.9.49 కోట్లు చెల్లించేలా ఆర్డర్స్‌‌‌‌ పాస్‌‌‌‌ చేసింది. దీంతో ఇటీవల మేనేజ్​మెంట్​ కార్మికులు, ఎంప్లాయిస్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ అకౌంట్లలో డబ్బులు జమచేశారు.  

డ్రోన్​ కెమెరాలతో సర్వే..

దాదాపు 600 ఎకరాల భూములు కలిగిన బిల్ట్‌‌‌‌ ఫ్యాక్టరీని దక్కించుకోవడానికి ఐటీసీ ప్రయత్నిస్తున్నట్లుగా ఇక్కడి కార్మిక వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ఫ్యాక్టరీని  రీ ఓపెనింగ్‌‌‌‌ చేసి పేపర్‌‌‌‌ గుజ్జు ఉత్పత్తి చేయడానికి రూ.5,500 కోట్లు పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉన్నట్లు చెప్తున్నారు. భద్రాచలం ఏరియాలో ఐటీసీ  సంస్థకు గుజ్జు తయారీ ఫ్యాక్టరీ ఉంది. అయితే కమలాపూర్‌‌‌‌ ఏరియాలో బిల్ట్‌‌‌‌ కు పెద్ద మొత్తంలో భూములున్నాయి. అలాగే కార్మికుల క్వార్టర్స్‌‌‌‌ కూడా కట్టి ఉన్నాయి. దీంతో ఇక్కడ పేపర్‌‌‌‌ గుజ్జు తయారీ కోసం 8వ ఫ్యాక్టరీని లాంచ్‌‌‌‌ చేయాలని ఐటీసీ ప్రయత్నిస్తోంది. దీనికోసం ఇప్పటికే సర్కారు పెద్దలతో మాట్లాడి ఒప్పందాలు చేసుకున్నట్లు చెప్తున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఫిన్‌‌‌‌ క్విస్ట్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌ కంపెనీ ఆధీనంలో ఉన్న బిల్ట్‌‌‌‌ ఫ్యాక్టరీలో  డ్రోన్‌‌‌‌ కెమెరాలతో సర్వే చేస్తున్నారు. బెంగుళూరుకు చెందిన నిపుణుల బృందం వారం రోజుల పాటు ఈ సర్వే చేసి రిపోర్ట్‌‌‌‌ ఇస్తారని బిల్ట్ మాజీ డీజీఎం వై. కేశవరెడ్డి తెలిపారు.

మిషన్లన్నీ ఖరాబు!

1994‒95 సంవత్సరంలో కంపెనీలోని పాత మిషన్ల స్థానంలో  కొత్తవి అమర్చారు. జపాన్, ఫిన్లాండ్, స్వీడన్ దేశాల నుంచి కోట్ల విలువ చేసే మిషనరీని తీసుకొచ్చి ఫ్యాక్టరీని ఆధునీకరించారు. 2014లో ఈ  ఫ్యాక్టరీ మూతపడగానే మిషన్లను పట్టించుకునేవారు లేక, మెయింటనెన్స్‌‌‌‌ చేయక యంత్రాలన్నీ తుప్పు పట్టి ఖరాబయ్యాయి. ఫిన్లాండ్‌‌‌‌ నుంచి తెప్పించిన  డీడీ వాచర్,  షీటింగ్‌‌‌‌ మిషనరీస్‌‌‌‌ తో పాటు కంపెనీలోని పైప్‌‌‌‌ లైన్లు,  భవనాలు శిథిలావస్థకు చేరాయి. జపాన్‌‌‌‌ నుంచి తీసుకొచ్చిన టర్బో జనరేటర్, వీటితో పాటు సోడా రికవరీ ప్లాంట్(ఎస్ఆర్పీ), వాటర్‌‌‌‌ రీ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌, చిప్పర్‌‌‌‌ హౌజ్‌‌‌‌, సున్నం ప్లాంట్, న్యూ కెమికల్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌ ఖరాబయ్యాయి. 

అహర్నిశలు కృషి చేసినం..!

బిల్ట్ ఫ్యాక్టరీ అభివృద్ధి కోసం 35 ఏండ్ల పాటు అహర్నిశలు కృషి చేసినం. ఫ్యాక్టరీ మూసేసిన ఈ పదేండ్లలో 50 మందికి పైగా కార్మికులు చనిపోయిన్రు. అయినా కంపెనీ మేనేజ్​మెంట్​ ఆ కుటుంబాలను ఆదుకోలే. కంపెనీ క్లోజింగ్ న్యాయసమ్మతంగా జరగలేదు. కార్మికులకు న్యాయంగా రావాల్సిన గ్రాట్యూటీ, పీఎఫ్‌‌‌‌ చట్ట ప్రకారం చెల్లించాలి.

‒ వడ్లూరి రాంచందర్‌‌‌‌, శ్రమ శక్తి వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి, మంగపేట

కార్మికులకు అన్యాయం చేసిన్రు

బిల్ట్‌‌‌‌ ఫ్యాక్టరీ ఓనర్లు కార్మికులకు అన్యాయం చేసిన్రు. లాస్‌‌‌‌ వస్తుందని సాకు చూపించి మూసేసిన్రు. పదేండ్ల పాటు జీతాల్లేక కార్మికులంతా ఆగమైన్రు. అనేక పోరాటాలు చేసినం. అయినా మమ్మల్ని ఎవరూ పట్టించుకోలే. ఎన్‌‌‌‌సీఎల్‌‌‌‌టీ ఆదేశాల ప్రకారం ఇచ్చిన పైసలు కూడా మాకు తక్కువే వచ్చినయ్‌‌‌‌. కొత్తగా ఫ్యాక్టరీ తీసుకునేటోళ్లు కార్మికులకు న్యాయం చేయాలే. లేకపోతే ఫ్యాక్టరీలో ఒక్క వస్తువును ముట్టుకోనియ్యం. 

‒ లింగంపల్లి శ్రీనివాసరావు, బిల్ట్ కార్మికుడు, మంగపేట