నా పిల్లలు లేకుండా ఇక్కడి నుంచి కదిలేదే లేదు... పాక్లో భారతీయ మహిళ పోరాటం

నా పిల్లలు లేకుండా ఇక్కడి నుంచి కదిలేదే లేదు... పాక్లో భారతీయ మహిళ పోరాటం

ముంబైకి చెందిన భారతీయ జాతీయురాలు ఫర్జానా బేగం ప్రస్తుతం పాకిస్తాన్‌లో తన పిల్లల సంరక్షణ కోసం పోరాడుతోంది. తన పిల్లల ప్రాణాలకు ప్రమాదం ఉందంటూ  తన స్వదేశానికి తిరిగి వెళ్లడానికి  నిరాకరించింది. ముంబైకి చెందిన ఫర్జానా బేగం 2015లో అబుదాబిలో పాకిస్థాన్ పౌరుడు మీర్జా ముబీన్ ఇలాహీని పెళ్లాడింది. ఆ తర్వాత ఈ జంట 2018లో పాకిస్థాన్‌కు వచ్చారు. వీరికి  ఏడు, ఆరేళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు.

తన కొడుకుల కస్టడీకి సంబంధించిన వివాదంతో పాటు తన కుమారుల పేరిట ఉన్న కొన్ని ఆస్తులకు సంబంధించి తన భర్త తనను చిత్రహింసలకు గురిచేస్తున్నట్లుగా ఫర్జానా ఆరోపిస్తుంది.  ఫర్జానా తనకు విడాకులు ఇచ్చిందంటూ తన భర్త  చేసిన వాదనలను ఆమె తిరస్కరించింది.  అతను తనకు విడాకులు ఇచ్చినట్లయితే తప్పనిసరిగా సర్టిఫికేట్ ఉండాలి కదా ఆమె ప్రశ్నిస్తోంది.  

ఆస్తి తగాదాల కారణంగా పాకిస్థాన్‌లో తనకు, తన పిల్లల ప్రాణాలకు ముప్పు ఉందని, లాహోర్‌లో తనఇంటికే పరిమితమయ్యామని, తన  పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.   తన కుమారులు లేకుండా స్వదేశానికి వెళ్లేందుకు ఫర్జానా నిరాకరించింది. అంతేకాకుండా ఈ కేసు  పరిష్కారం అయ్యే వరకు భద్రత కల్పించాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేసింది.

లాహోర్‌లో తన కొడుకుల పేరిట కొన్ని ఆస్తులు ఉన్నాయని, తన పేరిట, తన పిల్లల పాస్‌పోర్టులు తన భర్త వద్ద ఉన్నాయని ఆమె చెప్తుంది.   ఫర్జానా బేగం మీర్జా ముబీన్ ఇలాహీకి రెండవ భార్య కావడం గమనార్హం. ఇలాహీకి ఇప్పటికే పెళ్లైంది. అతనికి  భార్య, పిల్లలు ఉన్నారు. తనను బెదిరించి భారత్‌కు తిరిగి పంపించాలని తన భర్త కుట్ర పన్నుతున్నారని ఫర్జానా ఆరోపించింది.