సింగపూర్​లో మనోళ్లంటే మంటే

సింగపూర్​లో మనోళ్లంటే మంటే

సింగపూర్ మనకు బాగా తెలిసిన దేశం. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా చెబుతుంటారు. రాజకీయ నాయకులైతే  తాము అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని సింగపూర్​లా మారుస్తామని అంటారు. సింగపూర్ పేరు చెప్పగానే పెద్ద పెద్ద బిల్డింగులు, విశాలమైన రోడ్లు కళ్ల ముందు కదలాడతాయి. ఆ దేశంలో రోడ్డు మీద కాగితం ముక్క వదిలేసినా ఫైన్ కట్టాల్సిందేనంటూ గొప్పగా చెప్పుకుంటాం. క్లీన్ నెస్ కు ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారని అబ్బో అనుకుంటాం. అలాంటి సింగపూర్ లో ఇప్పుడు మన ఇండియన్స్ వివక్ష కు గురవుతున్నారు. పని ప్రదేశాల్లో మనవారి పట్ల అక్కడి వాళ్లు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు.

సింగపూర్ లో ఇండియన్స్ పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఎప్పటి నుంచో ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. లేటెస్ట్ గా ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ కి ఇక్కడ డిమాండ్ పెరగడంతో సింగపూర్ కు ఇండియన్స్ రావడం జోరందుకుంది. అయితే ఆఫీసుల్లో ఇండియన్స్ పట్ల వివక్ష చూపుతున్నట్లు లేటెస్ట్ గా ‘ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పాలసీ స్టడీస్ ’ జరిపిన ఒక స్టడీ వెల్లడించింది. దీనిప్రకారం అసలు ఉద్యోగాలకు అప్లై చేసినప్పుడే  ఇండియన్స్ అని తెలియగానే అప్లికేషన్ ను పక్కన పడేస్తున్నారు. ఎక్కడో ఒకటో రెండో సంఘటనలు కాదు. 68 శాతం మంది ఇండియన్స్ వివక్షకు గురవుతున్నారు. ఇండియన్స్ తో పాటు మలయా జాతికి చెందిన వారు కూడా వివక్షకు గురవుతున్నారు. ఇండియన్స్ పట్ల సింగపూర్ అధికారులు, ప్రజల మైండ్ సెట్ లో 2013 నుంచి బాగా మార్పు వచ్చింది. అప్పటి నుంచీ ఇతర దేశాల వారి పట్ల ముఖ్యంగా ఇండియన్స్ పట్ల వివక్ష చూపడం మొదలైంది. బ్రిటిష్ కాలనీలో భాగంగా ఉన్నప్పటి నుంచి సింగపూర్ కు ఇండియా సహా మిగతా దేశాలకు చెందిన వారు రావడం మొదలైంది. అప్పట్లో బిల్డింగులు కట్టడానికి ఎక్కువ మంది సింగపూర్ కు వచ్చారు.ఆ తర్వాత  మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా  ఉద్యోగావకాశాలు పెరిగాయి. చదువులో  ముందుండటంతో ఇండియన్స్ కు  అవకాశాలు వచ్చాయి. పెద్ద చదువులు చదువుకున్న చాలామంది ఇండియన్ యూత్ ఉద్యోగాలు వెతుక్కుంటూ  సింగపూర్ కు రావడం మొదలైంది. చదివింది పెద్ద చదువులు కావడంతో సహజంగా వీరంతా పెద్ద ఉద్యోగాల్లోనే సెటిలయ్యారు .దీంతో ఒక దశలో  ఐటీ వంటి కీలక రంగంలో మేజర్ పోస్టుల్లో ఇండియన్సే  కనిపించడం మొదలైంది. సింగపూర్ వాసులు చిన్న చిన్న ఉద్యోగాలకే పరిమితమయ్యారు. దీంతో  ఇండియన్స్ తమ ఉద్యోగాలను ఎగరేసుకుపోతున్నారని సింగపూర్ ప్రజలు అనుకోవడం మొదలైంది.ఇదే మెల్లమెల్లగా ఇండియన్స్ పట్ల నెగెటివ్ ఫీలింగ్స్  కలుగచేసింది. ఫలితంగా  ఆఫీసుల్లో ఇండియన్స్ పట్ల  వివక్ష చూపడం మొదలైంది. 2013 నాటికి తాము వివక్ష కు గురవుతున్నట్లు 2.6 శాతం మంది ఇండియన్సే భావిస్తే 2018 నాటికి వారి శాతం 20.8 శాతానికి పెరిగింది.

శాంపిల్స్ గా 4,015 మంది

సింగపూర్ అంటే అనేక జాతుల సమూహం. దాదాపుగా సగం  ప్రపంచంలోని అన్ని జాతుల వాళ్లు ఇక్కడ ఉంటారు. ఏ దేశం నుంచి వచ్చినా  సింగపూర్ కల్చర్ తో వాళ్లంతా మమేకమయ్యారు. ఇక్కడి ఆచార వ్యవహారాలను ఒంట పట్టించుకున్నారు. సింగపూర్ వాసులుగానే బతకడం మొదలెట్టారు. ఒరిజినల్ సింగపూర్ వాసులకు బతకడానికి వేరే దేశాల నుంచి వచ్చిన వారికి మధ్య గొడవలు జరిగినట్లు ఎలాంటి  దాఖలాలు లేవు. అయితే లేటెస్ట్ గా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఇతర  దేశాల నుంచి వచ్చిన వారు పెద్ద సంఖ్యలో సెటిలయ్యారు. ఈ మారిన పరిస్థితుల్లో ఇతర దేశాల నుంచి బతకడానికి వచ్చిన వారి సామాజిక స్థితిగతులపై  సర్వే నిర్వహించారు. ఈ సర్వే కోసం 4,015 మందిని శాంపిల్స్ గా తీసుకున్నారు. ఇండియన్స్ తో పాటు మిగతా దేశాలనుంచి వచ్చిన వారు వివక్ష కు గురవుతున్న విషయం సర్వేలో బయటపడింది.

వివక్ష పై కలిసికట్టుగా పోరాటం చేయాలి

సింగపూర్ గత 50 ఏళ్లలో పెద్ద ఎత్తున అభివృద్ది సాధించింది. ప్రపంచంలోనే బాగా సొమ్ములున్న దేశాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఈ అభివృద్ది కేవలం నేటివ్ సింగపూర్ వాసుల వల్లనే జరగలేదు. ఇండియన్స్ సహా మిగతా దేశాల నుంచి వచ్చిన వేలాది మంది నిపుణులు సింగపూర్ అభివృద్ధిలో  భాగస్వాములయ్యారు. ప్రపంచంలోనే  సింగపూర్ కు ఇవాళ అభివృద్దిపరంగా ఒక గుర్తింపు వచ్చిందంటే అందులో బయటి దేశాల నుంచి వచ్చిన వారి శ్రమ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితుల్లో  ఇండియన్స్ పట్ల వివక్ష ను సామాజిక స్థితిగతులపై అధ్యయనం చేసే ఇక్కడి మేధావులు సీరియస్ గా తీసుకుంటున్నారు.

ఆఫీసుల్లో సిబ్బందికి సంబంధించిన గైడ్ లైన్స్ ను అందరూ అనుసరించేలా  యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని వీరు డిమాండ్ చేశారు. ఇండియన్స్  పట్ల వివక్ష కు తెరదించాల్సిన అవసరం ఉందంటున్నారు.వివక్ష కు తావులేని వాతావరణం నెలకొనేలా చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. దీనికోసం అందరూ కలిసికట్టుగా  ప్రయత్నాలు చేయాలని వీరు పేర్కొన్నారు.

ఇండియన్ ఉమెన్స్​  అసోసియేషన్

సింగపూర్ లో ఉద్యోగాలు చేస్తున్న ఇండియన్స్ లో ఆడవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ‘ ఇండియన్ ఉమెన్స్ అసోసియేషన్’ ( ఐడబ్ల్యుఏ) పేరుతో వీరంతా ఒక సంఘంగా ఏర్పడ్డారు. ఆఫీసుల్లో ఇండియన్ ఉమెన్ కు అన్ని విధాల సాయంగా ఉంటున్నారు.

టూరిజమే నడిపిస్తోంది

అభివృద్ధికి  చిరునామాగా మారడమే కాదు ఇంటర్నేషనల్ టూరిస్టు హబ్ గానూ సింగపూర్  పేరు తెచ్చుకుంది. ఇండియన్స్, చైనీయులతో పాటు మలయా కమ్యూనిటీకి  చెందిన వారు పెద్ద సంఖ్యలో ఇక్కడ  సెటిలవడంతో భిన్న సంస్కృతులకు నిలయంగా మారింది. టూరిజం ఇక్కడ ప్రధాన రాబడి వనరు.  ఇక్కడి నైట్ సఫారీ టూరిస్టులను  బాగా ఆకట్టుకుంటుంది. నైట్ సఫారీ అంటే రాత్రిపూట జూను చూసే ఏర్పాటు. రాత్రివేళల్లో  జంతువులు ఎలా ఉంటాయో, ఎలా ప్రవర్తిస్తాయో గమనించడం టూరిస్టులకు వింత అనుభూతి కలగచేస్తుంది. అలాగే ఇక్కడి ‘ బర్డ్ పార్క్ ’ కూడా టూరిస్టులను ఆకట్టుకుంటుంది. వీటిని చూడటానికి ప్రతి ఏడాది పెద్ద సంఖ్యలో టూరిస్టులు  వస్తుంటారు.

అభివృద్దిలో దూసుకుపోతున్న సింగపూర్​

సింగపూర్ దక్షిణాసియాలోని ఒక చిన్న దేశం. ఒకప్పుడు బ్రిటిష్ వలస రాజ్యం. సింగపూర్  రెండో ప్రపంచ యుద్ద సమయంలో జపాన్ ఆధీనంలోకి వెళ్లింది. 1942 నుంచి 45 వరకు జపాన్ ఆధీనంలోనే ఉంది. తర్వాత అనేక పరిణామాలు జరిగాయి. 1945లో మళ్లీ బ్రిటిష్ వారి వశమైంది. 1963లో మలేసియా ఏర్పడినప్పుడు అందులో భాగంగా ఉంది. చివరకు 1965 ఆగస్టు తొమ్మిదిన ‘ రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ ’ పేరుతో ఒక స్వతంత్ర దేశంగా అవతరించింది. అప్పటికి దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉండేది. చదువుకున్న కుర్రకారుకు ఉద్యోగాలు దొరికే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ అభివృద్ది వైపు అడుగులు వేయడం మొదలెట్టింది. విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున రావడం మొదలైంది. 1990ల నాటికి సింగపూర్ కు ఒక ఇమేజ్ ఏర్పడింది. ప్రపంచంలోనే అభివృద్ధికి ఒక నమూనాగా మారింది.

పేరు వెనక ఇంట్రస్టింగ్ స్టోరీ

సింగపూర్ పేరు వెనక ఓ ఇంట్రస్టింగ్ స్టోరీ ఉంది. 14వ శతాబ్దంలో  సమత్రా ద్వీపం యువరాజు సంగ్ నిల ఇక్కడకు వచ్చినపుడు  సింహం తలతో ఉన్న ఓ వింత జంతువు కనపడిందట. దీంతో సింగపూర్ అని పేరు పెట్టాడట. సింగ అంటే సింహం అని,  పుర అంటే పట్టణం అని అర్థమంటారు  పండితులు.

19వ శతాబ్దం నుంచి అనుబంధం

సింగపూర్ తో మనవాళ్ల అనుబంధం 19వ శతాబ్దం నుంనే ఉంది. ఇక్కడ తమిళులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. దేశ జనాభాలో తమిళులు రెండో స్థానంలో ఉంటారు.  ప్రతి ఏడాది ఇక్కడ హోలీని ఉత్సాహంగా జరుపుకుంటారు. 4 భాషలను సింగపూర్ అధికార భాషలుగా గుర్తించింది. వీటిలో తమిళం కూడా ఉంది. తమిళులతో పాటు తెలుగు, గుజరాతీ, మహారాష్ట్ర, బెంగాలీ, కన్నడ, మలయాళీ వాసులు కూడా సింగపూర్ లో ఉన్నారు. సింగపూర్ లో సెటిలైన ఇండియన్స్ కోసం ఒక పేపర్ కూడా ఉంది. అదే ‘ది తబ్లా’. ఈ పేపర్ ను హార్ట్ బీట్ ఆఫ్ ఇండియన్ కమ్యూనిటీగా పేర్కొంటారు. ఇండియన్స్ ఎదుర్కొంటున్న  సమస్యలను  ఈ న్యూస్ పేపర్  హైలైట్​ చేస్తుంటుంది.